
‘మహా బోధి విహార్‌ను బౌద్ధులకే అప్పగించండి’
సీతమ్మధార: బిహార్‌లోని మహా బోధి విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే అప్పగించాలని ఉత్తరాంధ్ర బౌద్ధ సంఘాల ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఎల్‌ఐసీ బిల్డింగ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయం వరకు మహా శాంతి యాత్ర నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ మహా బోధి విహార్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందన్నారు. అటువంటి ఈ విహార్ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా బౌద్ధులకే ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం బి.టి.ఎం.సి.యాక్ట్ 1949 ప్రకారం చట్టం చేసి.. అందులో నలుగురు హిందూ మహంతులు, నలుగురు బౌద్ధ భిక్షువులతో పాటు కలెక్టర్‌ను చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 9 మంది సభ్యుల్లో ఐదుగురు హిందువులే ఉండేలా చేసి.. ఆలయ అభివృద్ధి, విధానపరమైన నిర్ణయాల్లో బౌద్ధులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా చేసిందని మండిపడ్డారు. ఈ ఆందోళనలో ఉత్తరాంధ్ర జిల్లాల జేఏసీ కన్వీనర్ వి.వి.దుర్గారావు, కో కన్వీనర్ బి.వి.జి.గౌతమ్, జేఏసీ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ మాటూరు శ్రీనివాస్ పాల్గొన్నారు.