దారకొండ హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలు | - | Sakshi
Sakshi News home page

దారకొండ హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలు

Feb 7 2026 9:51 AM | Updated on Feb 7 2026 9:51 AM

దారకొండ హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలు

దారకొండ హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలు

గిరిజన సంక్షేమశాఖ

డిప్యూటీ డైరెక్టర్‌ పరిమళ

విద్యార్థులను చావబాదడంపై విచారణ

సీలేరు: గూడెం కొత్తవీధి మండలం, దారకొండ బాలుర ఆశ్రమ పాఠశాలలో భోజనం బాగోలేదని అడిగినందుకు ఇద్దరు విద్యార్థులను హెచ్‌ఎం హేమచంద్ర తీవ్రంగా కొట్టడం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పాడేరు డిప్యూటీ డైరెక్టర్‌ పరిమళ, ఏటీడబ్ల్యూవో నాగజయలక్ష్మి శుక్ర వారం పాఠశాలలో విచారణ చేపట్టారు.

నిజం అంగీకరించిన హెచ్‌ఎం

తొలుత నీళ్లు నమిలిన హెచ్‌ఎం, డీడీ హెచ్చరికతో విద్యార్థులను కొట్టినట్లు అంగీకరించారు. బాధ్యుడైన హెచ్‌ఎంపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో, కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు డీడీ విలేకరులకు తెలిపారు.

గిరిజన సంఘాల ఆగ్రహం : మెనూ సక్రమంగా అమలు కావడం లేదని, విద్యార్థులపై దాడి చేసిన హెచ్‌ఎంను వెంటనే తొలగించాలని గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. భోజనం నాణ్యతగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు డీడీ దృష్టికి తీసుకువెళ్లారు.

పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

సీలేరు బాలికల పాఠశాలను తనిఖీ చేసిన డీడీ , పదో తరగతి ఫలితాల మెరుగుదలపై కీలక ఆదేశాలు జారీ చేశారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా వెనుకబడిన విద్యార్థుల కోసం రోజుకు రెండు గంటలు అదనపు తరగతులు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ప్రతిరోజూ ఒక సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించి, మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె సూచించారు.గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతం సాధించేలా నూతన డీఎస్సీ ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement