యూపీఎస్సీ ఫలితాల్లో పొన్నారి యువకుడి ప్రతిభ
తాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన సాయికిరణ్ బుధవారం సాయంత్రం విడుదల చేసిన యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) విభాగంలో ఆలిండియా 82వ ర్యాంక్ సాధించాడు. గత జూన్ 8న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యాడు. ఆగస్టు 10న మెయిన్స్ పరీక్ష రాశాడు. నవంబర్ 7న ఇంటర్వ్యూకు హాజరై యూపీఎస్సీకి ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన నోము ల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు చిన్నప్పటి నుంచి చదువులో ముందుంటూ పదోతరగతి వరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. హైదరాబాద్‌లోని ప్రై వేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ పూర్తిచేసి ఇంజినీరింగ్ విద్యను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2021లో పూర్తిచేశాడు. సివిల్స్ సాధనే లక్ష్యంగా 2021 నుంచి యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ పరీక్షలో చేజారినా నిరాశ చెందకుండా పట్టుదలతో పరీక్షలకు సిద్ధమయ్యాడు. రెండోసారి కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్లినా రిజర్వ్ స్థానానికే పరిమితమయ్యాడు. మూడో ప్రయత్నంలో ఐఈఎస్ విభాగంలో ఆలిండియా స్థాయిలో 82వ ర్యాంక్ సాధించాడు. యూపీఎస్సీ ఫలితాల్లో రైతు కుటుంబానికి చెందిన సాయికిరణ్ ప్రతిభ కనబర్చడంతో గ్రామస్తులు అభినందించారు.


