ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను సాధించాలి
కై లాస్‌నగర్: ఆయిల్‌పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పామ్ సాగు, యూరియా ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ లాంటి అంశాలపై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 2,500 ఎకరాల సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 386 ఎకరాల్లోనే సాగైనట్లు తెలిపారు. మండలాల అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఆయిల్‌పామ్ మొక్కల నాన్ సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, నాన్ సబ్సిడీ డీడీలను ఈ నెలాఖరులోపు అందించాలని ఆదేశించారు. కంపెనీలు రైతులకు అండగా నిలువాలని, క్షేత్రస్థాయి సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతుల యూరియా ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ను తీసుకువచ్చిందని తెలిపారు. ఈ నెల 20నుంచి అందుబాటులోకి రానున్న యాప్‌లో వివరాల నమోదుపై వలంటీర్లు, ఏఈవోల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. డీలర్, స్టాక్ వివరాలు యాప్‌లో కనిపిస్తాయని, రైతులు ఇంటివద్ద నుంచే యూరియా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. మొబైల్ నంబర్ ఓటీపీతో లాగిన్ అవుతుందని, పట్టా పాస్‌బుక్, పంట తదితర వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 24గంటల్లోపు సరుకును రైతులు తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా, డీఏవో శ్రీధర్, జిల్లా ఉద్యానవన అధికారి నర్సయ్య, జిల్లా సహకార అధికారి మోహన్, వ్యవసాయ, ఉద్యానవన విస్తరణాధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


