బేలలో సోయా రైతుల ఆందోళన
కైలాస్‌నగర్(బేల): సోయా పంటను కొనుగోలు చే యాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద గల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నాలుగు గంటల పాటు నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలు పూర్తిగా నిలిచాయి. జైనథ్ సీఐ శ్రవణ్, ఎస్సై ప్రవీణ్, డీటీ వామన్ అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. కొనుగోళ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో పలువురు రైతులు కంటతడి పెడుతూ తమ ఆవేదన వ్యక్తం చే శారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో ఫోన్‌లో మాట్లాడించారు. కలెక్టర్‌ను కలిసి సమస్య తెలిపేందుకు అవకాశం క ల్పిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. పంట ను విక్రయించేందుకు బేలలోని సబ్ మార్కెట్‌యార్డుకు వచ్చి నెలవుతున్నా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. నాణ్యత లోపం, కొనుగోలు పరిమితి పూర్తయిందనే సాకుతో కొనుగోళ్లు నిలిపివేశారని పేర్కొన్నారు. తీవ్రమైన చలిలో మార్కెట్ యార్డులో పంటను ఉంచి పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోయారు. తమ పంటనంతా కొనుగోలు చేయాలని, ఆ దిశగా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.


