ఉపసర్పంచ్ ఎన్నికపై డీపీవోకు ఫిర్యాదు
కై లాస్‌నగర్: తమ గ్రామ ఉపసర్పంచ్ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగలేదని తాంసి మండలంలోని కప్పర్ల పంచాయతీ వార్డుమెంబర్లు ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో గెలుపొందిన పలువురు వార్డుమెంబర్లు సోమవారం డీపీవో రమేశ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. గ్రామంలో 12 వార్డులుండగా ఉపసర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థికి కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు మాత్రమే ఉందన్నారు. మిగతా ఏడుగురు సభ్యుల ప్రమేయం లేకుండా ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారని ఆరోపించారు. వార్డు మెంబర్లందరి సమక్షంలోనే ఉపసర్పంచ్ ఎన్నిక జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ప్రమాణస్వీకారం చేయమని, అవసరమైతే మూకుమ్మడి రాజీనామా చేస్తామని తెలిపారు. డీపీవోను కలిసిన వారిలో వార్డు సభ్యులు సంగీత, అర్చన, వనిత, అనసూయ, షేక్ లతీఫ్, రమేశ్, శ్రీకాంత్ ఉన్నారు.


