
పెద్దాస్పత్రిలో మౌలిక వసతుల కల్పనకు కృషి
నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని సూపరింటెండెంట్ మాధవి చెప్పారు. మదర్ అండ్ చైల్డ్ విభాగంలోని పలు వార్డులను హాస్పిటల్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులతో కలిసి మంగళవారం ఆమె తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను ఆరాతీశారు. ఈ సందర్భంగా హెచ్‌డీఎస్ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు మాట్లాడారు. గదుల్లో దెబ్బతిన్న ఫ్లోర్ టైల్స్‌ను సరిచేయించాలని, మరుగుదొడ్లలో శుభ్రతతో పాటు బకెట్లు, మగ్గులుండేలా, నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. రాత్రి పూటా ల్యాబ్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. లిఫ్ట్‌లు సక్రమంగా పని చేయకపోవడంతో వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. స్కానింగ్ పరీక్ష కేంద్రం వద్ద ఆలస్యాన్ని నివారించాలని కోరారు. అనంతరం మాధవి మాట్లాడారు. డాక్టర్లు, సిబ్బంది ఓపీల్లో సకాలంలో రోగులకు సేవలందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గైనకాలజీ హెచ్‌ఓడీ గీతాలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అడ్మినిస్ట్రేషన్ అధికారి డాక్టర్ కళారాణి, హెచ్‌డీఎస్ కమిటీ నేతలు శ్రీనివాసులు, మొగరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.