వెలుగు దరికి... తెలుగు దారి
దారులేసిన అక్షరాలు! ఇరవయ్యవ శతాబ్దపు మహిళల రచనలతో వస్తున్న సంకలనం. ఇంగ్లిష్‌లో వచ్చిన ‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’కు తెలుగు అనువాదం! ఆంగ్లమూలానికి సారథ్యం వహించిన వనితలు సూశీతారు, కె.లలితలే ఈ తెలుగు అనువాదానికీ సంపాదకత్వం వహించారు. తెలుగు దారులేసిన ఈ అక్షరాలు ఫిబ్రవరి ఏడో తారీఖున ఆవిష్కృతం కానున్న సందర్భంగా ఈ పుస్తకం అచ్చుకి దారి తీసిన వైనం లలిత మాటల్లో...
‘విమెన్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ను తెలుగులోకి అనువదించాలని 20 ఏళ్ల కిందటే అనుకున్నాం. అది ఇప్పటికి సాధ్యం అయింది. ఓ ప్రాంతీయ భాష (తెలుగు)లోకి ఈ పుస్తకాన్ని తేవడం ఇదే ప్రథమం. వాస్తవానికి 1995లో పని మొదలుపెట్టినా 2000 తర్వాతే ఓ క్రమంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న వాళ్లందరికీ వేరే వ్యాపకాలుండడం వల్ల అనువాదం పార్ట్‌టైమ్‌గా సాగడమే ఇందుకు కారణం. ఇందులో కొన్ని పోయెమ్స్‌ను కలేకూరి ప్రసాద్ అనువాదం చేశారు. ఆయనతో పాటు అనువాదం చేసినవాళ్లలో నలుగురైదుగురు ఇప్పుడు లేరు. వాళ్లందరినీ పుస్తకంలో ప్రస్తావించాం. ఈ సంకలనం రెండు భాగాలు. మొదటిది.. ప్రాచీనకాలం నుంచి 19వ శతాబ్దం వరకు. రెండవది 19 శతాబ్దం నుంచి ఇప్పటి వరకు. ‘ఇప్పటివరకు’ అంటే 1958 వరకు. మొత్తం 600 మంది రచయిత్రులను ఎంపిక చేసుకున్నాం. స్థలాభావం వల్ల చివరికి వారిని 136 మందికి కుదించాం. అవే రెండు వాల్యూమ్స్ అయ్యాయి. మిగిలినవన్నీ భద్రంగా ఉన్నాయి.
ముందుమాట
ఉపోద్ఘాతాన్ని నేనే తర్జుమా చేశాను. దీనికోసం చాలా విషయాలను పరిశీలిం చాల్సి వచ్చింది. కొన్ని పదాలకు తెలుగులో అసలు భావనలే లేవు. ఒక్కోసారి ఉన్న పదాలకు కొత్త అర్థం ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు కొత్తపదాలనే వాడాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ కృతకంగా అనిపించొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుమాటను అనువాదం చేయాల్సి వచ్చింది.
అనుభవాలు
ఇంగ్లిష్ ప్రాజెక్ట్‌లో ఉన్నపుడు పదిమందిమి క్రమం తప్పకుండా కలుసుకునే వాళ్లం. అసలు సమావేశ స్థలాన్ని నిర్ణయించుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కలిసి చర్చించేటప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలిశాయి. దృక్పథాలు విస్తృతమయ్యాయి.
పాతకాలంలో రచనలు ఎలా చూడాలి అన్న అవగాహన పెరిగింది. విశ్లేషణ తెలిసింది. ముద్దుపళిని, బెంగుళూరు నాగరత్నమ్మలను కొత్తకోణంలో చూడ్డం తెలిసింది. పరిశోధనలో భాగంగా ఎన్నో గ్రంథాలయాలకు వెళ్లడంవల్ల వాటి స్థితిగతులు చూసే అవకాశం వచ్చింది. కొన్ని లైబ్రరీలో పుస్తకాలు ఒక క్రమ పద్ధతిలో లేవు. వాటిని మేం సర్దివచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఈ అన్వేషణలో భాగంగా దేశంలోని ఎంతోమంది సాహితీవేత్తలు పరిచయం అయ్యారు.
తెలుగు ఆలోచన ఎలా మొదలైంది..?
1985లో.. మేము ఒక అయిదుగురం కలిసి ఒక డాక్యుమెంటరీ చేయాలనుకున్నాం సూశీ ఆధ్వర్యంలో. తను ప్రాజెక్ట్ హెడ్. సూశీ అప్పుడు సీఫెల్లో (ఇప్పటి ఇఫ్లూ) ఉన్నారు. అప్పటికే మేమందరం కలిసి ‘స్త్రీ శక్తి సంఘటన్’లో కలిసి పనిచేశాం. తెలంగాణ పుస్తకాలు అన్నీ వేశాక.. మహిళా అంశాల మీద డాక్యుమెంటరీ తయారు చేయాలనుకున్నాం. తమిళం, బెంగాలీ, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు.. భాష లకు సంబంధించి వర్క్ మొదలుపెట్టాం. ఈ పని చేసే సందర్భంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తటస్థించాయి. ఆ ఉద్వేగంలో ఇంకొన్ని రచనలను చూడడం, వాటన్నిటినీ వేరుగా ఓ సంకలనం కింద వేస్తే ఎట్లా ఉంటుందనే ఆలోచన తట్టింది సూశీకి. ఆ విధంగా ఈ అయిదు భాషల్లోని రచనలతో పని మొదలు పెట్టాం. ఆ అన్వేషణలో ఈ అయిదు భాషల్లోనేకాక ఇతర భాషల్లోకూడా మంచి రచనలున్నాయని కొంతమంది చెప్పడం, ఆ ప్రాంతీయ భాషల్లో ఎడిటర్స్‌గా పనిచేసేవాళ్లు దొరకడంతో తర్వాత మెలమెల్లగా భాషలన్నీ చేర్చాం. అలా మొత్తం పదకొండు భాషలయ్యాయి. సూశీ, నేను, వసంతకణ్ణభిరన్, విద్యుత్ భాగవత్ (మరాఠీ), ఝర్నాధార్ (బెంగాలీ), అఫీసా బాను (ఉర్దూ) ఇలా అందరం ఆయా భాషలకు సంపాదకులుగా వ్యవహరించి ప్రాజెక్ట్ పూర్తిచేశాం. ఆ రోజుల్లో కంప్యూటర్స్ లేవు.. టైపింగ్ అంతా టైప్‌రైటర్ మీదే. అలా మొదలై 1991లో ఇంగ్లీష్‌లో ‘విమెన్స్ రైటింగ్స్ ఇన్ ఇండియా’ మొదటి వాల్యూమ్ పబ్లిష్ అయింది. ’93లో రెండో వాల్యూమ్ వచ్చింది.
ఎలా వెదికారు?
ఏది మంచి సాహిత్యం, ఏదికాదు? స్త్రీలెలాంటివి రాశారు వంటి ప్రశ్నలన్నీ రావడం, స్త్రీల అంశాల మీద ఆసక్తి ఉండి, స్త్రీవాద ధోరణిలో ఆలోచించగలవాళ్లను వెదుక్కుంటూ పోయాం. కొన్నిసార్లు వాళ్లే ఎదురుపడడం, ఈ భాషలకు సంబంధించిన సాహితీవేత్తలు, మేధావులు, చరిత్రకారులతో చర్చలు కొనసాగించి నప్పుడు వాళ్లు కొంతమంది పేర్లను సూచించడం.. ఇలా మెలమెల్లగా పనిలోకి దిగాం. ఉర్దూ, మరాఠీ, కన్నడ, బెంగాలీ, మలయాళం, తమిళం, గుజరాతీ, తెలుగు, ఒడియ, హిందీ, ఇంగ్లీషే కాకుండా అస్సామీ, పంజాబీలాంటి భాషలనూ చేర్చడానికి ప్రయత్నించాం. ఆ ఉత్సాహంలో ఇంకా చూడాలి.. ఇంకా చూడాలని అని చాలా దూరమే వెళ్లాం. కుదర్లేదు. ఆ భాషల్లో పనిచేయగలిగిన వాళ్లు లేరని కాదు కానీ మాకు తటస్థపడలేదు. ఇది చాల్లే అన్నట్టుగా 11 భాషలకే పరిమితమయ్యాం. విమెన్స్ రైటింగ్స్ ఇన్ ఇండియాను ఫెమినిస్ట్ ప్రెస్ పబ్లిష్ చేసింది. పబ్లిషింగ్ అప్పుడు కాపీరైట్స్ లాంటివి కీలక అంశాలయ్యాయి. మన దగ్గర 25 ఏళ్ల కిందట కాపీరైట్స్ అనేదానికి అంత ప్రాముఖ్యతలేదు. ఎందుకంటే కాపీరైట్ ఆయా రచయిత్రుల పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. లేదంటే వీలూనామాలో నైనా ప్రస్తావన ఉంటుంది. కానీ చాలామంది రచయిత్రులు దీనికి అంత ప్రాధాన్యమిచ్చినట్టు కనబడలేదు. కారణం.. వీళ్ల పిల్లలెవరికీ అసలు వాళ్లు ఏం రాసారో కూడా గుర్తులేదు. అలాగే పబ్లిష్ అయిన వాటికి కొన్నిటికి తేదీలు కూడా లేవు. ఈ విషయంలో ఫెమినిస్ట్ ప్రెస్ చాలా నిక్కచ్చిగా ఉంది. భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన సమస్యలూ ఉండకూడదని ప్రెస్ ఆలోచన. మేం చేసిన ఈ ప్రయత్నం ఇక్కడితో ఆగకుండా ఈ తరమూ దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. ఇంకెన్నో రచనలు, రచయిత్రులు వెలుగులోకి వస్తారు.