breaking news
wimbledon open title
-
వింబుల్డన్ కిరీటం సెరెనా సొంతం
-
వింబుల్డన్ కిరీటం సెరెనాదే
లండన్: వింబుల్డన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సంచలనమేమీ జరగలేదు. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న స్పెయిన్ యువ టెన్నిస్ తార గాబ్రినె ముగురుజ కల ఫలించలేదు. కిరీటం పాత చాంపియన్‌నే వరించింది. అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ ఆరోసారి వింబుల్డన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌నూ, కెరీర్లో ఓవరాల్‌గా 21వసారి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌నూ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్ సమరంలో సెరెనా 6-4, 6-4 స్కోరుతో ముగురుజపై విజయం సాధించింది. గ్రాండ్‌స్లామ్ చరిత్రలో అత్యధిక మహిళల సింగిల్స్ టైటిళ్లు సాధించిన మార్గరెట్ కోర్ట్ (24), స్టెఫీగ్రాఫ్ (22) తర్వాతి స్థానంలో సెరెనా (21) నిలిచింది. ఫైనల్ సమరం ఆసక్తిగా ఆరంభమైంది. సెరెనా, ముకురుజ మధ్య నువ్వానేనా అన్నట్టు పోరు సాగింది. 21 ఏళ్ల ముగురుజ తొలి గేమ్‌ను సొంతం చేసుకుని శుభారంభం చేసింది. అయితే సెరెనా అనుభవం ముందు ముగురుజ పోరాటం ఫలించలేదు. ప్రపంచ నెంబర్ వన్ సెరెనా తన స్థాయికి తగ్గ ఆట ఆడుతూ 20వ ర్యాంకర్ ముగురుజను నిలువరించింది. సెరెనా తొలి సెట్‌ను 6-4తో సొంతం చేసుకుంది. తొలి సెట్లో సెరెనా, ముగురుజ చెరో మూడు ఏస్ లు సందించారు. ఇక రెండో సెట్లో సెరెనాకు ఎదురు లేకుండా పోయింది. అమెరికా నల్లకలువ తన పవర్ చూపించి 5-1తో ముందంజ వేసింది. ఈ సమయంలో ముగురుజ విజృంభించి వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకుంది. కాగా సెరెనా మరోసారి సత్తాచాటి 6-4తో రెండో సెట్‌ను, మ్యాచ్‌ను వశం చేసుకుంది. వింబుల్డన్‌లో ఆరోసారి సింగిల్స్ టైటిల్‌ను ముద్దాడింది. సెరెనా ప్రొఫైల్: జన్మదినం: 1981 సెప్టెంబర్ 26 స్వస్థలం: మిచిగాన్‌లోని సాగినా, అమెరికా వయసు: 33 1995లో కెరీర్ ఆరంభం ప్రస్తుత ర్యాంక్-1 కెరీర్ సింగిల్స్ టైటిల్స్-67 డబ్ల్యూటీఏ మొత్తం గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య: 36 గ్రాండ్‌స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్-21 ఆస్ట్రేలియా ఓపెన్ -6 ఫ్రెంచ్ ఓపెన్-3 వింబుల్డన్-6 యూఎస్ ఓపెన్-6 గ్రాండ్‌స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్స్-13 గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్-2 ఒలింపిక్స్ గేమ్స్ 2012లో స్వర్ణం