breaking news
Weavers Problems
-
ఇద్దరు కూతుళ్లకు ఉరేసి తండ్రి ఆత్మహత్య
దుబ్బాకటౌన్: ఆర్థిక బ్బందుల కారణంగా ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ కథనం ప్రకారం.. లచ్చపేటకు చెందిన బడుగు రాజేందర్(40) చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. నమ్ముకున్న వృత్తిలో ఆదాయం సరిగా లేకపోవడంతో ఆ పనిని వదిలి కుటుంబాన్ని పోషించేందుకు దుబ్బాకలో చిన్నగా గ్యాస్ స్టవ్‌ల రిపేరు దుకాణం పెట్టుకున్నాడు. ఏడాది క్రితం రాజేందర్ భార్య విజయలక్ష్మి బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఆస్పత్రిపాలవడంతో చికిత్సకోసం దాదాపు నాలుగు లక్షలు అప్పులు చేశాడు. వ్యాధి తీవ్రమై ఆమె మృతి చెందింది. భార్య చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో పాటు ఇద్దరు కూతుళ్లు.. భవానీ (9), లక్ష్మి(6)లను ఎలా పోషించాలో అర్థం కాక తీవ్రమనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి రాజేందర్ తన కూతుళ్లు భవానీ, లక్ష్మి నిద్రపోతున్న సమయంలో వారిని ఇంట్లో దూలానికి నైలాన్ తాడుతో ఉరివేసి, తానూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం రాజేందర్ తల్లి యాదమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా దూలానికి తండ్రీ కూతుళ్లు వేలాడుతూ కన్పించారు. ఆమె పెద్దగా కేకలు పెడుతూ రోదిస్తూ బయటకు రావడంతో చుట్టుపక్కల వారు విషయం తెలుసుకుని దుబ్బాక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సుభాష్‌గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్, సిద్దిపేట రూరల్ సీఐ వెంకట్రామయ్య కూడా సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందించారు. మృతుడు రాజేందర్ తాము ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నామంటూ రాసి ఉంచిన లెటర్ ఇంట్లో లభ్యమయిందని ఎస్ఐ సుభాష్‌గౌడ్ తెలిపారు. -
'చేనేత సమస్యలు పరిష్కరిస్తాం'
శాశ్వత ఉపాధి కోసం ఖర్చుకు వెనుకాడం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకయినా వెనకాడబోదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పద్మశాలి, దాని ఉపకులాలకు చెందిన చేనేత కార్మికులను కాపాడే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కె.తారకరామారావును ఆదేశించారు. చేనేత కార్మికుల సంక్షేమం అంశంపై గురువారం ప్రగతి భవన్లో సీఎం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు చేనేత శాఖ డైరెక్టర్ శైలజారామయ్యార్, ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, సమాచార శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎంవో అధికారులు భూపాల్‌రెడ్డి, స్మితా సబర్వాల్, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన కులాలవారి సంక్షేమం, ఆ కులాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. యాదవులు, గొల్ల కుర్మల కోసం గొర్రెల పెంపకం; ముదిరాజ్, బెస్త, గంగపుత్రుల కోసం చేపల పెంపకం వంటి కార్యక్రమాలను విప్లవాత్మక రీతిలో ప్రారంభించినట్లుగానే... చేనేతపై ఆధారపడి జీవిస్తున్న పద్మశాలి, ఉప కులాల కోసం కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు. వినియోగదారుల ఇష్టాయిష్టాలను గుర్తించి ఉత్పత్తికి సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. సామాజిక పరిణామ క్రమంలో దేశవ్యాప్తంగా కుల వృత్తులు కనుమరుగు అవుతున్నాయని, కుల వృత్తులపై ఆధారపడి జీవించేవారికి మేలు కలిగేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు చేపట్టాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సమగ్ర నివేదిక ఇవ్వండి భేటీ సందర్భంగా చేనేత పరిశ్రమల నుంచి వినియోగదారులకు అందుతున్న ఉత్పత్తుల గురించి సీఎం ఆరా తీశారు. సిరిసిల్ల, నల్లగొండ, వరంగల్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చేనేత మగ్గాలు, మరమగ్గాల సంఖ్య, వాటిపై ఆధారపడి జీవిస్తున్నవారి సంఖ్య, నెలసరి ఆదాయం, చేనేత కార్మికుడు స్వయం సమృద్ధి చెంది తన కుటుంబంతో సుఖంగా జీవించేందుకు చేపట్టాల్సిన పనులు, వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో చేనేత కుటుంబాలకు దొరికే ఉపాధి విస్తృతి, సూరత్–ముంబై తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను తెలంగాణకు తిరిగి రప్పించి ఉపాధి కల్పించేందుకు ఉన్న అవకాశాలు..వంటి అంశాలపై నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు.