ప్రాణమంటే లెక్కలేదా...
కేజీహెచ్‌లో ప్రమాదకరంగా ప్రాణ వాయువు
{పమాణాలకు తిలోదకాలు
లక్షల విలువైన ఆక్సిజన్ వృథా
జనావాసాల మధ్యనే ఫిల్లింగ్ ట్యాంకు
{పజలు, రోగులకు ప్రాణ సంకటం
కేజీహెచ్ అధికారుల నిర్లిప్తత, కాంట్రాక్టర్ కక్కుర్తి నగరవాసులకు ప్రాణాపాయంగా మారింది. జనావాసాల మధ్య ద్రవ ఆక్సిజన్‌ను నిల్వ చేసే ట్యాంకు ఉండడంతో ఏ క్షణానైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రమాదం సంభవిస్తే కృష్ణానగర్‌లో మూడు నాలుగు కిలో మీటర్ల మేర విధ్వంసం తప్పదు. ప్రాణం పోసే వాయువే(ఆక్సిజన్) ప్రాణం తీసేలా ఉంది. ప్రమాదం పొంచి ఉన్నా జిల్లా యంత్రాంగం స్పందించకపోవడం, కేజీహెచ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం భయాందోళన రేపుతోంది.
విశాఖపట్నం: కింగ్ జార్జ్ హాస్పటల్(కేజీహెచ్)లో ఊపిరి నిలబెట్టే ప్రాణవాయువే మృత్యువుగా మారే ప్రమాదముంది. ఆక్సిజన్ సరఫరాలో స్వలాభం కోసం నాణ్యతకు, రక్షణకు తిలోదకాలిచ్చేయడం కలవరపరుస్తోంది. లోపభూయిష్టంగా తయారైన సరఫరా విధానంపై తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరముంది. కేజీహెచ్‌లో అత్యవసర సేవలకు మెడికల్ ఆక్సిజన్‌ను ఓ కాంట్రాక్టర్ నుంచి తీసుకుంటున్నారు. ప్రతి రోజూ 7 పీసీసీ(1 కేన్=25 సిలిండర్లు) కేన్లు వినియోగిస్తున్నారు. ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.24.13పైసలు, 5శాతం టాక్స్ చొప్పున(ఒక సిలిండర్=7.1క్యూబిక్ మీటర్లు, ఒక కేన్=220 కేజీలు) ప్రభుత్వం చెల్లిస్తోంది. 2011-12లో రూ.19.50పైసలు ఇచ్చేవారు. అంటే ఏడాదికి రూ.38, 77,55 ఖర్చు చేసేది. 2012-13లో రూ.40 లక్షలు కాంట్రాక్టర్‌కు ఇచ్చారు. ఆ తర్వాత ఈ కాంట్రాక్టరును వదిలి కొత్త కాంట్రాక్టర్‌కు ఆక్సిజన్ సరఫరా బాధ్యతలు అప్పగించారు. తదుపలి ఏడాది ఖర్చును పెంచి రూ.86.92లక్షలు చెల్లించారు. 2014-15 లో ఇప్పటి వరకూ రూ.71లక్షలు చెల్లించారు. నిజానికి ప్రతి ప్రభుత్వాసుపత్రిలో మెడికల్ ఆక్సిజన్ చిన్న ట్యాంకు ఉంటుంది. దాని వల్ల ఖర్చు తగ్గుతుంది. అలాంటిది కేజీహెచ్‌లో కనిపించదు. పైపులు, సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు.
కాంట్రాక్టర్లతో కుమ్మక్కు:
కేజీహెచ్ అధికారులు కాంట్రాక్టర్లలో కుమ్మకై లెక్కలు తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు ఎన్ని నింపుతున్నారు. సిలిండర్‌ను పూర్తిగా నింపుతున్నారా లేదా అనే దానిని పరీక్షించేందుకు ఎలాంటి శాస్త్రీయ విధానాలను అనుసరించడం లేదు. దీంతో కాంట్రాక్టరు ఎన్ని ఇచ్చామంటే అన్నే లెక్క. జనావాసాల మధ్యనే కాంట్రాక్టరు ఫిల్లింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, భారీ ట్యాంకులో ద్రవ ఆక్సిజన్‌ను నిల్వ ఉంచారు.
ప్రమాదం జరిగితే కనీసం మూడు నాలుగు కిలోమీటర్లు వరకూ భారీ ఆస్ధి, ప్రాణ నష్టం వాటిల్లుతుందని తెలిసినా అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. టెస్ట్ చేయించని సిలిండర్లతో ఆక్సిజన్ సరఫరా చేయడం వల్ల రోగి ప్రాణానికి ప్రమాదం వాటిల్లుతుంది. కేజీహెచ్ ఇన్చార్జ్ సూపరింటెండెంట్ కడలి సత్యవరప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా దీనికి సంబంధించి తనకేమీ తెలియదని బదులిచ్చారు.
ప్రమాణాలకు తిలోదకాలు
పీసీసీ కేన్లతో ఆక్సిజన్ సరఫరా చేయడానికి చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎక్స్‌ప్లోజివ్స్(సీసీఓఇ) అనుమతి(లెసైన్స్) అవసరం. సిలిండర్‌ను ప్రతి ఐదేళ్లకోసారి టెస్ట్ చేయించాలి. సిలిండర్‌కు వేపరైజర్స్ ఉండాలి. కానీ కేజీహెచ్‌కు సరఫరా అవుతున్న ద్రవ ఆక్సిజన్ సిలిండర్లకు ఇవేవీ కనిపించవు. ఆక్సిజన్ సిలిండర్లను ఏడు అత్యవసర విభాగాల్లో ఉంచారు. కనీస రక్షణ ఏర్పాట్లు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా సిలిండర్ల నుంచి ఆక్సిజన్ భారీగా లీకవుతోంది. ఇది ప్రమాదం. ఆక్సిజన్‌కు మంటలను మండించే గుణం ఉండటంతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉక్కువగా ఉంది. స్టీల్ సిలిండర్లులో ద్రవ ఆక్సిజన్‌ను నింపుతున్నారు.