breaking news
VVIP chopper deal
-
ఆ భారీ స్కాంలో టార్గెట్ సోనియా!
న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తేల్చుకోవడానికి బీజేపీ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ ప్రమేయముందని వెల్లడించడం ద్వారా ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో హస్తాన్ని ఇరుకున పెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటులో ఈ అంశంపై చర్చ సందర్భంగా సోనియాగాంధీ పేరును ప్రస్తావించే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీతో వీఐపీ హెలికాప్టర్ల కోసం గత యూపీఏ ప్రభుత్వం రూ. 3,600 కోట్ల ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందంలో అవినీతి చోటుచేసుకుందని, అందులో భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి హస్తం కూడా ఉందని ఇటాలియన్ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది. 2010లో జరిగిన ఈ ఒప్పందంలో 66-99 కోట్ల రూపాయల వరకు నిధులను అక్రమంగా భారతీయ అధికారుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రుజువైందని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో హెలికాప్టర్ల స్కాంపై, ఇష్రత్ జహాన్ కేసుపై పార్లమెంటులో చర్చకు బీజేపీ అనురాగ్ ఠాకూర్ నోటీసులు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర వాగ్వాదానికి దిగే అవకాశం కనిపిస్తోంది. ఈ కుంభకోణంలో సోనియాగాంధీ స్వయంగా అక్రమాలకు పాల్పడినట్టు పేర్కొనకపోయినప్పటికీ, ఈ ఒప్పందం కుదరడంలో ఆమె ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ (తెరవెనుక శక్తి)గా ఉన్నారని ఇటలీ కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసు తీర్పులో సోనియా, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్లను ఇటలీ కోర్టు ప్రస్తావించినప్పటికీ, వారి గురించి ఎలాంటి ఆధారాలు ఉన్నట్టు పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో సోనియా పేరుతో కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టాలని బీజేపీ భావిస్తున్నది. మరోవైపు అప్పట్లో ఈ ఒప్పందాన్ని రద్దుచేసిన అప్పటి రక్షణశాఖ మంత్రి ఆంటోనీ మాట్లాడుతూ కేంద్రం తొందరగా దర్యాప్తుచేసి.. దోషులను శిక్షించాలని కోరారు. -
మనీ లాండరింగ్ కేసులో ఈడీకి నోటీసులు
న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు గురువారం నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ప్రముఖ న్యాయవాది, వ్యాపారవేత్త గౌతమ్ ఖైతాన్కు బెయిల్ అప్పీల్‌పై ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. రూ.3600 కోట్ల వీవీఐపీ ఛాపర్ లావాదేవీల్లో అవకతవకలపై గౌతమ్ ఖైతాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలైలో గౌతమ్ ఖైతాన్తోపాటు మాజీ ఐఎఎఫ్ అధికారి ఎస్పి త్యాగి మరో 19మందిపై ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ డీల్‌లో 360 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయన్న దానిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. -
అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం రద్దు
-
‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం రద్దు
న్యూఢిల్లీ: వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం బుధవారం రద్దుచేసింది. భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేసేందుకు 2010లో రూ.3,600 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’, దీనికోసం రూ.360 కోట్ల మేరకు ముడుపులు చెల్లించినట్లు దాదాపు ఏడాది కిందట వెలుగులోకి రావడంతో రాజకీయంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చే నాటికే ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ భారత్‌కు మూడు హెలికాప్టర్లను సరఫరా చేసింది. ప్రభుత్వం కూడా 30 శాతం మొత్తాన్ని కంపెనీకి చెల్లించింది. ఇందులో ముడుపుల వ్యవహారానికి సంబంధించి ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’కు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు సాగిస్తున్న సీబీఐ, ఇందులో ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్.పి.త్యాగిని కూడా నిందితుడిగా పేర్కొంది. భారత్‌కు 12 వీవీఐపీ హెలికాప్టర్ల సరఫరా కోసం 2010 ఫిబ్రవరి 8న ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ప్రీ-కాంట్రాక్ట్ ఇంటిగ్రిటీ ప్యాక్ట్‌ను (పీసీఐపీ) ఉల్లంఘించినందున ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తక్షణమే రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు బుధవారం రక్షణశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే రక్షణశాఖ దీనిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపిన తర్వాత ఒప్పందాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఒప్పందం రద్దు చేసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం తరఫున మధ్యవర్తిగా వ్యవహరించేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జీవన్ రెడ్డిని రక్షణ శాఖ నియమించింది. మరోవైపు, ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ కూడా తన తరఫున ఇప్పటికే మధ్యవర్తిని నియమించుకుంది. కాగా, ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ నుంచి ప్రభుత్వం 50 కోట్ల యూరోలు (రూ.4,253 కోట్లు) నష్టపరిహారంగా కోరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే విధంగా చేపట్టాల్సిన చర్యలపై రక్షణ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. హెలికాప్టర్ల ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లుగా తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఒప్పందం రద్దుకు ముందే రక్షణ మంత్రి ఆంటోనీ స్పష్టం చేశారు. అయితే, భారత్ ఇప్పటికే తీసుకున్న మూడు హెలికాప్టర్ల సంగతేం చేస్తారనేది ఇంతవరకు స్పష్టం చేయలేదు. కాగా, మధ్యవర్తిత్వం ద్వారా ఈ వ్యవహారం పరిష్కారానికి ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ గత అక్టోబర్‌లో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి, దీనికి ఈ ఏడాది జనవరి 4 వరకు గడువు విధించింది. తన తరఫున మధ్యవర్తిగా మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణను నియమించుకుంది. ఎలాంటి అవకతవకలూ చేయలేదు... వీవీఐపీ హెలికాప్టర్ల ఒప్పందంలో ఎలాంటి అవకతవకలూ చేయలేదని ‘అగస్టా వెస్ట్‌ల్యాండ్’ కంపెనీ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఒప్పందం రద్దుకు సంబంధించి భారత రక్షణ శాఖ నుంచి ఇంతవరకు తమకు సమాచారం అందలేదని వెల్లడించింది.