breaking news
Viktor Yanukovych
-
క్రిమియాపై రష్యా ఆధిపత్యం
ఉక్రెయిన్‌లో కెర్చ్ ఓడరేవు స్వాధీనం కవ్వింపు చర్యలు ఆపాలి: అమెరికా కీవ్ (ఉక్రెయిన్)/వాషింగ్టన్: అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నా ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌లోకి తన బలగాలను వేగంగా దింపుతోంది. రష్యా అభిమానులు ఉండే ఆ దేశ తూర్పు ప్రాంతం క్రిమియాను పూర్తిగా స్వాధీనంలోకి తెచ్చుకుంది. దీనిపై ఉక్రెయిన్ సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా దండయాత్రకు దిగడంతో తాము వినాశనపు అంచున ఉన్నామన్నామంటూ ఉక్రెయిన్ ప్రధాని అర్సెని యాట్సెన్యుక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తమ చర్యల్ని రష్యా సమర్థించుకుంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడేవరకూ క్రిమియాలో అదనపు బలగాల అవసరం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్ చెప్పారు. బాయ్‌కాట్ చేస్తామని, ఆంక్షలు విధిస్తామని పాశ్చాత్య దేశాలు హెచ్చరించడాన్ని ఆయన ఆక్షేపించారు. పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఇప్పటికీ న్యాయబద్ధమైన అధ్యక్షుడని రష్యా ప్రధాని దిమిత్రి మెద్వదెవ్ పేర్కొన్నారు. మరోపక్క తమ దేశానికి 20 కిలోమీటర్ల చేరువలో ఉండే ఉక్రెయిన్ ఓడరేవు పట్టణం కెర్చ్ను రష్యా అనుకూల దళాలు అధీనంలోకి తీసుకున్నాయి. ఇప్పటికే క్రిమియాపై పట్టుసాధించిన రష్యా.. కెర్చ్ రేపు ద్వారా మరిన్ని బలగాలను ఉక్రెయిన్‌కు పంపే అవకాశం ఉందంటూ ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ చొరబాట్లను నిరోధించి రష్యా దళాలను వెనక్కి పంపే వ్యూహాలు ఆ దేశాలు రచిస్తున్నాయి. ఉద్రిక్తతలను పెంచే చర్యలు ఆపాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ను కోరారు. కాగా, క్రిమియాలో రష్యాకు అనుకూలంగా వ్యవహరించే గవర్నర్లను తొలగించే పనిని ఉక్రెయిన్ చేపట్టింది. అంతేగాక నేవీ చీఫ్‌ను కూడా తొలగించింది. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దళాలు మోహరించిన ప్రభావం అంతర్జాతీయ ఆయిల్ రేట్లపై పడే అవకాశం కనిపిస్తోంది. మాస్కో స్టాక్ ఎక్చేంజి 13 శాతం నష్టపోయింది. డాలర్‌తో రూబుల్ మారక విలువ తగ్గింది. ఆసియా, యూరప్ మార్కెట్లు ఒడిదుడులకు లోనయ్యాయి. -
ఉక్రెయిన్‌లో ‘అగ్ర’పోరు
సంపాదకీయం: అగ్రరాజ్యాల యుద్ధ క్రీడలో మరో దేశం నెత్తురోడుతోంది. నెలరోజుల నుంచి భీకర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ అంతుర్యుద్ధంలోకి జారుకున్న ఉక్రెయిన్...దాన్నుంచి కోలుకునేలోపే దురాక్రమణల భయంతో వణుకుతున్నది. భవిష్యత్తు అగమ్యగోచరమై తల్లడిల్లుతున్నది. ఆ దేశ భౌగోళిక స్వరూపం, ప్రపంచ పటంలో దానికున్న కీలక స్థానం ఆ దేశానికి శాపాలయ్యాయి. నిన్నమొన్నటి వరకూ ఆ దేశాధ్యక్షుడిగా ఉన్న విక్టర్ యానుకోవిచ్‌ను లోబరుచుకుని దాన్ని తమ పెరడుగా మార్చుకోవాలనుకున్న యూరోపియన్ యూనియన్(ఈయూ), అమెరి కాల కలలు కల్లలు కాగా... దేశంలో ‘విప్లవం’ బయలుదేరి ఆయన కాస్తా ఉడాయించాల్సివచ్చింది. యానుకోవిచ్ స్థానంలో మరొకరు పీఠంపై కూర్చుని రోజులు గడవకుండానే ఇప్పుడు రష్యా సేనలు భారీయెత్తున క్రిమియా ద్వీపకల్పానికి చేరుకుంటున్నాయి. ఏతా వాతా ఉక్రెయిన్ ఇప్పుడు ప్రపంచదేశాల రణరంగస్థలిగా మారింది. అమెరికా, రష్యాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి ఉద్రిక్తతలు అలుముకున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాతావరణం వేడెక్కుతోంది. సోవియెట్ యూని యన్ పతనమయ్యాక ప్రపంచంలో ఇక ఉద్రిక్తతలు తొలగినట్టేనని, ప్రపంచ పౌరులు ఇక ప్రశాంతంగా బతకవచ్చని హామీ ఇచ్చిన అమెరికా ఆ ముసుగులో ఏక ధ్రువ ప్రపంచాన్ని కలలుగన్నదని...ప్రపంచం తన కనుసన్నల్లో నడవాలని వాంఛించిందని అనంతర పరిణామాలు రుజువు చేశాయి. 2004లో ఆర్ధిక సంక్షోభం పెను ఉద్యమాన్ని సృష్టించినప్పుడు అందులో చేతులూ, కాళ్లూ పెట్టి దాన్ని ‘ఆరెంజ్ విప్లవం’గా మలిచిన అమెరికా గూఢచార సంస్థ సీఐఏ మరోసారి అదే పనిలో బిజీగా ఉంది. ఉక్రెయిన్ ఈయూతో ఉండాలా, రష్యాకు ఉపగ్రహంలా బతకాలా అనే మీమాంస పరిస్థితిని ఈ స్థితికి తెచ్చింది. ఒకప్పుడు సోవియెట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ వాణిజ్యబంధమంతా రష్యాతోనే ముడిపడి ఉంది. అధిక ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ప్రధాన సమస్యలై వేల కోట్ల డాలర్ల రుణ భారంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ను ఆదుకుంటామంటూ ఈయూ ముందుకొచ్చింది దాన్ని తమ ప్రాబల్యప్రాంతంగా మార్చుకుందామనే. రష్యాకు పొరుగునున్న ఉక్రెయిన్ను నాటో స్థావరంగా మలిస్తే అటు రష్యానూ, ఇటు చైనానూ ఏకకాలంలో అదుపుచేయడానికి అవకాశం ఉంటుందని అమెరికా, ఈయూలు ఎత్తులేశాయి. దీన్ని సకాలంలో పసిగట్టిన పుతిన్...ఉక్రెయిన్‌కు అవసరమైన ఆర్ధిక సాయం అందించి దాన్ని తన తోవలోకి తెచ్చుకున్నారు. అనుకోని ఈ పరిణామాలు ఈయూ మానసపుత్రులైన ఉక్రెయిన్ విపక్షానికి ఆగ్రహం కలిగించింది. దీనికి ఈయూ ఆజ్యంపోసింది. పర్యవసానంగా అంతుర్యుద్ధ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యర్థి పక్షాల ఘర్షణలు, సైనికుల కాల్పులు వందమందికిపైగా ప్రాణాలు బలిగొన్నాయి. తాజా పరిణామాలతో ఇప్పటికే క్రిమియా ద్వీపకల్పంలో ఉన్న తన సేనలను భారీగా పెంచుతున్న రష్యాను అమెరికా అధ్యక్షుడు ఒబామా ‘ఉక్రెయిన్‌లో సైనిక జోక్యం చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సివస్తుంద’ని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు... ఆ ప్రాంతంలోకి అమెరికా యుద్ధ నౌకలను తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బెదిరింపుల సంగతి వదిలేస్తే... మాస్కోలో వచ్చే జూన్‌లో జర గాల్సిన జీ-8 దేశాల సమావేశాన్ని, అంతకన్నా ముందు జరిగే సన్నాహక సమావేశాన్ని ఈయూ, అమెరికాలు బహిష్కరిస్తాయి. పర్యవసానంగా రష్యాకు వాణిజ్య ఒప్పందాల ద్వారా చేకూరవలసిన ప్రయోజనాలన్నీ ఆగిపోవచ్చు. వీసాలపై నిషేధం, ఆస్తుల స్తంభన, వాణిజ్యం, పెట్టుబడులపై భారీ జరిమానాలు వంటివి అమల్లోకి రావొచ్చు. అంతమాత్రాన రష్యా వెనక్కు తగ్గుతుందా? 2008లో రష్యా జార్జియాపై దండయాత్ర చేసినప్పుడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ ఇలాగే బెదిరించారు. అయితే, ఆరేళ్ల తర్వాత కూడా జార్జియాలో రష్యా ఆధిపత్యం సడలలేదు. బెదిరింపులకో, హితవచనాలకో లొంగిపోయే స్థితిలో రష్యాలేదు. దానికున్న వనరులరీత్యా చూసినా ఆ దేశాన్ని ఆర్ధికంగా దిగ్బంధించడం ఈయూకు, అమెరికాకు అసాధ్యం. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధ ప్రకటన చేశాక ఉక్రెయిన్ తాత్కాలిక అధ్యక్షుడు ‘మేం ప్రమాదంలో పడ్డాం. ఆదుకోండి’ అని అమెరికా, ఈయూలకు మొరపెట్టుకుంటున్నాడు. కానీ, ఆ మొర ఆలకించడం, పుతిన్ చర్యలకు దీటుగా స్పందించడం వాటికి సాధ్యంకాదు. రష్యా సమకూర్చే ఇంధనంపై అనునిత్యమూ ఆధారపడే యూరప్ ఖండంలోని సగానికిపైగా దేశాలు అమెరికాకు దన్నుగా నిలుస్తాయనుకోవడం భ్రమే. ఉక్రెయిన్ జనాభాలో సగభాగంగా ఉన్న రష్యా పౌరులు ప్రమాదంలో పడటంవల్లే తమ సేనల్ని పంపవలసి వస్తున్నదని పుతిన్ సమర్ధించుకుంటున్న తీరు ఆ దేశం వెనక్కి తగ్గని వైఖరిని సూచిస్తున్నాయి. మొత్తానికి రష్యా, పశ్చిమ దేశాల సంఘర్షణకు ఇప్పుడు ఉక్రెయిన్ వేదికగా మారింది. ఏ సంక్షోభమైనా, అంతర్యుద్ధమైనా సామాన్య పౌరులను సంక్షోభంలోకి నెట్టేస్తాయి. ఇప్పటికే ఉక్రెయిన్నుంచి ఆరు లక్షలమంది శరణార్ధులు రష్యాకు చేరుకున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యం కోసం సాగించే ఇలాంటి ప్రమాదకర క్రీడలకు తెరదించకపోతే ఉక్రెయిన్‌లో పరిస్థితులు మరింతగా క్షీణిస్తాయి. తన గమ్యాన్ని, లక్ష్యాన్ని నిర్దేశించుకునే స్వేచ్ఛాస్వాతంత్య్రాలు అన్ని దేశాలకూ ఉన్నట్టే ఉక్రెయిన్‌కూ ఉండాలి. ఆ మౌలిక హక్కులను గౌరవించకపోతే నాగరిక దేశాలుగా చెప్పుకునే అర్హత తమకుండదని అగ్రరాజ్యలు గుర్తించాలి. ఉక్రెయిన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి చిత్తశుద్ధితో కృషిచేయాలి.