breaking news
vemula veeresam
-
కోమటిరెడ్డీ.. నీకంత సీన్ లేదు !
సాక్షి, హైదరాబాద్: సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై పోటీ చేసేంత సీన్ నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో తన సీటు గల్లంతవుతుందని, ఓటమి తప్పదన్న భయంతోనే పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏనాడూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని గుర్తించని ఆయన.. అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించడం ప్రచారం కోసమేనని అన్నారు. నల్లగొండలో అంత బలం ఉందనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో నిలబడితే ఎవరి బలమెంతో తెలుస్తుందని సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, జాతీయంగా, అంతర్జాతీయంగా తెలంగాణకు, సీఎం కేసీఆర్‌కు వస్తున్న గుర్తింపును చూసి ఓర్వలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కేటీఆర్‌పై, మంత్రి జగదీశ్‌రెడ్డిపైనా ఓర్వలేని తనంతోనే విమర్శలు చేస్తున్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. -
వివక్షపై సారించిన బాణం
సందర్భం నేడు ప్రపంచ మేధావి, పీడిత తాడిత ప్రజల విముక్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ . అంబేడ్కర్ 125వ జయంతి జరుపుకోబోతున్నాం. అలాగే ఐక్యరాజ్యసమితి ఏర్పడిన తర్వాత ఇప్పటికి అంబేడ్కర్ గొప్పతనాన్ని ఆమోదించి ఆయన జయంతిని ఘనంగా జరపతలపెట్టింది. అందుకే ఆయన జీవితాన్ని, అనుభవా లను, ఆయన అందించిన ఆశయ జ్యోతిని, అనుసరించాల్సిన మార్గాన్ని సింహావలోకనం చేసుకోవటం అవశ్యం. సరిగ్గా 125 ఏళ్ల క్రితం అంటే 1891 ఏప్రిల్ 14వ తేదీన సెంట్రల్ ప్రావిన్స్‌లోని మావ్ మిలటరీ కంటోన్మెంట్లో (ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఉంది) రాంజీ సక్పాల్, భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మిం చారు అంబేడ్కర్. చిన్నతనంలోనే భారతీయ కులవ్యవస్థ వికృతరూపం ఫలితాలను చవిచూ సిన అంబేడ్కర్ మనిషిని మనిషిగా చూడ నిరాకరిస్తూ ద్వేషిస్తూ, వివక్షకు, అణచివేతకు గురి చేస్తున్న ఈ అధర్మ సూత్రాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. ప్రతి అణచివేతా బాల అంబేడ్కర్లో చైతన్యాన్ని రాజేసింది. ప్రశ్నించడం అలవర్చుకున్నాడు. వయసుతోపాటు పెరిగిన చైతన్యం నేపథ్యంలో 21 ఏళ్లకే భారత్‌లోని కులాల సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి గ్రంథస్తం చేయగలిగాడు. తాను ఏ అణచివేతకు గురయ్యాడో దాన్ని రూపుమాపేందుకు, మానవీయ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేం దుకు తన జీవిత కాలమంతా పోరాడాడు. తాననుభవించిన అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఎన్నో సమరశీల పోరాటాలు నిర్వహించారు. మహద్ చెరువు పోరాటం, కాలారామ్ దేవాలయ ప్రవేశం వీటిలో మచ్చుకు కొన్ని. ప్రపంచంలోనే అతి పెద్దదైన లండన్ మ్యూజియం లైబ్రరీని ఆపోసన పట్టిన అతికొద్ది మంది మేధావుల్లో ఒకరైన అంబేడ్కర్ నిరంతర అధ్యయన శీలి. చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం, హిందూ తాత్విక తకు మూలమైన వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఖురాన్, బైబిల్, ఇతర ప్రామాణిక గ్రంథాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. వాటిలో మంచిచెడులను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి వేలాది పేజీలతో పుస్త కాలు రాశారు. ‘శూద్రులెవ్వరు? అస్పృశ్యులెవ్వరు?’ ‘రాష్ట్రాలు- అల్పసం ఖ్యాక వర్గాలు’, ‘గాంధీ, కాంగ్రెస్ అంటరానివారికి ఏం చేశారు?’ ‘కులని ర్మూలన’ అన్నవి వాటిలో కొన్ని. ఆయన రచనలు మానవీయ సాంఘిక విలువలు పాటించే నూతన సమాజానికి, నవ సమాజానికి ఆవిష్కరణలు. 1926 నుంచి భారత రాజ్యాంగం రాయాలని బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం నెహ్రూ నాయ కత్వాన రాజ్యాంగ రచనా సంఘం, 1929లో, 1931లో రౌండ్‌టేబుల్ సమావేశం, 1944లో సప్రూ కమిషన్‌ను నియమించింది. కానీ రాజ్యాంగ రచన సాధ్యం కాలేదు. ఈ స్థితిలోనే బ్రిటిష్ ఇండియా స్టేట్ సెక్రటరీ లార్డ్ బిర్కెన్ హెడ్ భారతీయులకు రాజ్యాంగ రచన చేయగల సమర్థత లేదని ఎద్దేవా చేశాడు. ఈ సవాలును స్వీకరించిన డా.బి.ఆర్ అంబేడ్కర్ ఒక్కడే 114 రోజుల్లో భారత రాజ్యాంగాన్ని 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 4,600 ప్రొసీడింగ్స్, 7,635 అమెం డ్మెంట్్్తో పూర్తి చేశారు. 1949 నవంబర్ 25న రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమ ర్పించారు. వీటిలో 2,473 అంశాలను చర్చించగా వీటన్నింటికీ డా. అంబేడ్కర్ ఒక్కరే సమర్థ వంతంగా సమాధానం చెప్పి ఆమోదింపచేశారు. రాజ్యాంగ రచనా కమిటీలో ఏడుగురు సభ్యు లుండగా ఇద్దరు విదేశాలకు వెళ్లిపోయారు. ఒకరు రాజీనామా చేయగా మరొకరిని మార్చారు కానీ ఆ ఖాళీని పూరించలేదు. మిగిలినవారు ఇతర కారణాలతో సహకరించలేకపోయారు. అయినా ఈ కొండంత భారాన్నీ తనపైనే వేసుకుని తన ఆరోగ్యాన్ని, ఆర్థిక అవసరాలను, కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా నిస్వార్థంగా రాజ్యాంగ రచనను పూర్తి చేశారు అంబేడ్కర్. స్వాతంత్య్రానంతరం అంబేడ్కర్ న్యాయ శాఖామంత్రిగా ఉండగా, స్త్రీల సమాన హక్కు లకు ఉద్దేశించిన హిందూ కోడ్ బిల్లును రూపొందించగా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పార్ల మెంటు ద్వారా తిరస్కరింప చేసింది. దీంతో అంబేడ్కర్ మంత్రిపదవిని తృణప్రాయంగా పరిత్యజించి రాజీనామా ద్వారా తన అసమ్మతిని తెలియచేశారు. అలాగే హిందూమతంలోని అసమానతల్ని ఎత్తిచూపుతూ, విశ్వమానవ కల్యాణానికి బౌద్ధధర్మమే శరణ్యమని చాటారు. హిందువుగా జన్మించడం నా చేతిలో లేదు. కానీ హిందువుగా మాత్రం మరణించనని ప్రక టించి 1956 అక్టోబర్ 14న నాగపూర్ దీక్షాభూమిలో 6 లక్షలమంది అనుచరులతో బౌద్ధ పున రుజ్జీవ యాత్రను ప్రారంభించారు. అలా.. మరోవిప్లవానికి సమరశంఖం పూరించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను, అనివార్యతను ప్రకటించిన జ్ఞాని అంబేడ్కర్. ఈ నేపథ్యంలోనే మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వెనుక బి.ఆర్ అంబేడ్కర్ సిద్ధాంత ప్రాతిపదిక ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బి.ఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయగర్వంతో తెలంగాణ ప్రజలు జరుపుకుంటు న్నారు. దళితుల అభ్యున్నతి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి బాధ్యత తీసుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రతిన పూనడమే డా. అంబేడ్కర్ జయంతి ఉత్సవాల విశిష్టతగా ఉండాలి. వేముల వీరేశం, వ్యాసకర్త నకిరేకల్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ మొబైల్: 9963054752 -
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
కేతేపల్లి : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. మండలంలోని కాసనగోడు ఉన్నత పాఠశాలలో రూ.37.69 లక్షల ఆర్ఎంఎస్ నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడంలో గత పాలకుల వైఫల్యం వల్లే నేడు తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వీర్యమైందన్నారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలుకు కార్యాచరణ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎంఈఓ డి.వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్త మంజుల, జెడ్పీటీసీ జటంగి లక్ష్మమ్మ, స్థానిక సర్పంచ్ బొజ్జ సైదమ్మ రామకృష్ణ, ఎంపీటీసీ కందుల మోహన్‌కుమార్, ఉప సర్పంచ్ దయాకర్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ కరుణ, పీఆర్టీయూ మండల కార్యదర్శి కె.వెంకట్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ పి.జగన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.