పాఠ్యాంశంగా యోగా
రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ: పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేసి, పాఠ్యాంశంగా చేర్చాలని రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. రానున్న విద్యా సంవత్సరంలోనే ఈ కోర్సు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. ‘స్కూళ్లలో యోగా తప్పనిసరి చేయాలని సూచిస్తూ మానవ వనరుల శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపించింది.
రాబోయే విద్యా సంవత్సరంలోనే ఇది ప్రారంభమవుతుందని భావిస్తున్నా. ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ తరగతులుంటాయి. లేదంటే అదే పీరియడ్లో ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది’ అని లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా నాయక్ బదులిచ్చారు. పోలీసు, రక్షణ సిబ్బందికి కూడా యోగా తప్పనిసరి చేశామన్నారు. అందుకు ‘పోలీసు సిబ్బందికి యోగా శిక్షణ’ కార్యక్రమాన్ని కూడా మంత్రిత్వ శాఖ రూపొందించిందన్నారు.