breaking news
ugd connections
-
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ @ రూ.1
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట పట్టణంలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ వినియోగంలో బీపీఎల్ కింద ఉన్న పేదలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని బల్దియా తీసుకుంది. కేవలం ఒక్క రూపాయి డొనేషన్‌తో దారిద్రరేఖకు దిగువన ఉన్న గృహ యజమానులకు యూజీడీ సేవలందించాలని సంకల్పించింది. మరోవైపు యూజీడీ నిర్వహణ భారం బల్దియాపై పడకుండా నూతనంగా గృహ, దుకాణ సముదాయాలను నిర్మించే యాజమానులకు స్లాబ్ పద్ధతిలో డొనేషన్ చెల్లించాలనే నిర్ణయాన్ని కౌన్సిల్ సభ్యులు గురువారం కౌన్సిల్ హాల్లో చైర్మన్ రాజనర్సు అధ్యక్షతన నిర్వహించిన స్థానిక మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. బీపీఎల్(దారిద్ర రేఖకు ఎగువ ఉన్న)వర్గాలకు చెందిన వారి నుంచి, వ్యాపారసంస్థలు, అపార్ట్‌మెంటులు, ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్ కళాశాలలు, బహుళ అంతస్తుల భవనాలకు యూజీడీని ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించి వెయ్యి నుంచి పది వేల వరకు ఆయా విభాగాలకు అనుగుణంగా డిపాజిట్‌ను ఒకేసారి స్వీకరించాలని కౌన్సిల్ నిర్ణయించింది. నెలవారీ టారీఫ్ రూపంలో చెల్లింపు యూజీడీని వినియోగించినందుకు గాను నూతనంగా నిర్మించే బహుళ అంతస్తుల భవన నిర్మాణ యాజమానులు నెలవారి రుసుము టారీఫ్ రూపంలో చెల్లించాలని తీర్మానించారు. మొదటగా యూజీడీ వినియోగ నిర్వహణ టారీఫ్‌పై సభ్యుల్లో చర్చ కొనసాగింది. బల్దియాకు భారం పడకుండా పేదలకు ఇబ్బంది కలుగకుండా సంపన్న వర్గాలకే నామమాత్ర రుసుముతో మురికి నీటి శుద్ధీకరణ సేవలను అందించాలని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సిద్దిపేట పట్టణంలో 400 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అమలవుతోందని, ప్రతి నెలా యూజీడీ నిర్వహణకు రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని, ఇది మున్సిపల్‌కు అదనపు భారంగా మారనున్న క్రమంలో కౌన్సిల్ ఆమోదంతో డిపాజిట్లను సేకరించాలని నిర్ణయించారు. స్లాబుల పద్ధతిలో.. కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పూర్తిస్థాయి విధి విధానాలతో ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరారు. దారిద్రరేఖకు ఎగువ ఉన్న గృహాలకు రూ.2 వేలు, అపార్ట్మెంట్లకు, వ్యాపార సంస్థలకు రూ.10 వేలు, విద్యాసంస్థలకు రూ.5 వేలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు రూ.10 వేలు, బహుళ అంతస్తులకు రూ.15 వేలు, ప్రైవేటు ఆస్పత్రులు, కాంప్లెక్స్‌లు, థియేటర్లు, భారీ హోటళ్లకు రూ.20 వేల చొప్పున ఒకేసారి డిపాజిట్‌ను స్వీకరించాలని నిర్ణయించినట్లు చైర్మన్ రాజనర్సు పేర్కొన్నారు. మరో సభ్యుడు బర్ల మల్లికార్జున్ ఏ, బీ, సీ, డీ వర్గాలుగా విభజించి స్థాయిని ప్రామాణికంగా తీసుకుని డిపాజిట్లు స్వీకరించాలని కోరారు. నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించాలి టారీఫ్‌ల ప్రకారం డిపాజిట్లను నిర్ణయించామని, నూతన గృహాలు, అపార్ట్మెంట్లు నిర్మించే వారు డిపాజిట్ల చెల్లించాల్సి ఉంటుందని, పాత నిర్మాణాలకు వర్తించదని చైర్మన్ రాజనర్సు తెలిపారు. అపార్ట్మెంట్ల నుంచి నల్లా బిల్లులో సగ భాగాన్ని ప్రతి నెలా మురికి నీటి శుద్ధీకరణ చార్జిగా వసూలు చేసేందుకు కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలుపాలని కోరారు. కౌన్సిలర్ వెంకట్‌గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో అనేక అక్రమ నల్లాల కనెక్షన్లు ఉన్నాయని వాటిని క్రమబద్ధీకరించి బల్దియాకు ఆదాయం తీసుకురావాలని కోరారు. మరో సభ్యుడు మల్లికార్జున్ నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై సభ్యులు ప్రవీణ్, గ్యాదరి రవి, వజీర్, ఉమారాణి, నర్సయ్యలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ లక్ష్మణ్, పబ్లిక్ హెల్త్ డీఈ గోపాల్, ఆర్ఐ కృష్ణ, వైస్ చైర్మన్ అత్తర్, కౌన్సిలర్లు చిప్ప ప్రభాకర్, మోహీజ్, ప్రశాంత్, బాసంగారి వెంకట్, బూర శ్రీనివాస్, జావేద్, శ్రీనివాస్ యాదవ్, లలిత, స్వప్న, కంటెం లక్ష్మి, నల్ల విజయలక్ష్మి, తాళ్లపల్లి లక్ష్మి, మరుపల్లి భవాని, గురజాడ ఉమరాణి, పూజల లత, మామిండ్ల ఉమారాణి, జంగిటి కవిత, గుడాల సంద్య, సాకి బాల్‌లక్ష్మి, బోనాల మంజుల, ప్రమీల, మంతెన జ్యోతి, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నో మురుగు!
– వందశాతం భూగర్భ డ్రైనేజీ – కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ – కోర్టుకేసులు, పీసీబీ మొట్టికాయలే కారణం – కొత్తగా 80 వేల కనెక్షన్లు ఇవ్వాలని అంచనా విజయవాడ సెంట్రల్ : విజయవాడ నగరంలో నూరు శాతం యూజీడీ(అండర్‌గ్రౌండ్ డ్రెయినేజ్) కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. నగరంలోని ప్రతి ఇంటికి అండర్ గౌండ్ డ్రెయినేజ్ కనెక్షన్లను తప్పనిసరి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు త్వరలో డివిజన్ స్థాయిలో మేళాలు నిర్వహించేందుకు యాక్షన్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. నగరంలో 1.87 లక్షల గృహాలకు సంబంధించి ఆస్తిపన్ను వసూలవుతుండగా, 62 వేల యూజీడీ కనెక్షను మాత్రమే ఉన్నాయి. అపార్ట్మెంట్లు, గ్రూపుహౌస్లు సంబంధించి ఒక్కో కనెక్షనే ఉంటుంది కాబట్టి వాటిని మినహాయించినా ఇంకా సుమారు 80 వేలకు పైగా యూజీడీ కనెక్షన్లు ఉండాలని ఇంజనీరింగ్ అధికారులు లెక్కతేల్చారు. కోర్టుకేసులు, కాలుష్యనియంత్రణ మండలి (పీసీబీ) అక్షింతలే తాజా కార్యాచరణకు కారణం. మురుగంతా కాలువల్లోకే యూజీడీ కనెక్షన్ల కోసం త్వరలో డివిజన్ స్థాయి మేళాలు జరపాలని కమిషనర్ వీరపాండియన్ ప్రస్తావించగా కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. సిటీలో అత్యధిక ప్రాంతాల్లోని మురుగు, వ్యర్థాలు దశాబ్ధాలుగా ఏలూరు, బందరు, రైవస్ కాల్వల్లో కలుస్తున్నాయి. ఇదే నీటిని సాగు, తాగు అవసరాలకు వాడుతున్న గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు వంటి నగరాలు సహా వందలాది గ్రామాల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజలు గతంలో కోర్టులను ఆశ్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్లకు పని సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎస్టీపీ)లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో ఇప్పటి వరకు నగరపాలక సంస్థ యూజీడీ కనెక్షన్ల మంజూరుపై పెద్ద దృష్టి పెట్టలేదు. జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా నగరంలో యూజీడీ పనులకు రూ.500 కోట్ల ఖర్చు చేశారు. ప్రస్తుతం సింగ్‌నగర్, రామలింగేశ్వరనగర్, ఆటోనగర్ ప్రాంతాల్లో ఎస్టీపీలు వినియోగంలో ఉన్నాయి. ఒన్‌టౌన్ ప్రాంతంలో రైల్వేశాఖ అభ్యంతరాల వల్ల పైప్‌లైన్ నిర్మాణ పనులకు బ్రేక్‌పడింది. సుమారు 20 కోట్ల ఖర్చుతో వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. వంద కోట్ల ఆదాయ లక్ష్యం నూరుశాతం యూజీడీ కనెక్షన్లు మంజూరు చేయడం ద్వారా కాల్వల్లో కాలుష్యానికి చెక్ పెట్టడంతో పాటు ఆర్థిక సంక్షోభంలోనున్న నగరపాలక సంస్థకు దండి గా ఆదాయం వచ్చే అవకాశం ఉం ది. 80 వేలకు పైగా కనెక్షన్లు మం జూరు చేయడం ద్వారా రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్ల ఆదా యం వస్తుందని లెక్కలేస్తున్నారు.