breaking news
Transparency International Survey
-
భారత్‌కు 40 మార్కులు..
న్యూఢిల్లీ: భారత్‌లో అవినీతి తీవ్రస్థాయిలో ఉందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, పత్రికా స్వేచ్ఛ ఆధారంగా మొత్తం 180 దేశాలకు ర్యాంకులు కేటాయించింది. ఇందుకోసం ఆయా దేశాల్లో గతేడాది జరిగిన సంఘటనలను పరిగణనలోనికి తీసుకున్న సంస్థ.. ‘ప్రపంచ అవినీతి సూచీ–2017’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి, పత్రికా స్వేచ్ఛకు సంబంధించి అత్యంత తీవ్రమైన నేరాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటని ఈ నివేదిక పేర్కొంది. 2016 అవినీతి సూచీలో 79వ ర్యాంకు పొందిన భారత్ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 81వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అవినీతి అత్యంత ఎక్కువగా, పత్రికా స్వేచ్ఛ అత్యంత తక్కువగా ఉన్న దేశాలు ఫిలిప్పీన్స్, ఇండియా, మాల్దీవులని నివేదిక వెల్లడించింది. జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తల హత్యలను ఇందుకు కారణంగా చూపింది. భారత్‌కు 40 మార్కులు.. అవినీతి, పత్రికా స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ప్రతి దేశానికీ 0 నుంచి 100 మధ్య మార్కులు కేటాయించింది. అత్యంత తక్కువ అవినీతి కలిగిన దేశాలుగా న్యూజిలాండ్ (89 మార్కులు–మొదటి ర్యాంకు), డెన్మార్క్ (88 మార్కులు–రెండో ర్యాంకు)లు నిలిచాయి. భారత్‌కు వందకు 40 మార్కులు వచ్చాయి. సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియాలు వరుసగా 9, 12, 14 మార్కులతో చివరి మూడు స్థానాలకు పరిమితమయ్యాయి. పొరుగు దేశాల్లో భూటాన్ నంబర్ 1.. మన పొరుగు దేశాల్లో భూటాన్ 67 మార్కులతో ఏకంగా 26వ ర్యాంకును దక్కించుకోవడం గమనార్హం. భారత్ కన్నా చైనా ఒక్క మార్కు ఎక్కువ సాధించి 77వ స్థానంలో నిలిచింది. శ్రీలంక (91వ ర్యాంకు), పాకిస్తాన్ (117వ ర్యాంకు), మయన్మార్ (130వ ర్యాంకు) బంగ్లాదేశ్ (143వ ర్యాంకు)లు భారత్ కన్నా దిగువ స్థానాల్లోనే ఉన్నాయి. బ్రిక్స్ దేశాల వరకు చూస్తే దక్షిణాఫ్రికాకు అన్నింటికన్నా మెరుగైన ర్యాంకు (71) లభించగా, రష్యా అట్టడుగున (135వ ర్యాంకు) ఉంది. బ్రెజిల్‌కు 96వ ర్యాంకు దక్కింది. వారానికో జర్నలిస్టు హత్య.. గత ఆరేళ్లుగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా హత్యకు గురైన ప్రతి 10 మంది జర్నలిస్టుల్లో.. జాబితాలో 45 లేదా అంతకన్నా తక్కువ మార్కులు పొందిన దేశాలకు చెందిన వారే 9 మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో వారానికి కనీసం ఒక జర్నలిస్ట్ హత్యకు గురవుతున్నారంది. అవినీతిపై వార్తలు రాయడం వల్లనే ప్రతి ఐదుగురు జర్నలిస్టుల్లో ఒకరు చనిపోతున్నారని వెల్లడించింది. వీటిలోని చాలా కేసుల్లో దోషులకు సరైన శిక్ష కూడా పడటం లేదంది. పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం ఉండాలనీ, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఎండీ పాట్రీసియా మొరీరా పేర్కొన్నారు. -
ఆ విషయంలో మనమే టాప్!
బెర్లిన్/న్యూఢిల్లీ: ప్రభుత్వాలు మారినా, అధికారం చేతులు మారుతున్నా ఇండియాలో అవినీతి రేటు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బల్లకింద చేతులు పెట్టే ఆనవాయితీకి అడ్డుకట్ట పడడం లేదు. ఆసియా పసిఫిక్ లో అత్యంత అవినీతి దేశంగా భారత్ నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది. ప్రభుత్వాధికారులకు లంచాలు ఇచ్చామని మూడింట రెండొంతుల మంది భారతీయులు చెప్పారని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక సంస్థ 'ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్' నిర్వహించిన సర్వే తెలిపింది. అమ్యామ్యాలు సమర్పించుకున్నామని భారత్ లో 69 శాతం మంది చెప్పారు. ఇండియా తర్వాతి స్థానంలో వియత్నాం నిలిచింది. లంచాలు ఇచ్చామని వియత్నాంలో 65 శాతం మంది వెల్లడించారు. పాకిస్థాన్ లో 40 శాతం, చైనాలో 26 శాతం మంది లంచాలు ఇచ్చినట్టు తెలిపారు. జపాన్ అతి తక్కువగా 0.2 శాతం మంది మాత్రమే లంచాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గత సంవత్సర కాలంతో పోలిస్తే చైనాలో 73 శాతం అవినీతి పెరిగిందని సర్వే అంచనా వేసింది. 16 దేశాల్లో 20 వేల మంది అభిప్రాయాలతో సర్వే నిర్వహించారు. ఆసియా పసిఫిక్ దేశాల్లో 90 కోట్ల మంది గత సంవత్సర కాలంలో కనీసం ఒక్కసారైనా లంచం ఇచ్చారని ఈ సర్వే అంచనా వేసింది. లంచాలు తీసుకోవడంతో పోలీసులు అందరి కంటే ముందున్నారని వెల్లడించింది. 'అవినీతిని అంతం చేయడానికి ప్రభుత్వాలు మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరముంది. మాటలు కట్టిపెట్టి చేతల్లో చూపించాల్సిన సమయం ఆసన్నమైంది. లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వ సేవలకు లంచాలు సమర్పించుకుంటున్నారు. అవినీతి కారణంగా ఎక్కువగా పేదలే నష్టపోతున్నార'ని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అధిపతి జోస్ ఉగాజ్ పేర్కొన్నారు.