breaking news
Train Travel Railway
-
రైలొచ్చింది.. 21 కి.మీ దూరంలో ఉన్నది!
కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వే పనులు ఊపందుకున్నాయి. కొత్తపల్లి– మనోహరాబాద్ లైన్ పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే సిద్దిపేట వరకు రైలొచ్చింది. మిగిలిన రూట్లలోనూ పనులు స్పీడందుకున్నాయి. సిద్దిపేట తర్వాత గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల స్టేషన్ల నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే టెండర్లు జారీ చేసింది. ప్లాట్‌ఫాంలు, భవనాలు, గదులు, అప్రోచ్ రోడ్లు, లైటింగ్, విద్యుత్ యార్డు తదితర పనుల కోసం టెండర్లు జారీచేశారు. మొత్తం టెండరు విలువ రూ. 5,30,27,277గా అధికారులు పేర్కొన్నారు. ఈనెల 25న మధ్యాహ్న 3 గంటలకు టెండరు ముగింపు గడువుగా తెలిపారు. పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని టెండరులో సూచించారు. 21 కి.మీ. దూరంలో పాత కరీంనగర్.. సిరిసిల్ల–సిద్దిపేట మధ్యలో 30 కి.మీ దూరానికి ట్రాక్ వేసేందుకు దాదాపు రూ.440 కోట్ల వ్యయంతో జనవరిలోనే దక్షిణ మధ్య రైల్వే బిడ్డింగులు పిలిచింది. తాజాగా సిరిసిల్ల, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్లలోనూ స్టేషన్ నిర్మాణాలకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవడంతో ఈ మార్గంలో జరుగుతున్న పనుల వేగానికి నిదర్శనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాను హైదరాబాద్‌తో కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేలైను ప్రస్తుతం సిద్ధిపేట వరకు పూర్తయింది. ఇటీవల సిద్ధిపేటను రైలు కూడా పలకరిచింది. సిద్దిపేట తర్వాతి స్టేషన్ గుర్రాలగొంది కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. గుర్రాలగొంది– చిన్నలింగాపూర్ మధ్య దూరం 11 కి.మీ. చిన్నలింగాపూర్–సిరిసిల్ల మధ్య 9.కి.మీ దూరం వస్తుంది. గుర్రాలగొంది సిద్దిపేట జిల్లా కాగా, చిన్నలింగాపూర్ సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. ఈ లెక్కన కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే మార్గం పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించేందుకు కేవలం 21.కి.మీల దూరంలో ఉంది. 77 కి.మీ. మేర పూర్తయిన మార్గం.. మనోహరాబాద్ –కొత్తపల్లి (కరీంనగర్) వరకు మొత్తం 151.36 కిలో మీటర్లు బ్రాడ్‌గేజ్‌లైన్. ఈ మార్గంలో ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ (77కి.మీ) వరకు లైన్ పూర్తయింది. ఇక్కడి నుంచి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న సిరిసిల్ల స్టేషన్ (106.88 కి.మీ) వరకు ప్రస్తుతం పనులు వేగంగా నడుస్తున్నాయి. అక్కడ నుంచి కరీంనగర్ వరకు (151.36 కి.మీ) అంటే దాదాపు 44.48 కి.మీ వరకు ట్రాక్ పనులు సాగాలి. ఇవి 2025 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సిరిసిల్లలో కావాల్సిన భూసేకరణకు అధికారులు ఇప్పటికే పచ్చజెండా ఊపారు. దక్షిణ మధ్యరైల్వే అడిగిన భూమిని అటవీ భూమిని ఇచ్చేందుకు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్ అనుమతించారు. భూసేకరణ విషయంలో రైల్వే అధికారులతో సిరిసిల్ల–కరీంనగర్ కలెక్టర్లు కూడా పలుమార్లు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ మార్గం పూర్తయితే జగిత్యాల, పెద్దపల్లి వాసులకు ఢిల్లీ, హైదరాబాద్ వెళ్లేందుకు రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టు నేపథ్యం ఇదీ.. వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ప్రజలకు రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2006–07లో 151 కి.మీ కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రూ.1,167 కోట్ల అంచనా వ్యయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తర్వాత ఈ మార్గం ఆర్థికంగా భారమని చెప్పి రైల్వేశాఖ సుముఖత చూపలేదు. మొత్తం బడ్జెట్లో 1/3 వంతు ఖర్చుతోపాటు 100 శాతం భూమిని సేకరించి ఇవ్వడం, ఈ మార్గంలో ఐదేళ్లపాటు వచ్చే నష్టాలను భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకువచ్చింది. దీంతో 2016లో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. ఈప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు. -
విసుగెత్తిస్తున్న ప్రయాణం
- చిత్తూరు మార్గంలో రైలు ప్రయాణం నరకమే - 72 కి.మీ లకు 3 గంటల ప్రయాణం - క్రసింగ్‌లు పడ్డాయో ఇక నరకమే - డబ్లింగ్ రైల్వేలైన్ లేకే అవస్థలు తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి జిల్లా కేంద్రమైన చిత్తూరుకు ఉన్న దూరం 72 కి.మీలు. అయితే ప్యాసింజర్ రైలులో ఈ దూరానికి అయ్యే ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు పడుతుంది. అది కూడా ఎలాంటి క్రాసింగ్‌లు లేకుండా ఉంటే...పై సమయం పడుతుంది. ఇక ఏదైనా ఎక్స్‌ప్రెస్‌కో, సూపర్ ఫాస్ట్‌కో క్రాసింగ్ ఇవ్వాల్సి వచ్చిందో ప్రయాణ సమయం మరో గంటైనా అదనంగా పడుతుంది. ఇలా ఏడాది పొడవునా తిరుపతి-చిత్తూరు, చిత్తూరు-తిరుపతి మార్గంలో నరక ప్రయాణం అనుభవిస్తున్న సగటు మనిషి దీనస్థితి ఇది. తిరుపతి-చిత్తూరు మధ్య ప్రతిరోజూ సుమారు 300 మంది ఉద్యోగులు, 250 మంది టీచర్లు, 2వేల మందికి పైగా విద్యార్థులు, వందల సంఖ్యలో చిరువ్యాపారులు, వేలల్లో యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇన్ని వేల మంది ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంతో ప్రయాణం చేయాలంటే కేంద్రం నుంచి ఈ మార్గంలో డబ్లింగ్ రైల్వేలైన్‌కు అనుమతి రావాలి, పుష్కలంగా నిధుల మంజూరు జరగాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన మొదటి వ్యక్తులు ఎంపీలు. అయితే మన జిల్లా ఎంపీలు ఎప్పుడో ఒకసారి ఈ మార్గానికి డబ్లింగ్ లైన్ అవసరమని ప్రస్తావించి ఊరుకునేశారు. ఆ తర్వాత వారి ప్రస్తావనలకు ఊపిరి పోసేవిధంగా రైల్వే ఉన్నతాధికారులు రూపొందించి న ప్రతిపాదనలు 12ఏళ్లుగా ఫైళ్లు దాటడం లేదు. నిత్యం జనానికేమో తిప్పలు తప్పడం లేదు. మూడు రెట్లు పెరిగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు 2003లో బ్రాడ్‌గేజ్‌గా మార్పు జరిగిన చిత్తూరు రైల్వే మార్గంలో తొలుత రెండే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే నడిచేవి. అయితే ఈ 12 ఏళ్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ మార్గంలో రోజూ 11 ట్రిప్పులు తిరుగుతున్న ప్యాసింజర్ రైళ్లకు అడుగడుగునా క్రాసింగ్‌ల సమస్య తప్పడం లేదు. అలాగే తిరుపతి నుంచి పాకాల మీదుగా అనంతపురం జిల్లావైపు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా చిత్తూరు మార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లకు క్రాసింగ్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అంతేగాక చిత్తూరు వైపు వెళ్లేందుకు తిరుపతిలో ముందుగా ప్యాసింజర్ రైలు బయల్దేరినా తర్వాత బయల్దేరే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎక్కడో ఒకచోట క్రాసింగ్ ఇవ్వకతప్పదు. ఎదురుగా వచ్చే రైళ్లతోనే కాకుండా వెనుక వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో కూడా ప్యాసింజర్లకు క్రాసింగ్ తిప్పలు తప్పేటట్లు లేదు. ఇలా నిత్యం ప్యాసింజర్లలో ప్రయాణం చేస్తున్న సామాన్యుల గురించి పట్టిం చుకునే నాథుడే కరువయ్యాడు.