breaking news
Todikodallu
-
వెండితెర మధుర జ్ఞాపకం
‘‘సినిమా పరిశ్రమ మనకు సూటవ్వదు. మాయా ప్రపంచం’... హీరోయిన్ అవుతానన్నప్పుడు కన్నాంబ తల్లిదండ్రులు అన్న మాటలివి. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పెరిగిన అమ్మాయి. పద్ధతులు తెలిసిన అమ్మాయి కన్నాంబ. అందుకే అమ్మానాన్నకు మాటిచ్చింది... ‘ఎక్కడా తప్పటడుగు వేయను’ అని. ‘‘నేను ఎవరికీ లొంగను. మీరు తలవొంచుకునే పరిస్థితులు తీసుకు రాను. ఒకవేళ నేను తలవొంచే పరిస్థితి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను’’... కూతురి మాటలు విన్న కన్నాంబ తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్లడానికి అనుమతిచ్చారు. ‘పుసుపులేటి కన్నాంబ’.. 1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగు లేని తార. నేటి తరానికి ఈ అద్భుత నటిని పరిచయం చేయాల్సిందే. నేడు కన్నాంబ జయంతి. ఈ సందర్భంగా ఆమె మనవడు పసుపులేటి దేవీ చౌదరి తన అమ్మమ్మ గురించి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా... ► కన్నాంబ పుట్టింది (1912) ఏలూరు. పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబం. పేరున్న కుటుంబం. తండ్రి తోడబుట్టినవాళ్లు 17 మంది. కుటుంబం మొత్తానికి కన్నాంబ ఒక్కతే కూతురు. మిగతావాళ్లంతా మగపిల్లలే. అమ్మానాన్న, పెదనాన్నలు, బాబాయ్‌ల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న కన్నాంబకు వీధి నాటకాలు చూడటం ఇష్టం. బయట నాటకం చూడటం, ఇంటికొచ్చాక ఆ డైలాగులు చెప్పి, ఇంటిల్లిపాదినీ నవ్వించడం. 11వ ఏట నాటకాలు చూడటం మొదలుపెట్టి, ఆ తర్వాత ‘నావెల్ నాటక సమాజం’లో చేరి, బాల తారగా పలు పాత్రలు చేసింది. 1935లో ‘హరిశ్చంద్ర’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కన్నాంబ. ఆ చిత్రంలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్ర చేశారామె. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ► మొదటి సినిమా తర్వాత కన్నాంబ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడి కోడళ్లు’ తదితర చిత్రాల్లో నటించారామె. కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో సుమారు 70 సినిమాలు, క్యారెక్టర్ నటిగా వంద సినిమాల వరకూ చేశారామె. కన్నడ సినిమాలు కూడా చేశారు. కన్నాంబ మంచి నటి మాత్రమే కాదు.. మంచి గాయని కూడా. ‘చండిక’ సినిమాలో చేతిలో కత్తిపట్టుకుని, గుర్రం మీద వెళుతూ ‘నేనే రాణినైతే..’ అనే పాటలో కన్నాంబ కనబర్చిన అభినయానికి అప్పటి తరం ‘భేష్’ అనకుండా ఉండలేకపోయింది. నటించడం మాత్రమే కాదు.. ఆ పాటను కన్నాంబ అద్భుతంగా పాడారు. ► చక్కని రూపం, గంభీరమైన స్వరం, కనుబొమలతో అవలీలగా హావభావాలు పలికించగల నైపుణ్యం కన్నాంబను అగ్ర తారను చేశాయి. ముఖ్యంగా శక్తిమంతమైన పాత్రల్లో ఆమె శారీరక భాష చాలా ఠీవీగా ఉండేది. అందుకు ఓ ఉదాహరణ తమిళ చిత్రం ‘కన్నగి’. మహా పతివ్రత కన్నగి జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కన్నాంబ నటవిశ్వరూపం చూస్తాం. ఆ సినిమాలో ఆమె రాజనర్తకి కన్నగిగా నటించారు. భర్తపై దోషిగా ముద్ర వేసి, మరణిశిక్ష విధించిన రాజును నిలదీస్తుంది. కన్నగి ప్రాతివత్య మహిమ ఆ మధుర పట్టణాన్నే దహించివేస్తుంది. ఆ సన్నివేశాల్లో కన్నాంబ కళ్లు నిప్పులు కురిపించాయి. తమిళంలో కన్నాంబకు ఇది మూడో సినిమా. అక్కడ స్టార్‌ని చేసిన సినిమా కూడా ఇదే. తెలుగులో కన్నగి జీవితం ఆధారంగా స్వీయదర్శకత్వంలో గూడవల్లి రామబ్రహ్మం తీసిన ‘పత్ని’లోనూ కన్నాంబ టైటిల్ రోల్ చేశారు. ► కన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ పలువురు కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతున్నారు. అప్పట్లో కన్నాంబకు జరిగింది కూడా ఇదే. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నాంబ భర్తనూ వదిలిపెట్టలేదు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం సినీ నిర్మాత, దర్శకుడు కూడా. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక ‘శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం’ కంపెనీ స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో ‘సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం’ తదితర చిత్రాలున్నాయి ఈ చిత్రాలకు కడారు నాగభూషణమే దర్శకుడు. బయటి దర్శకులతోనూ సినిమాలు తీశారు. భర్త దర్శకత్వంలో కన్నాంబ నటించారు కూడా. ► కన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్లట. అడిగినవాళ్లకు కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకం పెట్టడం లాంటివి వీళ్లకు నష్టాన్ని కలిగించాయి. ఏ నటుడి వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో అదే నటుడితో ఓ సినిమా తీసి, నష్టాలపాలయ్యారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాలను తమ బేనర్లో నిర్మించడానికి కన్నాంబ, నాగభూషణంలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్ సినిమా తీసినప్పుడు తన స్నేహితుడి బేనర్‌కి ఆ సినిమాని ఇవ్వమని నటుడు కోరితే కాదనకుండా ఇచ్చేశారు. అయితే 30 మాత్రమే చెల్లించి, మిగతా 70 శాతం ఇవ్వకపోయినా కన్నాంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే అతనికి రాజకీయాల వైపు మక్కువ ఏర్పడి, మిగతాది పూర్తి చేయకపోవడంతో నష్టం మిగిలింది. ‘‘ఏ వ్యక్తి మీద అయినా వారి జీవితాన్ని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. కానీ మా అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడు. ఆమె కెరీర్‌ని నాశనం చేయడంతో పాటు మా తాతగారికీ అవకాశాలు లేకుండా చేశాడు’’ అని కన్నాంబ మనవడు పసుపులేటి దేవీ చౌదరి అన్నారు. ► అప్పట్లో కన్నాంబ ప్రొడక్షన్ హౌస్‌లో పని చేసేవారందరూ సంతోషంగా ఉండేవారట. నెల ఆరంభమయ్యే ముందు రోజే అందరికీ జీతాలు ఇచ్చేసేవారట. అలాగే ఉదయం ఆరేడు గంటల ప్రాంతంలో టిఫిన్‌తో మొదలై, రాత్రి 12 గంటల వరకూ వచ్చినవారికి లేదనకుండా భోజనం పెట్టేవారట. కన్నాంబ పేరు మీద చెన్నైలో ఓ స్టూడియో కూడా ఉండేది. షూటింగ్స్‌తో స్టూడియో కళకళలాడేది. ఆ తర్వాత మోసం చేసి, ఎవరో ఆ స్టూడియోను తమ పేరు మీద రాయించేసుకున్నారు. ► ‘ఆత్మబలం’ (1964) కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది మే 7న ఆమె తుది శ్వాస విడిచారు. ఏ అనార్యోగమూ లేదు. బతికున్న రోజుల్లో జ్వరం అనేది ఎరగని కన్నాంబ ప్రశాంతంగా కన్ను మూశారు. అయితే దురదృష్టం ఏంటంటే.. మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవీ చౌదరి అంటున్నారు. కన్నాంబ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసం దొంగలే మాయం చేశారని కొందరు అంటే, కాదు ఇది ఆ నటుడి పనే అని మనవడు అంటున్నారు. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. ► కన్నాంబ మరణించాక ఆమె భర్త నాగభూషణం బాగా కుంగిపోయారు. అప్పటికి ఆస్తులు కూడా పోవడంతో చివరి రోజుల్లో ఆయన సాదాసీదా జీవితం గడిపారు. ‘అమ్మమ్మ, తాతయ్యలకు దానగుణం ఎక్కువ. ఆ మంచితనమే వాళ్లను ఇబ్బందులను చేసింది. మాకు వాళ్ల పేరే ఆస్తి’ అన్నారు దేవీ. ► నటిగా, వ్యక్తిగా కన్నాంబ నేటి తరానికి ఆదర్శం. ఆమె ఎంతో క్రమశిక్షణ ఉన్న నటి. పట్టుదల గల వ్యక్తి. అవకాశాలు పోయినా ఫర్వాలేదు.. గుణం ముఖ్యమని నిలబడ్డ స్త్రీ. కన్నాంబ.. వెండితెర మధుర జ్ఞాపకం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుతం. – డి.జి. భవాని అమ్మమ్మ పేరు మీద ‘కన్నాంబ పసుపులేటి మూవీస్’ బేనర్ ఆరంభించాను. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం, తెలుగు, హిందీ భాషల్లో మరో ద్విభాషా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాను. ఈ చిత్రాల్లో నేనే హీరోగా నటించబోతున్నా. - పసుపులేటి దేవీ చౌదరి పసుపులేటి దేవీ చౌదరి, కన్నాంబ -
కొసరాజుతో రోజులు మారాయి...
నా పాట నాతో మాట్లాడుతుంది... ఏ పాటైనా రాయగలిగిన - రాస్తున్న నిన్ను ‘విప్లవకవి’ అన్నట్టే- అటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’, ఇటు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో’ రాసినా నా తండ్రిని సినీజానపద కవి సార్వభౌముడనే అంటారు తేజా.. అంటూ మొదలెట్టింది కొసరాజు పాట. మహాకవిగా గుర్తింపు వచ్చాక సినీకవి అయినాడు కొసరాజు. 1931లోనే జమీందారులకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం మొదలై, దానికి నాయకత్వం వహిస్తున్న కొసరాజు మునిస్వామి నాయుడి ప్రోత్సాహంతో ‘కడగండ్లు’ రైతు గేయాలు రాశారు. పింగళి లాగే 1930 దశకంలో సినీరంగంలో అడుగుపెట్టి వెనక్కివెళ్ళి, మళ్ళీ 1950 దశకంలో వచ్చి విజృంభించిన కొసరాజు అస్మదీయ జనకులు. మాటల రచయిత డి.వి.నరసరాజు పట్టుదలతో, మహా దర్శకుడు కె.వి.రెడ్డి ‘పెద్దమనుషులు’ చిత్రానికి 1952లో మూడు పాటలు రాయడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో కొసరాజు కలంబలం తెలిసింది. అయితే, ‘రోజులు మారాయి’ సినిమాలో ఏడు పాటలు రాయడంతో కొసరాజు రోజులు మారిపోయాయి’ అంది కొసరాజు పాట. 600 చిత్రాల్లో 870 పాటలు రాశారు కొసరాజు. 1986 అక్టోబర్ 27న సురేష్ ప్రొడక్షన్స్ ‘గురుబ్రహ్మ’కు బుర్రకథ రాసిన రాత్రే కన్నుమూశారు. ‘మూగమనసులు’లో ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మ’ పాటలో ఒక దగ్గర ‘అది పెళ్లామంటే చెల్లదులే పళ్లు పదారు రాలునులే’ అని రాశాడు. పళ్లు 32 కదా 16 అని ఎందుకు రాశాడు! ‘పళ్లు’ ‘పదారు’ యతి కోసమని కొందరు చర్చించారట. యతి కోసమో, ప్రాస కోసమో కాదు ‘పదహారు’ సంఖ్య నూతన యవ్వనాన్ని సూచించే వయస్సుకు సంబంధించింది. పదహారేళ్ల మీద ఎన్నో పాటలు వచ్చాయి. ‘పదారు పళ్లురాలునులే’ అంటే నీ పడుచు పొగరు దించేస్తా అన్నది లోతైన అర్థం. సాహిత్యాన్ని, సమాజాన్ని, జీవితాలను కాచి వడబోసిన కవిఋషి తాత్త్వికుడు కొసరాజు. పద్యాలు, చారిత్రక కావ్యాలు, ద్విపద కావ్యాలు, బుర్రకథలు, లఘు కావ్యాలు, వ్యంగ్యం, తాత్వికత కలగలసిన సినీగీతాలు, ‘రైతుజన విధేయ రాఘవయ్య’ అంటూ ఆటవెలదులను రచించిన నా తండ్రిని కేవలం ‘జానపద సినీకవి’ అంటే నాకు చిర్రెత్తిపోదూ అంది కొసరాజు పాట. నేను ఆ పాటను సేదదీర్చి, ‘తల్లీ, నీవే సినీగీతానివి’ అంటే నేను 1957లో తోడికోడళ్లు చిత్రంలోని ‘ఆడుతుపాడుతు పనిచేస్తుంటే’ పాటను అంది గారాబంగా - గర్వంగా. తోడికోడళ్లు చిత్రం సంగీతం మాస్టర్ వేణు మహానటీనటులు అక్కినేని - సావిత్రి సందర్భం నీళ్లు పొలానికి చేతులతో ఎత్తిపోయడం. దోసిళ్లతో కాదు దొన్నెతో- దాన్ని గూడేయటం అంటారు. దాని కోసం ఏయన్నార్, సావిత్రి కొంత శిక్షణ కూడా తీసుకున్నారు. అత్యంత సహజంగా తెరకెక్కించారు దర్శకులు ఆదుర్తి సుబ్బారావు. గూడేస్తున్న సందర్భంలో పాట కావాలి. అందరి చూపు కొసరాజుపైనే - శ్రమ సౌందర్యాన్ని లలిత శృంగారంలో రంగరించి రాయగల విలువ తెలిసిన నెలరాజు, కవితల రాజు కదా కొసరాజు. ఇంక మొదలైంది. అలవోకగా, అవలీలగా కవిరాజు చేతిలో... ‘ఆడుతూ పాడుతూ పనిచేస్తున్నట్లు రాయగూడదు నాన్నా’ అన్నాను నేను. శభాష్ అంటూ అలాగే మొదలెట్టాడు. పాడేది భార్యాభర్తలు.. భర్త సాన్నిధ్యంలో ఉంటే కైలాసాన్నైనా మోయగలిగే బలవంతురాలవుతుంది సుకుమారమైన భార్య కూడా. అలాగే భార్య పక్కనే ఉంటే ఎంత పనైనా ఎడం చేత్తో అలుపుసొలుపు లేకుండా చేయగలడు భర్త. ఇంకేముంది పల్లవి పూర్తయింది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపే మున్నది/ ఇద్దరమొకటై చేయికలిపితే ఎదురేమున్నది. మనకు కొదవేమున్నది. ఇంక చరణం - ‘గూడేస్తున్న చెలి ఒంపులు ఒయ్యారం ఊగుతూ.... విసురుతూవుంటే ఆమె గాజుల శబ్ద సంగీతం అలవాటైన భర్త గుండెఝల్లుమనిపించదూ’ అలా వెళ్లూ అన్నాను క్షణంలో చరణం పూర్తి చేశాడు. ఇంక ఏదో కొత్తగా చెప్పాలి ఈ శ్రమసౌందర్యాన్ని అపురూపంగా అపూర్వంగా చెప్పాలి. ఒకసారి కుంకుమశోభతో మెరిసే సావిత్రి నుదురు నెలవంకనూహించుకో అన్నాను. వెంటనే నా తండ్రి కొసరాజుకు చెమటతో తడిసి చెదిరే కంకుమ రేఖ జారి పెదలవులపై మెరిసినట్టనిపించి ‘‘చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవులపైన మెరుస్తువుంటే తీయని తలపులు నాలో ఏవో తికమక చేస్తువున్నవి’’ అని పూర్తి చేశాడు. ఈ చరణమే ఒక శ్రమ సౌందర్యానందలహరిలా లేదూ అంది పాట- జోహర్ తాతా! కొసరాజా అన్నాను. అలా నన్ను అందంగా తీర్చిదిద్ది ఆదుర్తి, మాస్టర్ వేణు ద్వారా మీకొదలి తాను వెళ్ళిపోయాడంటూ ‘రసవన్నగం’లా నా రస హృదయంలో ఘనీభవించింది. - డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఆరళ్లకు తోడికోడళ్ల ఆత్మహత్య
గన్నవరం: అత్తింటి వేధింపులకు తట్టుకోలేక గర్భవతులైన తోడికోడళ్లు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం రాజీవ్‌నగర్ కాలనీలో బుధవారం జరిగింది. ఈ కాలనీలో నివసిస్తున్న సోదరులు నక్కా రాంబాబు (24), శివ (21)లు అదే ప్రాంతానికి చెందిన మురళీరమణమ్మ (20), ఝాన్సీ (19)లను ప్రేమించి ఏడు నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. తోడికోడళ్లు ఒకే ఇంట్లో సొంత అక్కాచెల్లెళ్ల మాదిరిగా కలసిమెలసి ఉండడాన్ని అత్తమామలైన భూలక్ష్మి, వెంకటేశ్వరరావు సహించలేకపోయారు. కొడుకులు కూలి పనులకు వెళ్లిన సమయంలో కోడళ్లను హింసించేవారు. అత్తమామల వేధింపులు తట్టుకోలేక రమణమ్మ మంగళవారం రాత్రి ఝాన్సీతో సహా తల్లి ఇంటికి వెళ్లింది. తమ వేదనను ఇద్దరూ కన్నవారికి చెప్పి విలపిం చారు. తర్వాత కుటుంబ సభ్యులు సర్దిచెప్పి అత్తవారింటి వద్ద దింపివెళ్లారు. అత్తమామల వేధింపు మరింత ఎక్కువ య్యాయి. దీంతో రమణమ్మ, ఝాన్సీ ఇంటి ఇనుప దూలానికి ఓణీలతో ఉరేసుకున్నారు. తమ కూతళ్లను అత్తింటివారే హత్య చేశారని బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.