breaking news
toddy tappers
-
గీత కార్మికుల తలరాత మారదా?
క్షణ క్షణం భయం భయం. బతుకే ప్రమాదకరం. వెళ్లిన కార్మికుడు క్షేమంగా తిరిగొస్తాడో రాడో అన్న ఉత్కంఠ. తెలంగాణ గీత కార్మికుల దైన్య స్థితి ఇదే. నిజాం సుదీర్ఘ పాలన నాటినుంచీ ఇప్పటికీ వేదనాభరిత జీవితాలను అనుభవిస్తున్న గీత కార్మికుల అభ్యున్నతిపై పాలకులు నిర్లక్ష్యం వహించడం బాధాకరం. తెలంగాణలో సుమారు 30 కోట్ల తాటి చెట్లున్నాయి గీత వృత్తిపై సుమారు 75 లక్షలమంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవిస్తున్నారు. అయితే ప్రతి జూన్ నెల నుంచి వీరికి ప్రమాదకరమైన సమయమే. తాటి చెట్టు నుంచి కింద పడి, లేదా చెట్టుకు వేలాడుతూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలో నారాయణ గౌడ్ అనే వ్యక్తి చెట్టుపై నుంచి తలకిందులుగా వేలాడుతూ ప్రాణాలు కోల్పోవడం ప్రత్యక్ష ఉదాహరణ. అయితే తెలంగాణ జిల్లాల్లో గీత కార్మికుల ప్రాణాలు ప్రతి ఏటా గాలిలో కలిసిపోతున్నా ప్రభు త్వం నుంచి వచ్చే నష్టపరిహారం ఏమీ అందడం లేదు. కల్లుగీత ద్వారా, తాటివనాల ద్వారా ఏటా రూ.150 కోట్ల ఆదాయం వస్తున్నా, గీత కార్మికులు తాటిచెట్టు పన్ను, భూ యజమాని పన్ను, ఎక్సైజ్ సుంకం కడుతూ ప్రభుత్వాన్ని పోషిస్తున్నప్పటికీ గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఇచ్చిందేమీ లేదు. తాటిచెట్టుపైనుంచి పడి ప్రమాదానికి గురై, అంగవైకల్యం లేదా మరణం సంభవించిన వారి కుటుంబాలకు ఏళ్లు గడిచినా ఎక్స్‌గ్రేషియా అందడంలేదు. పైగా రెక్కలు ముక్కలు చేసుకుని శరీరబాధలు అనుభవించి చేసిన కష్టానికి ప్రతిఫలం రాక మార్కెట్లో డిమాండ్ లేక ఆత్మహత్యల పాలవుతున్న గీత కార్మికులను ఆదుకునే యంత్రాంగం లేదు. పైగా తెలంగాణ గీత కార్మికులకు ప్రపంచీకరణ పుణ్యమా అని గౌడ వృత్తి దెబ్బతినిపోయింది. తాటివృత్తి గౌరవాన్నికాపాడి ఆ వృత్తిపై ఆధారపడిన లక్షలాది కార్మికులకు ఆత్మస్థైర్యం కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలంగాణలోని గీత కార్మిక సంఘాల కుటుంబాల ఆర్థిక స్థితిగతులపై సమగ్ర సర్వేను నిర్వహించి జనాభాలో 40 శాతంగా ఉన్న వృత్తి కళాకారులకు రక్షణ కల్పించాలి. లంచాల కోసం గీత సంఘాలను వేధిస్తున్న అధికారులను, నంబరు పంతుళ్లు, అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకోవాలి. గీత కార్మికుల తలరాతను ఇప్పటికైనా మార్చాలి.- రావుల రాజేశం, లెక్చరర్, జమ్మికుంట, మొబైల్ : 98488 11424 -
తాటినీరాతో అధికాదాయం
- గీత కార్మికుల ఆర్థికాభివృద్ధికి నీరా దోహదం - కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ డైరెక్టర్ చౌడప్ప సాక్షి, హైదరాబాద్: కొబ్బరి, తాటి చెట్ల నుంచి నీరాను సేకరించి, విలువను జోడించి విక్రయించడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, గీత కార్మికులు అధికాదాయాన్ని పొందే సువర్ణ అవకాశం ఉందని కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ (కాసర్గోడ్, కేరళ) డైరెక్టర్ పి. చౌడప్ప అన్నారు. కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇప్పటికే కొబ్బరి, తాటి నీరాను ఎక్సైజ్ చట్టం పరిధి నుంచి తొలగించాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకో వాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయ శంకర్ వ్యవసాయ వర్సిటీ ఆడిటోరియంలో తాటి నీరా, నీరాతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఎగుమతి అవకాశాలు అంశంపై జరిగిన సదస్సులో చౌడప్ప మాట్లాడారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్‌కు 2 నెలల కిందట లేఖ రాయడం వల్లే ఈ రోజు తాటి నీరాపై సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఔషధగుణాలు గల పానీయాలు: స్వామిగౌడ్ తాటి నీరా, కల్లు ఔషధ గుణాలు గల పానీయాలని శాసనమండలి అధ్యక్షుడు స్వామిగౌడ్ అన్నారు. తాటి నీరా, తాటి బెల్లం ఉత్పత్తులను శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసి విదేశాలకూ ఎగుమతి చేయొచ్చన్నారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గిరాకీ కలిగిన నీరా వంటి తాటి ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే రాష్ట్రంలోని 2,30,000 మంది గీత కార్మికులు ఆర్థికా భి వృద్ధి సాధించవచ్చన్నారు. లీటరు నీరా రూ. 150, తాటి బెల్లం కిలో రూ. 200కు అమ్ముకోవచ్చని చెప్పారు. తాటి నీరా కేన్సర్ రాకుండా, వయాగ్రా అవసరం లేకుండా చేస్తుందన్నారు. తాటి బెల్లం చాక్లెట్లకు మంచి గిరాకీ: ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తాటి నీరాతో ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ పరిశ్రమను తూర్పుగోదావరి జిల్లా పందిరిమామిడిలో ప్రారంభించబోతున్నామని వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ సీనియర్ శాస్త్రవేత్త పి.సి.వెంగయ్య తెలిపారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాటి నీరా, తాటి బెల్లంతో తయారైన చాక్లెట్లు, మిఠాయిలకు దేశవిదేశాల్లో మంచి గిరాకీ ఉందన్నారు. తాటి కల్లు, నీరాలను ఎక్సైజ్ చట్టం పరిధి నుంచి వెంటనే తొలగించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కేంద్రీయ వన్య తోట పంటల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త కె.బి. హెబ్బర్, పీజేటీఎస్ఏయూ వీసీ ప్రవీణ్‌రావు, కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ విజయ, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.