breaking news
Telugu poetic lyrics
-
ఎంత కమ్మని పద్యమో!
అనవిని వ్రేటుబడ్డ యురగాంగనయుంబలె నేయివోయ బగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సం జనిత నవీన కాంతి వెద జల్లగ గద్గద ఖిన్న కంఠియై! పద్యానవనం తెలుగునాట పద్యాన్ని ఎంతో రమ్యంగా నడిపిన వారిలో నంది తిమ్మన ఒకరు. సాహితీ సమరాంగణ సార్వభౌముడని పేరు గడించిన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఆయనొకరు. అందమైన మహిళ ముక్కును సహజాతి సహజమైన సంపెంగ పూలతో పోలుస్తూ అత్యద్భుతంగా వర్ణించినందుకు ఆయన్ని ముక్కుతిమ్మన అని కూడా పిలిచేవారట. భాష మీద పట్టు, విలక్షణమైన శైలి కారణంగా విషయం అలవోకగా చదువరుల హృదయాలను తడుతూ, మెదళ్లను కదిలిస్తుంది. తిమ్మన ప్రబంధ యుగంలో కాకుండా ప్రబోధ యుగంలో ఉండి ఉంటే, తెలుగుజాతి మరింత ప్రయోజనం పొంది ఉండేదనిపిస్తుంది. కృష్ణ లీలల్లోని ఓ సందర్భాన్ని తీసుకొని ‘పారిజాతాపహరణం’ అనే రసవత్తర ప్రబంధ కావ్యాన్ని రాశారాయన. నారదుడిచ్చిన అరుదైన వేయిరెక్కల పారిజాత పుష్పాన్ని కృష్ణుడు పోయి పోయి రుక్మిణికిచ్చాడు. సత్యభామ లాంటి మరో భార్య ఉన్న భర్తగా కృష్ణుడు చేసే ఇంతకు మించిన తప్పిదమేముంటుంది వాతావరణం రచ్చ రచ్చ కావడానికి! అంతిమంగా అదే జరిగింది. ఇదీ సన్నివేశం. విషయం తెలియగానే దిగ్గున మంచం నుంచి లేచి సత్యభామ ఎలా స్పందించిందో చెబుతున్నాడీ పద్యంలో. మాటలు వినగానే, ఒంటిపై దెబ్బ పడగానే చర్రున లేచే ఆడపాములాగా సత్య లేచిందట! ఇంకొక పోలిక చూడండి, ఎంత పెద్ద పద సముచ్ఛయమో! ఇందులో ఇరవై అక్షరాలున్నాయి. ‘నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల’ అన్నట్లు లేచిందట! అగ్నిలో నేయి పోస్తే మంటలెలా ఎగుస్తాయి? భగ్గుమని, అలా జ్వాలలా ఎగిసిందని! లేచి ఏం చేసింది? గద్గద స్వరంతో ఏదో మాట్లాడింది. అది తర్వాతి పద్యంతో అన్వయం. ఏవో మాటలు చెబితే (పూర్వపు పద్యంతో అన్వయం) విని, ఎలా స్పందించింది అన్నదే ఈ పద్యంలో పేర్కొన్నాడు. బాధ, కోపం, ఆవేశం ముప్పిరిగొనగానే కళ్లల్లో ఎర్రజీరలొస్తాయి, సహజం. ఆ ఎరుపునకు మరో ఎరుపు తోడయింది. అలంకరణలో భాగంగా కొన్ని పూల, పత్రాల లేపనాలను చెంపలపై రంగరించుకుంటారు. అటువంటి కుంకుమ పత్రపు అలంకరణ చెడిపోయి అదోరకమైన ఎరుపు కాంతి జనించిందట. ఈ రెండు ఎరుపులు కలగలిసి ఓ నూతన కాంతి ఆవిష్కృతమైంది, వెదజల్ల బడింది. అదుగో ఆ దృశ్యం గోచరమౌతున్నపుడు దుఃఖం పొంగుకొస్తుంటే, ఆమె గద్గద స్వరంతో... రమ్యమైన పదాల వాడుక ఒక్కటే భాషకు అందం తీసుకురాదు. అదొక అంశం అంతే! ఇంగ్లీషులో ఫ్రేజ్ అని చెప్పే పదసముచ్ఛయాలు, సంక్లిష్ట పదాలు తెలుగు పద్య సాహిత్యంలో చాలానే ఉంటాయి. నన్నయ లాంటి వాళ్లు ‘నిజోజ్వలత్కవచుడు’ ‘శశ్వత్కుండలోద్భాసితుడు’ ‘జగత్కర్ణపూర్ణాలోలద్గుణుడు’ వంటి పదసముచ్ఛయాల్ని ఒక్క కర్ణుడిని వర్ణించడానికే వాడారు. ఇవి ఒక రకంగా టంగ్‌ట్విస్టర్స్. ‘రిపుమర్ధనదోర్దాముడు భీముడు శపథనిబద్ద గదాయుధుడు’ (23 అక్షరాలు) అని, భీముడిని వర్ణిస్తూ ఓ సినీగీతంలో శ్రీశ్రీ వాడారు. ఇటువంటి పదాలు చక్కని శబ్దాలంకారాలౌతాయి. భాషను సుసంపన్నం చేయడానికి శబ్దాలంకారాలకు తోడు అర్థాలంకారాలూ ముఖ్యమే! శబ్దం-అర్థం శివపార్వతుల్లా అవిభాజ్యమైనవి. ఇదే విషయాన్ని ‘వాగార్థా వివసంప్రక్షౌ వాగర్త ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!’ అని కాళిదాసు అత్యద్భుతంగా చెప్పారు. పార్వతీపరమేశ్వరౌ అన్న పదాన్ని ఉమాశంకరులు గానే కాకుండా ‘పార్వతీప’(పార్వతి పతియైన శివా!) ‘రమేశ్వర’ (లక్ష్మీ పతివైన కేశవా!) అని కూడా విడదీయవచ్చని భాషా పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గొప్పగా విడమర్చారు. అలా ఇంపైన పద్యాలతో అర్థ-శబ్ద రమ్యతను సాధించిన నంది తిమ్మన కీర్తి తెలుగునాట అజరామరమైనది. - దిలీప్‌రెడ్డి -
ఆ అల్లుళ్లకు సలామ్!
పద్యానవనం అల్లుడు అభిమానస్తుడు అల్లునికి పనిచెప్పకూడదది చెప్పినచో, చిల్లర మూడే పనులట ఇల్లలుకను పేడదీయ ఇస్తరులెత్తన్. తెలుగు పద్యసాహిత్యంలో చాటువులకు సముచిత స్థానమే ఉంది. ఎవరు రాశారో తెలిసేది కొన్ని సందర్భాల్లోనే. కొన్నిమార్లు వారు రాశారో రాయలేదో కూడా ఇదమిద్ధంగా తెలియదు కానీ, ఫలానా వారు రాసిన చాటుపద్యమిది అని ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆయా కవి పండితుల పలుకుబడిని బట్టి కూడా ఒకోసారి సదరు పద్యం ఎక్కువ ప్రచారానికి నోచుకుంటుంది. శ్రీనాథ కవిసార్వభౌముని విషయంలో ఇలాంటివి తరచూ వింటుంటాం. అలనాటి పల్నాటి పల్లె సీమల మీద ఆయన రాసినట్టుగా చెప్పే చాటు పద్యాలు అలా ప్రాచుర్యంలోకి వచ్చినవే! వేళాకోళానికి తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టు ప్రచారంలో ఉన్న చాటు పద్యాలకున్న ఆదరణ తక్కువేం కాదు. తరాలు మారినా సందర్భాన్ని బట్టి తరచూ వాడుకోవడానికి అతికినట్టు సరిపోయే చాటుపద్యాలుంటాయి. అవి, నవ్వు పుట్టిస్తూ, ఒకింత వ్యంగ్యం పండిస్తూ, సామాజిక వాస్తవికతకు అద్దం పడతాయి. కొన్ని చాటుపద్యాలు వస్తురీత్యా హాస్యం పుట్టించినా, వాస్తవికత పరంగా కాలదోషం పడ్తాయి. ఎవరు రాసిందో తెలియని ఈ పద్యం కూడా అదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు, ఆడపిల్లల తలిదండ్రులకు అల్లుళ్లతో నిద్రలేని రాత్రులుండేవి. కట్నకానుకలని, పెట్టిపోతలని, మర్యాద-మన్ననలని.... ఎన్ని వేధింపులుండేవో! అల్లుడొస్తున్నాడంటే, అత్తామామలకు ఒళ్లు జలదరించేది. గ్రహాలు పట్టి పీడించకూడదని, నవగ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు చేయడం మనందరికి తెలిసిందే. అయితే, ఆ తొమ్మిది గ్రహాలకు మించిన పవర్ఫుల్ గ్రహంగా అల్లున్ని పరిగణించారు గనుకే ‘జామాతా దశమగ్రహ’ అన్నారు. ఏది పట్టినా, పట్టకపోయినా... ఈ పదో గ్రహం పట్టకూడదని కోటి దేవతలకు మొక్కుకునేవారు. కొంతమంది అల్లుళ్లు అత్తారింటికి వచ్చి రోజులు, వారాలు దాటి నెలల తరబడి తిష్టవేసేవారు. అది భరించడం అత్తామామలకు కష్టమే అయ్యేది! ఇక ఇల్లరికపు అల్లుళ్లది మరో రకం కథ. వారి వారి అదృష్టాన్ని బట్టి, వారు కట్టుకున్న భార్యామణి తత్వం, నోటి గుణం, ఆ ఇంట్లో ఆమెకున్న పలుకుబడి-పట్టును బట్టి కూడా ఆయా అల్లుళ్ల యోగమో, రోగమో కుదిరేది. అలా ఇల్లరికానికి వచ్చిన అల్లుడి నోట్లో నాలుక లేకపోతే ఇక అంతే సంగతులు! బహుషా ఇటువంటి పరిస్థితులన్నింటి నుంచి పుట్టిందేనేమో ఈ పద్యం. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడో... అల్లుడు అభిమానస్తుడు కనుక అత్తారింట్లో ఆయనకి పెద్దగా పని చెప్పొద్దట! తప్పని పరిస్థితి తలెత్తి చెప్పాల్సి వస్తే మాత్రం, ఎటువంటి చిన్నా చితకా పనులు చెప్పొచ్చో వివరిస్తున్నాడు. ఇల్లలకడం, పశువుల కొట్టంలో పేడతీయడం, ఇంట్లో భోంచేసిన వారందరి విస్తరాకులెత్తడం... ఇదుగో, ఈ మూడు పనులే చెప్పాలట. దెబ్బకు పరారై తమ పుట్టింటికెళ్లిపోయేలా చేసే ఎత్తుగడ కాకపోతే మరేంటి! ఇక సీన్‌కట్ చేస్తే...... నవశకం అల్లుళ్లు! ముఖ్యంగా మన ఉద్యోగపు అల్లుళ్లు, అర్బన్ అల్లుళ్లు, కాస్త అర్థంచేసుకొని మసలే అల్లుళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. చక్కగా అత్తామామల బాగోగులూ వారే చూసుకుంటున్నారు. కొన్ని సార్లు కన్నకొడుకుల కన్నా వృద్ధాప్యంలో ఉన్న దంపతులకు కూతురి భర్తలే గంజినీళ్లు పోసే పరిస్థితులున్నాయంటే ఆశ్చర్యం లేదు. పద్ధతుల్లో, బాధ్యతల్లో, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులకిది సంకేతం. ఆనాడయినా, ఈనాడయినా తలిదండ్రులపైన కొడుకుల కన్నా కూతుళ్లకే ప్రేమ ఎక్కువ అనడంలో అణుమాత్రం సందేహం లేదు. అయితే, ఆ రోజుల్లో మహిళలకు ప్రేమున్నా ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు. అత్యధిక సందర్భాల్లో భర్తచాటు భార్యలుగానే ఉండేవారు. ఇప్పుడు కొంత ఆర్థిక స్వేచ్ఛ, అంతకు మించి సమానత్వ స్పృహ, భర్తలతో సరి సమానంగా బరువు బాధ్యతల్ని పంచుకోవడం... వంటివి పెరిగిన పరిస్థితుల్లో వారి ఆలోచనలకు, భావనలకు, మాటకు విలువ పెరిగింది. కొడుకులే లేని తలిదండ్రుల బాగోగుల్ని కూతుళ్లు స్వయంగా చూసుకుంటున్నారు. కొడుకులుండీ నిర్లక్ష్యం చేసినా, క్షోభపెట్టినా తానున్నానంటూ చొరవ తీసుకొని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. ఆ మేరకు భర్తలకు అవగాహన కలిగించో, అనునయించో ఈ విషయంలో సహకరించేలా చేసుకోగలుగుతున్నారు. ‘‘పున్నామ నరకాత్త్రాయతే ఇతి పుత్రః’’ అన్నారు. తనువు చాలించాక, తలిదండ్రుల్ని పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడో లేదో తెలియదు కాని, జీవిత చరమాంకంలో తోడు కోసం అలమటించే పండుటాకులకు భూలోక నరకాన్ని తప్పిస్తున్న కూతుళ్లకు... వాళ్లకు సహకరిస్తున్న అల్లుళ్లకు... సల్యూట్! - దిలీప్‌రెడ్డి