breaking news
Teachers attendance
-
ఆర్జిత సెలవుల పేరిట టీచర్ల అక్రమార్జన..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆర్జిత సెలవు(ఈఎల్స్)ల ప్రక్రియ గాడితప్పుతోంది. వేసవి సెలవుల్లో విధులు నిర్వహించకున్నా అక్రమంగా పొందుతున్నట్లు విద్యా శాఖ గుర్తించింది. ఒకరిద్దరు కాదు.. ఏకంగా వేలాది మంది బోధన, బోధనేతర సిబ్బంది ఇదే తరహాలో పొందుతున్న వైనంపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ ఏడాది ఆర్జిత సెలవులకు ఎవరె వరు దరఖాస్తు చేసుకుంటున్నారనే దానిపై ఆ శాఖ ఆరా తీస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జూనియర్ అసి స్టెంట్ లేదా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వహించాలి. సెలవులు పూర్తయ్యే వరకు వారిద్దరు పాఠశాలలో అందుబాటులో ఉండి ఫెయిలైన విద్యార్థుల నామినల్ రోల్స్(ఎన్ఆర్) రూపకల్పన, ఫెయిల్ విద్యార్థుల మెమోల జారీ, వారి నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజుల స్వీకరణ తదితర పనులు చేయాల్సి ఉంటుంది. వీరితోపాటు పాఠశాల స్వీపర్ కూడా విధులకు హాజరుకావాలి. ఉద్యోగి పనిచేసిన రోజుల ఆధారంగా ఆర్జిత సెలవులను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ విధులు నిర్వహించిన ఉద్యోగికి సగటున 10 నుంచి 24 రోజుల వరకు ఈఎల్స్ వస్తాయి. సగటున ఒక్కో ఉద్యోగి సగం నెల వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఈ కేటగిరీలో ఏటా రూ.45 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నూరు శాతం ఫలితాలొచ్చినా.. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన విధులను సాధారణంగా నూరు శాతం కంటే తక్కువ ఫలితాలొచ్చిన పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. వంద శాతం ఫలితాలొస్తే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారుండరు. కనుక అక్కడ ప్రత్యేకించి విధులు నిర్వహించాల్సిన పనిలేదు. కానీ నూరుశాతం ఫలితాలు సాధించిన స్కూళ్లలోనూ విధులు నిర్వహించినట్లు రికార్డులు రూపొందించి ఆర్జిత సెలవులు పొందుతున్నారు. గతేడాది పలు స్కూళ్లలో ఇదే తంతు జరిగినట్లు విద్యాశాఖ అధికారులు గుర్తిం చారు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది ఈఎల్స్ దరఖాస్తులను సీరియస్‌గా పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,026 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ఈ ఏడాది ఏకంగా 4,374 పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధించాయి. ఇందులో ప్రైవేటు పాఠశాలలు 2,279 కాగా, 1,580 జిల్లా పరిషత్ పాఠశాలలు, 59 ప్రభుత్వ పాఠశాలలు, 33 ఎయిడెడ్ పాఠశాలలు, 97 ఆదర్శ పాఠశాలలు, మిగతా కేటగిరీలో కేజీబీవీలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలల నుంచి టెన్త్ సప్లిమెంటరీ విధులు నిర్వహించిన కేటగిరీలో ఎందరు ఈఎల్స్ పొందుతున్నారనే వివరాలను రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. -
బయోమెట్రిక్ పర్యవేక్షణ!
సాక్షి, మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు వివరాలు బయోమెట్రిక్ విధానంలో నమోదు చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. పాఠశాలల స్థాయిలో వివరాలు సేకరించి వాటిని ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రాథమికంగా స్కూల్ కాంప్లెక్స్‌లు కేంద్రంగా ఈ కార్యాచరణకు శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో 2700 ప్రాథమిక పాఠశాలలు, 703 ప్రాథమికోన్నత పాఠశాలలు, 468 హైస్కూళ్లలో కలిపి దాదాపు 11,700 ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు. ఇంతమంది హాజరును రోజూ పర్యవేక్షించడం విద్యాశాఖ అధికారుల వల్ల కావడం లేదు. ఇదే పరిస్థితి మిగతా జిల్లాలోనూ ఉంది. దీంతో ఉపాధ్యాయుల పర్యవేక్షణకు బయోమెట్రిక్ విధానాన్ని ఉపయోగించుకోవాలని, ఆ ప్రక్రియ మొదటి దశలో ఆదిలాబాద్ జిల్లానూ భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విధానంలో భాగంగా ఆయా పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు అమరుస్తారు. ఆ స్కూల్‌కు చెందిన మొత్తం ఉపాధ్యాయులు, ఆ రోజు హాజరైన వారు, సెలవు పెట్టిన వారి వివరాలను అందులో నమోదు చేస్తారు. ఈ వివరాలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ద్వారా డెరైక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు చేరేలా కార్యాచరణ ఉండనున్నట్లు సమాచారం. మరోవైపు స్కూల్ విజిట్ రిపోర్ట్‌లోనూ హాజరు పర్యవేక్షణకు ప్రత్యేక కాలం ఒకదానిని పొందుపర్చుతారు. ఇప్పటివరకు స్కూల్లోని మౌలిక సదుపాయాలు తదితర అంశాలనే స్కూల్ విజిట్‌లో పర్యవేక్షించే అంశానికి తోడుగా ఉపాధ్యాయుల హాజరు, సెలవులను నమోదు చేయనున్నారు. దీంతోపాటు తరచూ సెలవు పెట్టే ఉపాధ్యాయులు, విధులకు సక్రమంగా వచ్చే టీచర్ల వివరాలను క్రోడికరించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. భిన్నాభిప్రాయాలు.. బడికి వెళ్లకుండా హాజరు వేయించుకునే వారి గుట్టురట్టు చేసే దిశగా ఉన్న ఈ కార్యాచరణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమపై నమ్మకం లేకనే ఈ విధానం ప్రవేశపెడుతున్నారా అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యవస్థను బాగుపరిచే ఏ విధానానికి అయినా ఉపాధ్యాయులంతా మద్దతు ఇవ్వాల్సిందేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వెరసి ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే సర్కారు స్కూళ్లలో ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.