తణుకు టీడీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
పశ్చిమగోదావరి జిల్లాలో ఇరగవరం ఎస్ఐ, రైటర్లను నిర్బంధించిన విషయంలో తణుకు టీడీపీ ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణపై పోలీసు కేసు నమోదైంది. ఇంటికి పిలిపించి నిర్బంధించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించింనందుకు ఐపీసీ సెక్షన్ 342, 353 రెడ్విత్ 34 కింద కేసు నమోదు చేశారు. తణుకు రూరల్ పోలీసు స్టేషన్లో నమోదైన ఈ కేసులో ఎమ్మెల్యే రాధాకృష్ణను ఎ1 నిందితుడిగా పేర్కొన్నారు. జరిగిన ఘటనపై ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్ ఆ స్టేషన్లోనే ఫిర్యాదు చేశారు. అయితే ఇవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎమ్మెల్యేను పంపేస్తారా లేదా కోర్టులో ప్రవేశపెడతారా అనే విషయం తెలియాల్సి ఉంది.
మరోవైపు తణుకు ఘటనపై పోలీసు అధికారుల సంఘం సీరియస్ అయ్యింది. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని సంఘ నేతలు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం తరఫున ఏలూరులో శనివారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ ఘటనలో తణుకు ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ, రైటర్లకు తాము పూర్తి అండగా ఉంటామన్నారు. పోలీసుల మీదే దౌర్జన్యానికి దిగుతున్న ఘటనలు పశ్చిమ గోదావరిలో తరచు జరుగుతున్నాయని, తాజా ఘటనపై తాము ముఖ్యమంత్రి, అసెంబ్లీ స్పీకర్లతో పాటు శాసనసభ ఎథిక్స్ కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వాళ్ల పిల్లలకు తాము రక్షణ కల్పించాలి గానీ, తమకు రక్షణ లేకుండా పోతోందని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసి పోలీసుల మనోధైర్యాన్ని కాపాడాలని సంఘనేతలు కోరారు.