breaking news
tallest police man
-
జగ్దీప్.. బాప్‌రేబాప్..
పాత బాలీవుడ్ సినిమాల్లో ఇదో రొటీన్ సీను.. హీరో ఓ పోలీసు.. విలన్ ఏదో అంటాడు.. అప్పుడు మన హీరో.. ‘కానూన్ కా హాత్ బహుత్ లంబే హోతేహై’అంటూ స్టైల్‌గా ఓ డైలాగు విసురుతాడు. అంటే దానర్థం చట్టం చేతులు చాలా పొడవైనవి.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని.. ఇక్కడ చట్టం చేతులే కాదు.. మనిషి కూడా చాలా పొడవే!! జగ్దీప్ సింగ్.. పంజాబ్ పోలీసు విభాగంలో ట్రాఫిక్ పోలీసు. ఇతని ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. బరువు 190 కిలోలు. ప్రపంచంలోనే అతి పొడవైన పోలీసు అని పేరు. త్వరలోనే గిన్నిస్ బుక్ వారు కూడా ఈ రికార్డును గుర్తించనున్నారని జగ్దీప్ చెబుతున్నాడు. ఇతడి షూ సైజు 19. మన దేశంలో దొరకదు. దీంతో విదేశాల నుంచి తెప్పించుకుంటాడు. షోరూంలో బట్టలు దొరకవు. ప్రత్యేకంగా కుట్టించుకోవాల్సిందే. ఇక బైకు, కారు ప్రయాణాల సంగతి చెప్పనక్కర్లేదు. చిన్నకార్లలో అయితే.. మనోడు పట్టడు. బైకులయితే.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం టైపులో ఇతడి ముందు వెలవెలబోతుంటాయి. మొన్నమొన్నటి వరకూ ఇతడికి పిల్లనిచ్చేవారు కూడా కరువయ్యారు. ఇంత ఎత్తు అంటే ఏదో ఆరోగ్య సమస్య ఉంటుందన్న కారణంతో.. అయితే.. మనోడి అదృష్టం కొద్ది.. అమ్మాయి దొరికింది. జగ్దీప్ అంత హైటు కాకున్నా.. ఇతడి సతీమణి ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. జగ్దీప్ పర్సనాలిటీ చూసి.. సోషల్ మీడియాలో ఇతడిని రాక్షసుడు అన్నవారూ ఉన్నారు. అదే సమయంలో సెల్ఫీల కోసం ఎగబడినవాళ్లూ ఉన్నారు. అలా మనోడి జీవితం కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం టైపులో బాగానే నడిచిపోతోందట. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
టాలెస్ట్ పోలీసుతో సెల్ఫీల పిచ్చి
చండీగఢ్: హర్యానాలోని గుర్గావ్లో ట్రాఫిక్ పోలీసు విధులు నిర్వహిస్తున్న అత్యంత పొడుగరి రాజేష్ కుమార్ ఇప్పుడు ఓ పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు. దారంటా పోయే బాటసారులే కాకుండా కార్లలో వెళుతున్న వారు కూడా దిగొచ్చి ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. ఇప్పుడాయన డ్యూటీలో ఎక్కువ సమయాన్ని పర్యాటకులు, ప్రయాణికులతో సెల్ఫీలు దిగేందుకే కేటాయిస్తున్నారు. ఏడు అడుగుల నాలుగు అంగుళాల ఎత్తున్న 39 ఏళ్ల రాజేష్ కుమార్ భారత పోలీసు డిపార్ట్మెంట్లోనే అత్యంత పొడుగరి రికార్డుల్లోకి ఎక్కారు. తొలుత పంజాబ్‌లో పోలీసుగా చేరిన ఆయన ఇప్పుడు గుర్గావ్లో ట్రాఫిక్ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల కారణంగా ఆయన సెలబ్రిటీగా మారిపోయారు. తన అసాధారణ పొడుగు కారణంగా తాను ఎన్నడూ ఇబ్బంది పడలేదని, తన పొడుగుతనం తన విధులకు ఎంతో ఉపయోగపడిందని కూడా ఆయన చెబుతున్నారు. ట్రాఫిక్ జామైన సందర్భాల్లో తాను పొడుగు ఉండడం వల్ల చాలా దూరం వరకు చూసే అవకాశం లభిస్తోందని, ఫలితంగా ఎక్కడ సమస్య ఉందో తెలుస్తోందని చెప్పారు. తన పొడుగు కారణంగా చిన్నప్పుడు తనను స్కూల్లో కొంతమంది ఆకతాయిలు ఏడిపించే వారని, వాటిని ఎప్పుడూ లెక్క చేయలేదని ఆయన చెప్పారు. ఇప్పుడు తాను పొడుగు ఉన్న కారణంగానే సెలబ్రిటీగా మారిపోవడం, తనతో సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీ పడడం చూస్తుంటే ఆనందంగా ఉంటోందని చెప్పారు. వాస్తవానికి తనకు ‘వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టేన్మెంట్ (డబ్లూడబ్లూఈ)’లో పాల్గొనడం ఇష్టమని, ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలైనప్పుడల్లా విధులకు సెలవుపెట్టి రెజ్లింగ్ శిక్షణకు వెళుతున్నానని ఆయన తనను కలసుకున్న మీడియాకు తెలిపారు. తాను రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనడం ద్వారా కూడా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తానన్న నమ్మకం కూడా తనకు ఉందని ఆయన చెప్పారు.