breaking news
Tallapaka annamacharya
-
సింగపూర్లో ఘనంగా అన్నమయ్య జయంతి ఉత్సవాలు
-
సింగపూర్లో అన్నమయ్య జయంతి ఉత్సవాలు
సింగపూర్ : తొలి తెలుగు పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి వేడుకలు సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో స్థానిక శారదా హాల్, రామకృష్ణ మిషన్లో ఘనంగా జరిగాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సింగపూర్ లో నివసిస్తున్న వందలాది ప్రవాస తెలుగువారు పాల్గొని, సామూహికంగా సంకీర్తనలను ఆలపించారు. అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి విశేష కృషిచేసిన 'పద్మశ్రీ' డా. శోభారాజు ముఖ్య అతిథిగా విచ్చేసి, అన్నమయ్య, ఆయన సంకీర్తనల గురించి ఉపన్యసించి, కొన్ని సంకీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా శోభారాజు మాట్లాడుతూ, ఈ విధంగా అన్నమయ్య జయంతి సింగపూర్ లో తొలిసారిగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చిందని, తెలుగు సంస్కృతి ,సాంప్రదాయాల పై సింగపూర్ తెలుగు సమాజానికి ఉన్న భక్తి, శ్రద్ద ల వలనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రశంసించారు. ప్రత్యేక అతిథిగా రామకృష్ణ మిషన్ అధ్యక్షులు స్వామి విమోక్షానంద విచ్చేసి తమ సందేశాన్నందంచారు. కార్యక్రమానంతరం అన్నప్రసాద వితరణ చేశారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ వినోదభరితం, మనోరంజకమైన కార్యక్రమాలే కాకుండా, ఆ భగవంతుని మీద పూర్తి భక్తి శ్రద్ధలతో భక్తి ప్రధానమైన ఉగాది పూజ వంటి కార్యక్రమాలు చేశామని వివరించారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి, ఆ భగవన్నామస్మరణకి తన జీవితం అంకితం చేసి, తనదైన శైలిలో ఆ శ్రీనివాసుని సంకీర్తనలను రచించి ఆలపించిన మన తెలుగు కవి అన్నమయ్య జన్మదిన మహోత్సవం జరుపుకోవడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినవారికి, వాయుద్య, గాత్రసహకారమందించిన ప్రతి ఒక్కరికీ ప్రాంతీయ కార్యదర్శి అనిల్ పోలిశెట్టి కృతజ్ఞతలను తెలిపారు. ఈకార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమ్రించిన కార్యవర్గసభ్యులు ప్రదీప్, సుందర్, జ్యోతీశ్వర్, మల్లిక్, ప్రసాద్, దాతలకు కార్యదర్శి సత్య చిర్ల దన్యవాదాలు తెలిపారు. -
ఎయిర్పోర్ట్కు తాళ్లపాక అన్నమయ్య పేరు !
కడప: కడప ఎయిర్పోర్ట్కు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య పేరు పరిశీలనలో ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు తెలిపారు. ఆదివారం కడపలో ఎయిర్పోర్ట్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప - బెంగళూరు విమాన సర్వీసును చంద్రబాబు ప్రారంభించారు. అయితే అంతకుముందు విమానాశ్రయంలోకి బీజేపీ నేతలు, కార్యకర్తలు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు, బీజేపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల జోక్యంతో బీజేపీ నేతలు సద్దుమణిగారు. -
శ్రీవారి ప్రియభక్తులు
వేంకటేశ్వరస్వామికి 32,000 కీర్తనల మణిహారాన్ని వేసిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. శ్రీవారినే తన ‘వారు’ గా భావించుకున్న 18 కావ్యాల భక్త కవయిత్రి తరిగొండ వెంగమాంబ. వీరి ప్రస్తావన లేకుండా స్వామి సేవ సంపూర్ణం కాదు. తిరుమలకు పశ్చిమ దిశలోని తరిగొండ గ్రామంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులుండేవారు. వారికి ఐదుగురు మగ సంతానం. కన్యాదానం చేయడానికి పుత్రికను ప్రసాదించమని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, పుట్టింది కనుక, ఆమెను స్వామి పేరుతో వెంగమ్మ అన్నారు. అది క్రీ.శ.1730. శ్రీవారే నా వారు ‘‘శ్రీవేంకటేశ్వరుడే నా భర్త. నాకు పెళ్లేమిటి?’’ అనేది వెంగమ్మ. అయినా, చిత్తూరుకు సమీపంలోని నారగుంటపాళెం గ్రామానికి చెందిన ఇంజేటి వెంకటాచలపతితో ఆమెకు బలవంతంగా పెళ్లి జరిపించారు. ఇంతాచేస్తే ఆప్పుడామె వయసు పదేళ్లే. అయితే, కలసి కాపురం చేయకముందే వెంకటాచలపతి తనువు చాలించాడు. అయినా శ్రీనివాసుడినే భర్తగా భావించి పూలు, గాజులు, చెవికమ్మలతో నిత్యసుమంగళిగా ఉండేది. చివరకు తండ్రి కృష్ణయ్య మదనపల్లెకు చెందిన రూపావతారం సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద వెంగమ్మకు ఉపదేశం చేయించారు. దాంతో భక్తిమార్గంలో ఆమె మరింత పరిపూర్ణత చెందారు. తపస్వినిగా మారారు. ఆమె కలాన భక్తి శతకాలు... నోట కీర్తనలు అలవోకగా జాలువారేవి. ఆమె రచనలు చదివినవారు, భక్తిమార్గాన్ని కళ్లారా వీక్షించినవారు వెంగమ్మను ‘మహాయోగిని’గా భావించి, ‘వెంగమాంబ’ అని గౌరవంగా సంబోధించారు. అలా వెంగమ్మ వెంగమాంబ అయ్యారు. పుట్టినూరుతో కలిసి తరిగొండ వెంగమాంబగా ప్రసిద్ధి చెందారు. ఇరవై ఏళ్ల వయసులో వెంగమాంబ తిరుమలను తన ఆవాసంగా చేసుకున్నారు. స్వామికి ప్రతిరోజూ పుష్పాలు సమర్పించాలని, ప్రతి సాయంత్రం చివర్లో కర్పూర నీరాజనం ఇవ్వాలని కొండ వద్ద తులసివనం పెంచారు వెంగమాంబ. పూలమొక్కలు నాటారు. ఇందుకోసం దిగుడుబావిని తవ్వించారు. పగలు తుంబురుకోనలో తపస్సు... రాత్రి స్వామి ఆలయంలో పూజలు తిరుమలకు వచ్చే భక్తుల సందడి వల్ల తన ధ్యానానికి ఆటంకం కలుగుతోందని వెంగమాంబ ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోని తుంబురుకోనకు చేరుకున్నారు. అక్కడ ఆమె నిశ్చింతగా తపస్సు చేసుకునేవారు. రాత్రి వేళలో బంగారు వాకిళ్లు మూసినా బిలమార్గం ద్వారా ఆమె ఆలయానికి వచ్చేవారు. రాత్రి అర్చనలో ఉపయోగించిన పూలు మారివుండటం, కొత్త పూలు కనిపిస్తూ ఉండటంతో ఆచారులు ఇది వెంగమాంబ మహిమగా రూఢిచేసుకున్నారు. దీంతో యాత్రికులకు భక్తి ప్రపత్తులు కలిగాయి. ఎందరెందరో జమీందారులు, భూస్వాములు, పాలెగాళ్లు, సంస్థానాధీశులు ఆమెకు భక్తితో విరాళాలు సమర్పించారు. సమస్తాన్నీ తిరుమలకు వచ్చే భక్తులకే వినియోగించారు. అన్న సత్రాలు నిర్వహించారు. వేసవిలో చలివేంద్రాలు, బ్రహ్మోత్సవాల్లో అన్నప్రసాదాలు కల్పించారు. క్రీ.శ.1817లో ఈశ్వర శ్రావణ శుద్ధ నవమినాడు వెంగమాంబ సమాధిలోకి ప్రవేశించారు. నేడు ఆ పుణ్యప్రదేశం వెంగమాంబ బృందావనంగా పేరొందింది. భవరోగ వైద్యుడు అన్నమయ్య అన్నమయ్య తాళ్లపాకలో (క్రీ.శ.1408-1503)జన్మించాడు. ప్రస్తుతం ఈ గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లాలోని రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. తన పదహారవ యేటనే తిరుమలకు చేరుకుని స్వామి దివ్యమంగళరూపాన్ని దర్శించుకుని తన స్వరార్చనతో కీర్తించి తరించాడు అన్నమయ్య. శ్రీనివాస స్మరణే బతుకుగా, తిరువారాధనే తెరువుగా జీవించి సంకీర్తనా భవసాగరంలో మునిగితేలాడు. ‘మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా’ అంటూ మేలుకొలుపు పాటతో స్వామిని నిద్రలేపాడు. ‘జోవచ్యుతానంద’ అంటూ నిద్రపుచ్చాడు. నేటికీ అన్నమయ్య వంశీయులు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆలయంలో అన్నమయ్య సంకీర్తనా భండారం వేంకటేశ్వరుడిని వే విధాలుగా స్తుతిస్తూ 32 వేల సంకీర్తనలు రచించారు అన్నమయ్య. వీటిలో దాదాపుగా 12వేల సంకీర్తనలు మాత్రమే రాగి రేకుల రూపంలో నిక్షిప్తమై లభిస్తున్నాయి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుడు, ఈతని కుమారుడు చినతిరుమలాచార్యుల సత్సంకల్పబలం వల్లే అవైనా మనకు దక్కాయి. తిరుమల ఆలయంలో నెలకొల్పిన అన్నమయ్య ‘సంకీర్తనా భాండారం (తాళ్లపాక అర)’ తరతరాల్ని ఉత్తేజితుల్ని చేస్తూ స్వామి సన్నిధానానికి నడిపించే ఆధ్యాత్మిక కోశాగారం. స్వామి ఆలయంలో ప్రతి రోజూ అర్ధరాత్రి సమయంలో ఏడుకొండలవాడికి ఏకాంత సేవ (పవళింపుసేవ) జరుగుతుంది. ఇందులో గర్భాలయానికి ముందున్న శయన మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన పట్టెమంచంపై ‘మణవాళ పెరుమాళ్’(నిత్యనూతన వరుడు) అనే భోగశ్రీనివాసమూర్తి వేంచేపు చేస్తారు. అదే సమయంలో ఆనంద నిలయ గర్భాలయ మూలమూర్తికి చిట్టచివరగా ‘ముత్యాల హారతి’ అనే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వారి మంగళ కర్పూర నీరాజనం ఇస్తారు. తర్వాత అదే హారతి భోగ శ్రీనివాసుడికి ఇస్తారు. తాళ్లపాకవారి జోలపాట అందజేసి ఏకాంత సేవ ముగిస్తారు. తాళ్లపాక వారి లాలిపాట, తరిగొండ వారి ముత్యాల హారతి స్వామికి సమర్పించటం ఆనవాయితీగా మారింది. అలా ఆ ఇద్దరు మహాభక్తులు స్వామివారిని శాశ్వతంగా కొలుస్తూనే ఉన్నారు. అన్నంపెట్టే తండ్రి- ఆత్మనింపే తల్లి ‘‘మానవునికి అసంకల్పితంగా దైవం అనుభవంలోకి రావటానికి అందివచ్చినవి లలితకళలు. ‘పాట’ మధ్యమంగా శ్రీవేంకటేశ్వరుని తత్త్వాది విశేషాలను జనసామాన్యానికి అందించినవాడు అన్నమయ్య. మాండలికాలు, జాతీయాలు, సామెతలు వయ్యారాలు పోతూ ఈ సంకీర్తనలకు అపూర్వ రామణీయతను సంతరించి పెట్టాయి.’’ ‘‘తరిగొండ వెంగమాంబ చాలాకాలం తిరుమలకొండపైన, తుంబురకోన తీర్థం వద్ద తపస్సు చేస్తూ- తరిగొండ నృశింహస్వామికి, తిరుపతి వేంకటేశ్వరస్వామికి అభేదంగా కావ్యాలు, యక్షగానాలు, దండకాలు రచించింది. ఎన్నో సంప్రదాయాలకు ఎదురీది, అచంచలమైన భక్తితో స్వామిని సేవించి, ఎన్నెన్నో మహిమలు చూపి నారీలోకానికి ఆదర్శంగా నిలిచిన మాతృశ్రీ వెంగమాంబ గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఆ తల్లి రచించిన సంకీర్తనలు సుమారు వంద వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆడియో రికార్డింగ్ చేయగా అందులో కొన్ని నేను స్వరపరిచి గానం చేసినవి కూడా ఉండటం నా పూర్వజన్మ సుకృతం.’’ - గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ అన్నమయ్య జోలపాట - వెంగమాంబ హారతి ‘‘దేవుడంటే ఓ పరిమితమైన ఆకారమేనన్న మౌఢ్యం, అర్థరహితమైన కుల విభేదత్వంతో సమాజం అనారోగ్యం పాలవుతుందని గ్రహించిన సర్వాంతర్యామి అన్నమయ్యగా అవతరించి సంకీర్తనౌషధం పంచాడు. సకలోపనిషత్సారాన్ని బ్రహ్మమొక్కటే అన్న సందేశంగా అందించాడు అన్నమయ్య. ఆ నాద సందేశాన్ని గ్రహించి, మనిషి మనిషికీ మధ్య ఉన్న అర్థరహితమైన అడ్డుగోడలు తొలగించుకొని, విశ్వజీవంతో అనుసంధానం కుదుర్చుకున్నప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది.’’ ‘‘దైవభక్తి అను అమృతపానంలో మత్తిల్లిన భక్తులను సమాజమెప్పుడూ అర్థం చేసుకోలేదు. భర్త రోగ కారణంగా అకారణమరణమందగా సమాజం వెంగమాంబను సుమంగళీ చిహ్నాలను తీసివేయమని శాసించింది. అర్థరహితమైన ఆ ఆచారాన్ని రెండు శతాబ్దాల క్రితమే ప్రశ్నించి, ఎదురించి నిలిచిన దృఢశీల వెంగమాంబ. వేంకటేశ్వర స్వామికి అన్నమయ్య జోల ప్రీతి. అన్నమయ్య జోల విన్న తర్వాత ఇంకేదీ వినని స్వామి తరిగొండ వెంగమాంబ హారతి మటుకు స్వీకరించాడట!’’ - ‘పద్మశ్రీ’ శోభారాజు