breaking news
Talks with India
-
భారత్‌తో చర్చలకు సిద్ధమే: షెహబాజ్
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఇరు దేశాల్లో పేదరికం, నిరుద్యోగంతో పోరాడుతున్న నేపథ్యంలో యుద్ధం అనేది మార్గం కాదన్నారు. పాకిస్తాన్ మినరల్స్ సమ్మిట్ సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమంలో షెహబాజ్ పాల్గొన్నారు.. ఆర్థికంగా కుదేలైన దేశంలో విదేశీ పెట్టుబడుల కోసం ఉద్దేశించిన ఈ సదస్సులో హెహబాజ్ మాట్లాడుతూ పాకిస్తాన్ కోలుకోవడం కోసం ఇరుగు పొరుగు దేశలన్నింటితోనూ తాము మాట్లాడతామని, పొరుగు దేశంతో యుద్ధం అనేది ఇక మార్గం కాదన్నారు. భారత్‌తో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కశ్మీర్ అంశంలో సీమాంతర ఉగ్రవాదాన్ని నిరంతరం ప్రేరేపిస్తూ ఉండడంతో ఇరు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత ప్రధానితో చర్చలకు సిద్ధం
ఇస్లామాబాద్/అమృత్సర్: భారత ప్రధాని మోదీతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తమ భూభాగంలో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం పాక్‌కు ఎన్నటికీ లాభం చేకూర్చదన్నారు. ఉగ్రమూకలకు మద్దతు నిలిపివేసేవరకూ పాక్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని విదేశాంగ మంత్రి సుష్మ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్రాన్ స్పందించారు. ‘పాక్ ప్రజలంతా భారత్‌తో శాంతిని కోరుకుంటున్నారు. మోదీతో ఏ విషయంపై అయినా చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా. సైనిక చర్యతో కశ్మీర్ సమస్యను పరిష్కరించలేం. పొరుగుదేశాల్లో విధ్వంసం సృష్టించే ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పించడం పాక్‌కు ఎన్నటికీ లాభించదు’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారవుతుందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు..‘అసాధ్యమన్నది ఏదీ లేదు‘ అని ఇమ్రాన్ జవాబిచ్చారు. పాక్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని పంజాబ్‌లో ఉన్న డేరాబాబా సాహిబ్ గురుద్వారాలను కలుపుతూ నిర్మిస్తున్న కారిడార్ పట్ల తనకు తెలిసినంతవరకూ మెజారిటీ భారతీయులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అయితే శాంతిచర్చల కోసం ఇరుపక్షాలు ముందుకురావాల్సి ఉంటుందనీ, ఓపక్షం చొరవ సరిపోదని వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం భారత్ నుంచి ఈ విషయంలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. నిషేధిత జమాత్ ఉద్ దవా(జేయూడీ) చీఫ్, ముంబై మారణహోమం సూత్రధారి హఫీజ్ సయీద్‌పై ఇప్పటికే ఐరాస ఆంక్షలు విధించిందనీ, జేయూడీని ఉగ్రసంస్థగా ప్రకటించిందని గుర్తుచేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించడంపై పరోక్షంగా స్పందిస్తూ.. ‘మనం గతంలో బతకలేం. గతాన్ని వదిలేసి భవిష్యత్ దిశగా ఇరుదేశాలు సాగాలి. పాక్ గాలిస్తున్న కొందరు నేరస్తులు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదితో సిద్ధూ పంజాబ్ మంత్రి సిద్ధూ ఖలిస్తాన్ వేర్పాటువాది, పాక్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ (పీఎస్‌జీపీసీ) సభ్యుడు గోపాల్‌సింగ్ చావ్లాతో కలిసి ఫొటో దిగారు. దీనిపై శిరోమణి అకాలీదళ్ నేత సుక్బీర్ బాదల్ మాట్లాడుతూ.. ఇటీవల సిద్ధూ నియోజకవర్గంలో జరిగిన బాంబుదాడి వెనుక గోపాల్ ఉన్నారని ఆరోపించారు. దేశం ముఖ్యమో లేక ఇలాంటి వ్యక్తులు ముఖ్యమో సిద్ధూ స్పష్టం చేయాలన్నారు. కాగా, ఈ విమర్శలపై సిద్ధూ స్పందిస్తూ.. ‘పాక్‌లో నేను చాలామందితో కలిసి ఫొటోలు దిగాను. వాటిలో ఎవరెవరు ఉన్నారో చెప్పడం కష్టం. పాక్ ప్రజలు కురిపించిన ప్రేమకు నేను తడిసి ముద్దయ్యా.. రోజుకు అక్కడ 10,000 ఫొటోలు దిగాను. వాటిలో ఉన్నది చావ్లానా? చీమానా? అన్నది నాకు తెలియదు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీ గురుద్వారా కమిటీ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ సర్నా మాట్లాడుతూ.. గోపాల్ సింగ్ చావ్లాను తప్పించుకునేందుకు సిద్ధూ యత్నించారనీ, కానీ ఎలాగోలా సిద్ధూతో ఫొటోలు దిగగలిగాడన్నారు. -
బేషరతుగా భారత్‌తో చర్చలకు సిద్ధం: షరీఫ్
వాలెట్టా (మాల్టా): సుస్థిరమైన శాంతి కోసం బేషరతుగా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. భారత్, అఫ్గానిస్థాన్ సహా అన్ని పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని పాకిస్థాన్ భావిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన పేర్కొన్నట్టు జీయో న్యూస్ తెలిపింది. మాల్టా రాజధాని వాలెట్టాలో జరిగిన కామన్వెల్త్ ప్రభుత్వాధిపతుల సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో సమావేశంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని కామెరాన్, షరీఫ్ నిర్ణయించినట్టు జీయో న్యూస్ తెలిపింది.