గూడెంపై సీబీ‘ఐ’
- తహసిల్దార్ కార్యాలయంలో రికార్డుల తనిఖీ
- పారిశ్రామికవేత్తకు చెందిన భూముల వివరాలు సేకరణ!
తాడేపల్లిగూడెం : చెన్నై నుంచి వచ్చిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు శుక్రవారం తాడేపల్లిగూడెం తహసిల్దార్ కార్యాలయంలో భూమి హక్కులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అడంగళ్ వివరాలు సేకరించారు. తణుకు రోడ్డులోని ఓ ఆధ్యాత్మిక కేంద్రం సమీపంలో గల భూములను చూశారు. రికార్డులతో ఆ ప్రాంత సర్వే నంబర్లు సరిపోలాయో లేదో చూసుకున్నారు.
పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త ఒకరు ఓ జాతీయ బ్యాంకునకు కోట్లాది రూపాయలు బకాయిపడిన నేపథ్యంలో ఆ మొత్తాలను రికవరీ చేసే కార్యక్రమంలో భాగంగా సీబీఐ అధికారులు ఇక్కడికి వచ్చినట్టు చెబుతున్నారు. సదరు పారిశ్రామికవేత్త రుణం పొందే సమయంలో తన పరిశ్రమలో పనిచేస్తున్న కొందరు చిరుద్యోగుల పేరిట కొల్లేరు ప్రాంతంలోని సర్వే నంబర్లతో భూమి పత్రాలను సృష్టించి బ్యాంకుకు సమర్పించినట్టు సమాచారం. చిరుద్యోగులను పరిశ్రమలో భాగస్వాములుగా చూపించి వారి పేరిట కూడా రుణాలను తీసుకున్నట్టు భోగట్టా. ఈ వ్యవహారంపై ఏడాది కాలంగా విచారణ జరుగుతోందని, అందులో భాగంగానే సీబీఐ బృందం క్షేత్రస్థారుు పరిశీలనకు వచ్చిందని సమాచారం. అరుుతే, ఈ విషయూలేవీ సీబీఐ అధికారులు, ఇతర అధికారిక వర్గాలు ధ్రువీకరించలేదు.
పట్టణంలో కలకలం
సీబీఐ అధికారులు రావడం పట్టణంలో చర్చనీయూంశమైంది. వారు తరచూ తాడేపల్లిగూడెం వస్తుండటంతో వ్యాపార, పారిశ్రామిక, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేగుతోంది. మూడు నెలల వ్యవధిలో సీబీఐ అధికారులు నాలుగుసార్లు పట్టణానికి వచ్చారు. రాజమండ్రి సీడబ్ల్యూసీ గోదాముల ఇన్ చార్జిగా పనిచేసే ఎలీషా అనే ఉద్యోగి రూ.6 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన సందర్బంలో సీబీఐ ఏసీబీ విభాగం అధికారులు విశాఖ నుంచి తాడేపల్లిగూడెం వచ్చారు. ఆ ఉద్యోగికి ఇక్కడున్న ఆస్తుల వివరాలను అప్పట్లో సేకరించారు. ఈ మధ్యనే ఉల్లిపాయల వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వివరాలను సేకరించడానికి వచ్చారు. అంతకుముందు కొన్ని భూముల వివరాలు సేకరించడానికి రాగా, తాజాగా శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను, భూములను పరిశీలించి వెళ్లారు.