breaking news
sy qureshi
-
మౌనం ప్రమాదకరం!
ఎవరు చికాకు పడినా, ఎంతగా అయిష్టత ప్రదర్శించినా ఈవీఎంలపై సందేహాలు తలెత్తుతూనే ఉన్నాయి. అడుగుతున్న వారిని తప్పుబట్టి, వారిపై ఆరోపణలు చేసి చేతులు దులుపుకుంటే ఇది సమసి పోదు. ఎందుకంటే సమస్య ఒకటే కావొచ్చుగానీ... దాని సారాంశం, స్వభావం మారుతు న్నాయి. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్వై ఖురేషీ వ్యాఖ్యలతో ఈవీఎంలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. నాయకులు ఈ సమస్య లేవనెత్తితే ఓటమి నెపం ఈవీఎంలపై నెడు తున్నారని ఆరోపించవచ్చు. కానీ సీఈసీ బాధ్యతలు నిర్వర్తించిన ఖురేషీ వంటివారు సందేహ పడటాన్ని ఏమనుకోవాలి? చిత్రమేమంటే ఎన్నికల సంఘం (ఈసీ) ఈ సంశయాల విషయంలో మూగనోము పాటిస్తున్నది. ఇందువల్ల తన తటస్థ పాత్రకు తూట్లు పడుతున్నదని, అందరూ తనను వేలెత్తిచూపే రోజొకటి వస్తుందని ఈసీ పెద్దలకు తెలిసినట్టు లేదు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈవీఎంల అవకతవకలు మాత్రమే కాదు...ఈసీ చేతగానితనం కూడా బయటపడుతోంది.ఈనెల 13–20 మధ్య రెండు దశల్లో జార్ఖండ్లోనూ, 20న ఒకేసారి మహారాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీయే, జార్ఖండ్లో ఇండియా కూటమి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. కానీ మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన రోజున పోలింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన ప్రకటనలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిశాక మొత్తం 58.2 శాతం (6,30,85,732) మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారని ప్రకటన వెలువడింది. అదే రోజు రాత్రికల్లా దీన్ని సవరించి 65.02 శాతమని తెలిపారు. ఆ తర్వాత కౌంటింగ్కు ముందు అది కాస్తా 66.05 శాతానికి పెరిగింది. మొత్తంగా చూస్తే ఓటింగ్లో 7.83 శాతం పెరుగుదల కనబడింది. దీన్ని ఓటర్ల సంఖ్యలో చూస్తే ఈ పెరుగుదల స్థూలంగా 76 లక్షల మేర ఉన్నట్టు లెక్క. జార్ఖండ్ది మరో కథ. అక్కడ తొలి దశ పోలింVŠ కూ, మలి దశ పోలింగ్కూ మధ్య 1.79 శాతం పెరుగుదల కనబడింది. రెండో దశలో ఈ పెరుగుదల 0.86 శాతం మాత్రమే. మహారాష్ట్రలో చూపించిన పెరుగుదల శాతానికీ, జార్ఖండ్ పెరుగుదల శాతానికీ ఎక్కడైనా పొంతన వుందా? ఓటర్ల సంఖ్య చూస్తే జార్ఖండ్ తొలి దశలో 2,22.114మంది పెరగ్గా, రెండో దశలో ఆసంఖ్య 1,06,560. మహారాష్ట్ర పెరుగుదలతో దీనికెక్కడైనా పోలికుందా? ఓటింగ్ పూర్తయ్యాక ప్రక టించే అంకెలకూ, చివరిగా ప్రకటించే అంకెలకూ మధ్య వ్యత్యాసం ఉండటం సర్వసాధారణం. కానీ ఇదెప్పుడూ ఒక శాతం మించలేదని మేధావులు చెబుతున్నారు. దీనికి ఈసీ సంజాయిషీ మౌనమే! ఇప్పుడున్న విధానంలో పోలింగ్ కేంద్రాల్లో ఎప్పటికప్పుడు పోలైన ఓట్ల సంఖ్య ఎంతో తెలిపే డేటా తయారవుతుంటుంది. అలాంటపుడు కొన్ని గంటలకూ, కొన్ని రోజులకూ ఇది చకచకా ఎలా మారి పోతున్నది? అందులోని మర్మమేమిటో చెప్పొద్దా?మొన్న మే నెల 13న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో సైతం ఇదే తంతు కొనసాగింది. ఆరోజు రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. రాత్రి 11.45కి దీన్ని సవరించి మొత్తం 76.50 శాతమని తెలిపింది. మరో నాలుగు రోజులకల్లా తుది పోలింగ్ శాతం 80.66 అని గొంతు సవరించుకుంది. అంటే మొదట చెప్పిన శాతానికీ, మరో నాలుగు రోజుల తర్వాత ప్రకటించిన శాతానికి మధ్య 12.5 శాతం ఎక్కువన్నమాట! సాధారణ అంకెల్లో చూస్తే 49 లక్షలమంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చినట్టు లెక్క. కొన్ని నియోజక వర్గాల్లో తెల్లారుజామువరకూ పోలింగ్ సాగుతూనే వుంది. సాయంత్రం గడువు ముగిసే సమయానికి ఆవరణలో ఉన్న ఓటర్లకు స్లిప్లు ఇచ్చి గేట్లు మూసేయాలన్న నిబంధనవుంది. అంతేకాదు. క్యూలో చిట్టచివర గేటు దగ్గరున్న ఓటరుకు ఒకటో నంబర్ స్లిప్ ఇచ్చి అక్కడినుంచి క్రమేపీ పెంచుకుంటూపోయి బూత్ సమీపంలో ఉన్న వ్యక్తికి ఆఖరి స్లిప్ ఇవ్వాలి. ఓటేశాక ఆ స్లిప్లు సేకరించి భద్రపరచాలి. సీసీ కెమెరా డేటా జాగ్రత్త చేయాలి. ఇదంతా జరిగిందా? వాటి మాట దేవుడెరుగు... పరాజితులు న్యాయస్థానంలో సవాలు చేసిన సమయానికే ఈవీఎంల డేటా ఖాళీ చేశారు. వీవీ ప్యాట్ స్లిప్లను ధ్వంసం చేశారు. ఈవీఎంలలో నమోదైన చార్జింగ్ మరో ప్రహసనం. భద్రపరిచినప్పుడు ఈవీఎంలో వున్న చార్జింగ్కూ, కౌంటింగ్ రోజున తెరిచినప్పుడున్న చార్జింగ్కూ పోలికే లేదు. రోజులు గడిచేకొద్దీచార్జింగ్ తగ్గటమే అందరికీ తెలుసు. కొన్ని ఈవీఎంలలో పెరుగుదల కనబడటాన్ని ఏమనుకోవాలి?తిరిగి బ్యాలెట్ విధానం అమలుకు ఆదేశించాలంటూ కె.ఏ. పాల్ దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చుతూ ఓడినవారే ఈవీఎంలపై ఆరోపణలు చేస్తుంటారని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజమే కావొచ్చు. గెలిచినవారికి ఆ అవసరం ఉండకపోవచ్చు. కానీ ఆమధ్య ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పుడు మాజీ సీఈసీ ఆధారసహితంగా ఆరోపించటాన్ని ఏమనాలి? నిజమే... గతంలోనూ ఈ మాదిరి ఆరోపణలు వచ్చివుండొచ్చు. ఓటమి జీర్ణించుకోలేకే టీడీపీ, బీజేపీ, అకాలీ దళ్ ఆరోపించాయని భావించటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు తగిన ఆధారాలు చూప లేకపోయాయి. ఇప్పుడింత బాహాటంగా కళ్లముందు కనబడుతున్నా, డేటా వేరే కథ వినిపిస్తున్నా, ఈసీ తగిన సంజాయిషీ ఇవ్వలేకపోతున్నా మౌనంగా ఉండిపోవాలా? పరాజితులది అరణ్యరోదన కావటం ప్రజాస్వామ్యానికి ప్రమాద సంకేతం. ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడటా నికి దారితీసే వైపరీత్యం. అందుకే వ్యవస్థలన్నీ నటించటం మానుకోవాలి. ఏం జరిగివుంటుందన్న దానిపై సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలి. లేదా తప్పు జరిగిందని అంగీకరించాలి. ఇందులో మరో మాటకు తావులేదు. -
బిహార్ ఎన్నికల్లో డబ్బు హవా...
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలంటే పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, పోలింగ్ యంత్రాల అపహరణలాంటి అంశాలు తరచుగా వినిపించేవి. ఇప్పుడవి గతించిన అంశాలు. కేంద్ర బలగాలతోని పోలింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రతను కల్పించడం, అందుకు వీలుగా పోలింగ్ విడతలను పెంచడం లాంటి చర్యల వల్లన అవి గతకాలపు విద్యలుగా మారిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు ధనలక్ష్మి తన ప్రభావాన్ని చూపిస్తోంది. నోటుతో ఓటు కొనడం సర్వ సాధారణమై పోయింది. ఈ సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతోంది. 2010లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒకటిన్నర కోటి రూపాయల డబ్బును ఎన్నికల కమిషన్ వర్గాలు పట్టుకోగా గత లోక్సభ ఎన్నికల సందర్భంగా నాలుగు కోట్ల రూపాయల డబ్బును పట్టుకున్నాయి. ఇప్పడు జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు విడతల పోలింగ్ సందర్భంగా ఇప్పటికే 20 కోట్ల రూపాయలను ఎన్నికల కమిషన్ వర్గాలు పట్టుకున్నాయి. ఇంకా మూడు విడతల పోలింగ్ మిగిలే ఉంది. ఓ టెలివిజన్ ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ కారణంగా మరో 19 కోట్ల రూపాయలను ఆదాయం పన్నుశాఖ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన డబ్బు సంగతి పక్కన పెడితే పట్టుపడకుండా రాజకీయ పార్టీలు, నాయకుల ద్వారా నేరుగా ఓటర్ల జేబుల్లోకి వెళుతున్న డబ్బుకు లెక్కే లేదు. గతంలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకోవడం రిగ్గింగ్ చేయడం, పోలింగ్ యంత్రాలను ఎత్తుకుపోవడంలో ప్రధాన పాత్ర వహించినవారిలో అగ్రవర్ణాల వారిదే పైచేయి కాగా, ఈసారి డబ్బు ప్రలోభపెడుతున్న వారిలో కూడా వారిదే పైచేయిగా కనిపిస్తోంది. డబ్బులు చేతులు మారకుండా ఆధునిక జీపీఎస్ వ్యవస్థ ఆధారంగా రాజకీయ నేతలు, కార్యకర్తల కదలికలపై ఎన్నికల కమిషన్ వర్గాలు గట్టి నిఘా పెడుతున్నప్పటికీ వారికి చిక్కకుండా రాజకీయ నాయకులు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్నారు. మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషి రాసిన ‘యాన్ అన్డాక్యుమెంటెడ్ వాండర్-ది మేకింగ్ ఆఫ్ ది గ్రేట్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకంలో వెల్లడించిన అంశాల ప్రకారం పండుగలు, పబ్బాల పేరిట ఓటర్లకు డబ్బు పంచుతున్నారు. దొంగ పుట్టిన రోజుల పేరుమీద ఓటర్లకు నగదు, చీరలు, దోవతులు తదితర బహుమతులను పంచుతున్నారు. ఓటర్ల గృహాల వద్ద నకిలీ హారతి కార్యక్రమాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా డబ్బు పంచుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో టన్నుల కొద్ది చీరలు, దోవతులతోపాటు వేలాది గ్యాస్ స్టవ్లు, వాషింగ్ మిషన్లను ఓటర్లకు పంచారని ఆ పుస్తకంలో ఖురేషి తెలిపారు. స్థానిక మనీలెండర్ల ద్వారా కూడా డబ్బుల పంపిణీ జరిగినట్టు ఆయన చెప్పారు. 2009లో మధురైలోని తిరుమంగలమ్ ఉప ఎన్నికల్లో డీఎంకే పార్టీ కార్యకర్తలు ఓటుకు ఐదు వేల రూపాయల చొప్పున పంచినట్టు ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఈ డబ్బు ప్రభావాన్ని అరికట్టేందుకు లా కమిషన్ చేసిన సిఫార్సులపై కసరత్తు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.