breaking news
swacha town
-
స్వచ్ఛసేవకు జాతీయ అవార్డు
డ్వాక్రా పొదుపు సంఘాలంటే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది నెలనెలా పొదుపు చేయడం... బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవడం...తిరిగి చెల్లించడం. దీనికి భిన్నంగా శ్యామలాంబ ఎస్ఎల్ఎఫ్(స్లమ్ లెవల్ ఫెడరేషన్) ఆలోచించింది. ఆలోచనను ఆచరణలో పెట్టింది. అందుకు తగిన గుర్తింపు పొందింది. జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం, సాలూరు: మున్సిపాలిటీలోని శ్యామలాంబ ఎస్‌ఎల్‌ఎఫ్‌కు జాతీయ స్థాయిలో స్వచ్ఛసేవా ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. పట్టణంలోని 13వ వార్డుకు చెందిన శ్యామలాంబ ఎల్ఎల్ఎఫ్ పారిశుద్ధ్య నిర్వహణలో తన పరిధిలో ఉన్న 28 స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన పరుస్తూనే ఇతర బాధ్యతలను సమర్ధంగా నిర్వహించడంతో జాతీయ స్థాయిలో పురస్కారం సొంతం చేసుకొంది. ఆదర్శంగా సేవా కార్యక్రమాలు... ♦ రోజువారీగా ఇళ్లల్లో నుంచి వచ్చే చెత్తను, ఇతర వ్యర్ధాలను ఆరుబయట, మురుగు కాలువల్లో పారబోయకుండా వీధుల్లోకి వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు అందించేలా మహిళలను చైతన్యపరచడం. ♦ వచ్చే చెత్తలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా నిల్వచేసేలా చేయడం. ♦ వ్యక్తిగత, సామాజిక మరుగుదొడ్ల ప్రాముఖ్యత, వినియోగంపై అవగాహన పరచడం, నిర్వహించేలా చేయడం. ♦ గడిచిన పదేళ్లగా సంఘం పరిధిలో 280 మంది మహిళలను అనునిత్యం అవగాహన పరచడంలో ఏవిధంగా శ్యామలాంబ ఎస్ఎల్ఎఫ్ ముందుకు పోతోందో తెలిపే విషయాలను పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆన్లైన్లో పొందుపరచడంతో ఇటీవల జరిగిన స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలో కూడా ఈ సంఘం మహిళలతో ప్రత్యేకంగా సర్వే బృందం సభ్యులు సమావేశం నిర్వహించింది. పారిశుద్ధ్య విషయంలో రూపొందించిన 58అంశాలతో కూడిన ఫార్మాట్‌పై ప్రశ్నలు వేసి, వారికున్న పరిజ్ఞానాన్ని పరీక్షించారు. అందులో సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వడంతో పాటు క్షేత్ర స్థాయిలో కూడా అదే తరహా పరిస్థితులు కనిపించడంతో స్వచ్ఛసేవ ఎక్స్‌లెన్స్ పురస్కారానికి సర్వే కమిటీ సిఫారసు చేసింది. ఆనందంగా వుంది... ఇతర పొదుపు సంఘాల మాదిరిగా మా సమావేశాలు నిర్వహించుకోవడంతో పాటు సామాజిక విషయాలపై కూడా ప్రతీ సమావేశంలోనూ చర్చించేవాళ్లం. దీంతో మహిళల అందరిలోనూ పారిశుద్ధ్య విషయంలో అవగాహన పెరిగింది. పదేళ్లుగా మేం చేస్తోన్న కృషికి తగిన గుర్తింపు దక్కిందన్న ఆనందం మాకెంతో గొప్పగా వుంది. ఇది మహిళలందరి విజయం.–నల్లి పద్మ, శ్యామలాంబఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు, సాలూరు కృషి ఫలించింది.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం విషయంలో మేం చేస్తోన్న కృషి ఫలించింది. మహిళలతోనే మార్పు సాధ్యమన్న విషయాన్ని నమ్మి, వారిని చైతన్యపరచడానికి అధిక ప్రాదాన్యమిచ్చాం. తడిపొడి చెత్తల సేకరణ, పారిశుద్ధ్యంపై మేం చెప్పే విషయాలను అర్ధం చేసుకున్న మహిళలు జాతీయ స్థాయి పురస్కారాన్ని దక్కించుకోవడం అభినందనీయం. –ఎంఎం.నాయుడు, మున్సిపల్ కమిషనర్, సాలూరు -
‘స్వచ్ఛ’పేట!
♦ సిద్దిపేట సిగలో త్వరలో మరో మణిహారం ♦ ‘స్వచ్ఛ భారత్’ జాబితాలో చోటు ♦ పట్టణంలో అస్కీ బృందం పర్యటన ♦ వాస్తవ పరిస్థితులపై ఆరా ♦ రోజంతా పరిశీలనలు సిద్దిపేట జోన్: ఇప్పటికే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను మూటగట్టుకున్న సిద్దిపేట.. మరో అవార్డును సొంతం చేసుకోనుంది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ పట్టణం జాబితా షార్ట్ లిస్టులో సిద్దిపేటకు స్థానం దక్కింది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో స్వచ్ఛ బాట సఫలమైంది. ‘స్వచ్ఛ భారత్’ అవార్డను అందుకునేందుకు మున్సిపల్ సిద్ధమైంది. ఇక్కడ అమలవుతున్న విధానాలను వివిధ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. దేశవ్యాప్తంగా 20 పట్టణాల నుంచి 350 దరఖాస్తులను స్వీకరించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వివిధ దశల్లో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి షార్ట్ లీస్ట్ కింది 70 దరఖాస్తులను ఎంపిక చేసింది. వాటిలో తెలంగాణ నుంచి 8 దరఖాస్తులు రావడం.. అందులో సిద్దిపేట మున్సిపాలిటీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ను కేంద్రం ఎంపిక చేసింది. వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి అస్కీ (అడ్మినిష్ట్రేషన్ స్టాప్ కాలేజీ ఆఫ్ ఇండియా) బృందాన్ని సిద్దిపేటకు పంపింది. ప్రొఫెసర్ రవీంద్రప్రసాద్ నేతృత్వంలోని బృందం సభ్యులు బాలసుబ్రమణ్యం, తార రావు, గౌతమిలు గురువారం సిద్దిపేటకు చేరుకున్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం సమావేశ మందిరంలో మున్సిపల్‌కు చెందిన వివిధ విభాగాల అధికారులు, మెప్మా, మురికి వాడల అభివృద్ధి కమిటీ, ఐటీసీ సంస్థ ప్రతినిధులచే సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. సిద్దిపేట పట్టణంలో అర్బన్ డెవలప్మెంట్ కింద చేపడుతున్న వినూత్న పథకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అడిగితెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సిద్దిపేటలో వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియపై ఆరా తీశారు. శానిటేషన్, మెప్మా, సమాఖ్య సంఘాల ప్రతినిధుల నుంచి పలు అంశాలను అడిగితెలుసుకున్నారు. బహిరంగ మలవిసర్జన లేని పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడానికి చేపట్టిన అంశాలను మున్సిపల్ కమిషనర్ రమణాచారి, చైర్మన్ రాజనర్సు, ఓఎస్డీ బాల్‌రాజు ద్వారా అడిగి తెలుసుకున్నారు. పందులు లేని పట్టణం సిద్దిపేటలో పందులను తరలించి పారిశుద్ధ్యాన్ని గాడిన పెట్టామని మున్సిపల్ కమిషనర్ రమణాచారి కేంద్ర బృందానికి వివరించారు. అధికారుల వివరణతో ఆశ్చర్యానికి లోనైన బృందం చీఫ్ రవీంద్రప్రసాద్.. మరింత ఆసక్తిగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఎలా సాధ్యమైందంటూ అని అడిగారు. 30 సంవత్సరాలుగా ఈ ప్రక్రియను ఎందుకు నిర్వహించలేదని బృందం సిద్దిపేట అధికారులను ప్రశ్నించింది. ఒక దశలో కమిషనర్ జోక్యం చేసుకొని అప్పట్లో ఐఎస్ఎల్ నిర్మాణ పథకంపై పూర్తిస్థాయిలోప్రచారం, సరైన పారితోషకం, అనుకూలమైన విధానాలు లేకపోవడం వల్లే పూర్తి స్థాయిలో సాధ్యకాలేదన్నారు. అనంతరం వాటర్ సరఫరా, ఇంటింటి చెత్త సేకరణ, మురికి కాలువల శుద్ధీకరణ, తడి, పొడి చెత్త సేకరణతో పాటు ఇతర అంశాలపై బృందం సభ్యులు గంటల కొద్ది సమీక్షించారు. అంతకు ముందు ఐటీసీ అధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ద్వారా సిద్దిపేటలో వావ్ పథకం కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మేంట్ ఇంటింట తడి పొడి చెత్త సేకరణ, వేరు చేసే ప్రక్రియను, తదితర అంశాలను బృందం తిలకించింది. అనంతరం కాళ్లకుంట కాలనీ, గాడిచెర్లపల్లితోపాటు, మందపల్లి డంప్‌యార్డు, ఐటీసీ హబ్, పట్టణంలోని సులభ్ కాంప్లెక్స్‌లను , మురికి కాలువలను బృందం పరిశీలింది. వీరి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ అక్తర్‌పటేల్, మున్సిపల్ అధికారులు లక్ష్మణ్, ఏఈ ఇంత్యాస్, శానీటరీ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, సత్యనారాయణ, టీపీఓ రాంరెడ్డి, మెప్మా ప్రతినిధి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.