breaking news
sureshprabhu
-
నిర్మల్ పై మనసు పెట్టమ్మా.!
సాక్షి, నిర్మల్: ఈ ప్రాంతవాసుల రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్‌లను కలుపుతూ రైల్వేలైన్ నిర్మించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలిశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంలో సగం వాటా భరిస్తామంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన లేఖను ఆయనకు అందించారు. రాష్ట్రం సగం ఖర్చుకు ముందుకు రావడంతో కేంద్రం కూడా వెంటనే పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.2,720 కోట్లతో నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు రైల్వేశాఖ ఒక్కపని కూడా చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ(మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్) కూడా కుదుర్చుకోలేదు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏడాది క్రితం సికింద్రాబాద్, నాందేడ్‌లలో పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఇందులో ఆర్మూర్ – నిర్మల్ –ఆదిలాబాద్ లైన్ నిర్మాణాన్నీ లేవనెత్తారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఎప్పటి నుంచో ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాద్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్ధాల క్రితం నుంచి ఉంది. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని పటాన్చెరువు నుంచి ఆదిలాబాద్‌కు వయా ఆర్మూర్, నిర్మల్ మీదుగా పారిశ్రామిక–వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. 2009 రైల్వే బడ్జెట్లోనే లైన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి వెంట ఈ లైన్ నిర్మించాలన్న ప్రతిపాదనలూ చేశారు. కొన్నేళ్లకు సర్వే కూడా పూర్తిచేశారు. తీరా.. 317 కిలోమీటర్ల దూరభారంగా ఉన్న ఈ లైన్ నిర్మాణానికి రూ.3,771కోట్లు పెట్టడం లాభదాయకం కాదేమో.. అంటూ అప్పట్లో రైల్వేశాఖ చేతులెత్తేసింది. ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. ఈ లైన్నిర్మాణం మూలనపడింది. మళ్లీ రెండున్నరేళ్ల కిందట అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు పట్టుబట్టి సీఎం కేసీఆర్‌ను సగం వాటా భరించేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్రం రైల్వేమంత్రి సురేశ్ప్రభుతోనూ పచ్చజెండా ఊపించారు. ఈసారి పటాన్చెరు నుంచి కాకుండా పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గంలో ఉన్న ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 137కి.మీ. రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని తేల్చారు. కేంద్రం 2017లో పచ్చజెండా ఊపినా రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందన కూడా చూపలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడల్లా రైల్వేలైన్ తెరపైకి వస్తూనే ఉంది. ఈఎస్ఐ కూడా.. రైల్వేలైన్‌తో పాటు జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందటే అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయన నిర్మల్‌లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు భైంసాలో డిస్పెన్సరీ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ఈఎస్ఐ అధికారులు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడి అధికారులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ భవనాన్ని చూపించారు. దానిపై ఈఎస్ఐ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ మంత్రి పదవీ నుంచి దిగిపోవడంతో ఫైల్ పెండింగ్‌లో పడింది. మళ్లీ దీనిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసి ఆస్పత్రి ఏర్పాటుపై వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఈఎస్ఐ ఆస్పత్రి కోసం ముందడుగు పడలేదు. దీంతో పాటు బాసర్, భైంసాల మీదుగా బోధన్, బాన్సువాడల నుంచి సరిహద్దులో జాతీయ రహదారి నిర్మాణం పెండింగ్‌లోనే ఉంది. జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం ఇప్పటికీ ఊసు లేదు. ఈసారి ఆదిలాబాద్ నుంచి బీజేపీకే చెందిన ఎంపీ సోయంబాపురావు ఉండటంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారైన కేంద్రం జిల్లాపై కరుణించాలని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వేలైన్ కోసం కృషి చేస్తా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేలైన్ నిర్మాణం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. త్వరలోనే రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక తీసుకువచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేయించడంపైనా కృషిచేస్తాను. దీంతో పాటు ఇతర కేంద్ర పథకాలను తీసుకువచ్చేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. – సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్ -
వీసాలపై గట్టిగా ప్రస్తావించాం
వాషింగ్టన్: హెచ్–1బీ, ఎల్1 వీసాల విషయం గురించి అమెరికాతో గట్టిగానే ప్రస్తావించామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు శనివారం చెప్పారు. భారత ఐటీ నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం చేకూరుతోందనీ, వీసా నిబంధనలు కఠినతరం చేసి వారు అమెరికా రాకుండా అవరోధాలు కల్పిస్తే ఆ దేశానికే నష్టమని వివరించినట్లు ఆయన వెల్లడించారు. సురేశ్ ప్రభు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. భారత్–అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య విధాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా వాణిజ్య విభాగం ప్రతినిధి రాబర్ట్ లైజర్ హాజరయ్యారు. అనంతరం ప్రభు విలేకరులతో మాట్లాడుతూ ‘భారత ఐటీ నిపుణుల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందుతుండటంతోపాటు ఈ దేశ ఉత్పాదకత పెరుగుతోంది. భారతీయులు రాకపోతే అమెరికాకే కష్టం’ అని అమెరికా ప్రతినిధులకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. విదేశీయులు అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనీ, అమెరికాలో ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత ఉండాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మొదట్నుంచి కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. తాజాగా హెచ్–1బీ, ఎల్1 వీసాల పునరుద్ధరణ నిబంధనలను అమెరికా మరింత కష్టతరంగా మార్చింది. భారతీయులకు వీసాల విషయంలో నిబంధనల సడలింపు అంశాన్ని అమెరికా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రభు చెప్పారు. -
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లోని ఖిర్కియా- హర్దా స్టేషన్ల మధ్య మంగళవారం అర్థరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో దుర్మరణం చెదిన ప్రయాణికుల కుటుంబాలు ఒక్కొక్కరికి రైల్వే శాఖ రూ.2 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ. 50 వేలు, స్వస్పంగా గాయపడినవారికి రూ.25 వేలు పరిహారాన్ని అందిస్తామని పేర్కొంది. తక్షణమే పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బుధవారం ఉదయం మీడియాకు చెప్పారు. భారీ వర్షాల కారణంగా వరదలు ఉప్పొంగి రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మంత్రి అన్నారు. ఈ ఘటనపై ఆయన ఈరోజు పార్లమెంట్ లో ప్రకటన చేయనున్నట్లు చెప్పారు. ముంబై నుంచి వారణాసి వెళుతోన్న కామయాని ఎక్స్ ప్రెస్ మాచక్ నదిపై ఉన్న వంతెనపైకి చేరుకోగానే ప్రమాదానికి గురై వెనుక భాగంలోని 10 బోగీలు నీటిలో పడిపోయాయి. అదే సమయంలో జబల్ పూర్ నుంచి ముంబై వెళుతోన్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా సమాచార లోపంతో సరిగ్గా అదే ప్రదేశంలో పట్టాలు తప్పింది. మొత్తం 16 బోగీలు నీటిలో పడి మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో 30 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించినప్పటికీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు 300 మంది ప్రయాణికులను కాపాడాయి. ఇంకా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. -
ఒక్క కిలోమీటరు.. వందకోట్లు
న్యూఢిల్లీ: ఒక్క కిలోమీటర్ మార్గానికి వంద కోట్లు ఖర్చవుతాయట. ఇది దేనికని అనుకుంటున్నారా.. అదే నండి మన దేశంలో త్వరలో రూపకల్పన చేయాలనుకుంటున్న హైస్పీడ్ రైలు మార్గానికి. ఈ లెక్కన దేశంలోని అన్ని రైలు మార్గాలను హైస్పీడ్ రైలు పరుగులకు అనుగుణంగా మార్చాలంటే మొత్తం రూ.80 వేల కోట్లు ఖర్చుకానున్నాయి. సోమవారం నాటి ప్రశ్నోత్తర కార్యక్రమంలో భాగంగా లేవనెత్తిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సాధరణ రైల్వే మార్గానికన్నా పది నుంచి 14 రెట్లు సమర్ధమంతంగా హైస్పీడ్ రైల్వే లైన్లను వేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.