breaking news
Super Specialty treatment
-
అందరికీ ఆధునిక వైద్యం!
న్యూఢిల్లీ: దేశంలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు సరైన వైద్యం అందించేందుకు ఆధునిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నేషనల్ సెంటర్ ఫర్ ఏజింగ్‌కు శంకుస్థాపనతోపాటు, సఫ్దార్‌జంగ్‌లోని 555 పడకల సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక వైద్య మౌలికవసతులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం అనవసరంగా హెచ్చించాల్సిన అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాం’ అని అన్నారు. ఎయిమ్స్‌లోని 300 పడకల పవర్‌గ్రిడ్ విశ్రామ్ సదన్‌ను, ఎయిమ్స్–అన్సారీనగర్–ట్రామా సెంటర్లను కలిపేలా వాహనాలు తిరిగే టన్నెల్‌ను మోదీ ప్రారంభించారు. 9 నెలల్లో 42 లక్షల మంది! గత 9 నెలల్లో దేశవ్యాప్తంగా 42 లక్షల మంది సీనియర్ సిటిజన్లు తమ రైల్వే రాయితీలను స్వచ్ఛందంగా వదులుకున్నారని మోదీ చెప్పారు. దేశంలో నిజాయితీగా ప్రజలు వ్యవహరించే వాతావరణం పెరుగుతోందని ప్రశంసించారు. ‘రైల్వే రాయితీ విషయంలో నేను ఎలాంటి పిలుపునివ్వలేదు. కానీ, రైల్వే శాఖ ఎవరైనా స్వచ్ఛందంగా వదులుకోవచ్చని లబ్ధిదారులకు సూచించింది. గత 8–9 నెలల్లో 42 లక్షల మంది వయోవృద్ధులైన ప్రయాణికులు స్వచ్ఛందంగా తమ రాయితీలను వదులుకున్నారు’ అని అన్నారు. నెలకోరోజు గర్భిణులకు ఉచితంగా చికిత్సనందించాలని వైద్యులను కోరానని.. ఇప్పటివరకు 1.25 కోట్ల మంది గర్భిణులు ఈ పద్ధతిలో ఉచిత చికిత్స పొందారన్నారు. 2016లో మన్‌కీ బాత్ ద్వారా ఇచ్చిన పిలుపుమేరకు.. ప్రతినెలా 9వ తేదీన ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు గర్భిణులకు వైద్యం అందిస్తున్నారన్నారు. మంత్రిత్వ శాఖల సమన్వయంతో.. ప్రతి భారతీయుడికీ తక్కువ ఖర్చుకే నాణ్యమైన వైద్యం అందించడం, రోగాలకు కారణమవుతున్న సమస్యలను అంతం చేయడం కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. వైద్య శాఖతోపాటుగా గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆయుష్ శాఖలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’లోని రెండు ప్రధాన పిల్లర్ల గురించి మోదీ వివరించారు. మొదటిది.. 1.5లక్షల సబ్–సెంటర్లను హెల్త్, వెల్నెస్ సెంటర్లుగా మార్చడం ద్వారా క్షయ, కుష్టు, మధుమేహం, రక్తపోటు, కొన్ని (రొమ్ము, నోటి, గర్భాశయ) కేన్సర్లను గుర్తించడం. రెండోది.. 10 కోట్ల పేద కుటుంబాలకు రూ.5లక్షల బీమా సదుపాయం (ఒక్కో కుటుంబానికి). మరోవైపు, ఎయిమ్స్‌లో అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా అక్కడ చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్యం గురించి మోదీ వాకబు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ శౌర్య’(ఆదీవాసీ వికాస్ విభాగ్)లో భాగంగా ఎవరెస్టును అధిరోహించిన 10 మంది గిరిజన విద్యార్థులు కలుసుకున్నారు. వచ్చేవారం మద్దతు ధర పెంపు వరి సహా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)ను ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు పెంచనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. వచ్చేవారం జరిగే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెరకుకు తగిన మద్దతుధరను వచ్చే రెండు వారాల్లో ప్రకటిస్తామని.. 2017–18 ధర కంటే ఇది మెరుగ్గానే ఉంటుందని మోదీ వెల్లడించారు. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, పంజాబ్‌ల నుంచి వచ్చిన 140 మంది చెరకు రైతులతో సమావేశం సందర్భంగా ప్రధాని ఈ హామీ ఇచ్చారు. చెరకు రైతుల సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా చక్కెర మిల్లులకు రూ.8,500 కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, పదిరోజుల్లో వివిధ రాష్ట్రాల రైతులతో మోదీ సమావేశం కావడం ఇది రెండోసారి. -
ఈ రోగానికి మందేదీ?
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్న వైద్యుల దృష్టి సంపాదనపై పడటంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవా భావం తగ్గిపోతోంది. వచ్చామా.. సంతకం పెట్టామా.. ఓ రౌండ్ వేసి వెళ్లామా.. అన్నట్లు వారి దినచర్య ఉంటోంది. సంపాదనలో వైద్యుల మధ్య పోటీ పెరగడం కూడా ఇందుకు కారణంగా కనిపిస్తోంది. వెరసి చిన్న చిన్న రోగాలకు సైతం రోగులు రోజుల తరబడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మగ్గిపోవాల్సి వస్తోంది. మరో వైపు పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత శాపంగా మారింది. రిమ్స్ లాంటి ఉన్నత శ్రేణి ఆస్పత్రిలో సైతం వివిధ విభాగాల్లో 197 మంది వైద్యుల కొరత ఉండటం గమనార్హం. కలగా మిగిలిన సూపర్ స్పెషాలిటీ వైద్యం చెన్నై, కర్నూలు, తిరుపతి, వేలూరు లాంటి నగరాలకు వెళ్లకుండా కడప గడపలోని రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందుతుందని భావించారు. ప్రజల ఆశ అలాగే ఉండిపోయింది. కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, యురాలజీ విభాగాలకు చెందిన రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఆయా విభాగాల్లో నిష్ణాతులైన వైద్యులు లేకపోవడమే ఇందుకు కారణం. భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు క్షతగాత్రులను రిమ్స్‌కు తీసుకువస్తే రెఫరల్ ఆస్పత్రిగానే దర్శనమిస్తోంది. ఇప్పటికీ ఎమ్మారై స్కానింగ్ అందుబాటులో లేదు. సీటీ స్కానింగ్ సేవలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాలు విపరీతంగా వ్యాపించినా తాము మెరుగైన వైద్యం అందిస్తాం.. అధైర్య పడొద్దనే భరోసాను రిమ్స్ యంత్రాంగం ఇవ్వలేకపోయింది. రక్త పరీక్షల రిపోర్టులు సైతం సకాలంలో అందించలేని దుస్థితి నెలకొంది. పీజీ వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు ఉన్నప్పటికీ వారికి పూర్తి స్థాయి పని కల్పించలేని స్థితిలో రిమ్స్ యంత్రాంగం కొనసాగుతోంది. పేరుకే జిల్లా ఆస్పత్రి వైద్య విధాన పరిషత్ పరిధిలో ప్రొద్దుటూరులో 350 పడకల స్థాయి జిల్లా ఆస్పత్రి ఉంది. పేరుకు మాత్రమే జిల్లా ఆస్పత్రిగా ఉందని రోగులు వాపోతున్నారు. అయితే రోగులకు ఈసీజీ, ఎక్స్‌రే కూడా తీయలేని దుస్థితిలో ఆస్పత్రి కొనసాగుతోంది. 50 ఎంఎం ఎక్స్‌రే యూనిట్ మాత్రమే పనిచేస్తుండడంతో రోగుల చెంతకే ఆ యూనిట్‌ను తీసుకెళ్లి ఎక్స్‌రేలు తీయాల్సి వస్తోంది. వైద్యుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. పదేళ్లుగా రేడియాలజీ నిపుణుడు లేడు. ఏరియా ఆస్పత్రులు సైతం అదే స్థితిలో కొనసాగుతున్నాయి. మొక్కుబడిగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఓవైపు వైద్యుల కొరత వేధిస్తుంటే.. ఉన్న వైద్యులు మధ్యాహ్నం 12 గంటలలోపే వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత వచ్చిన పేషంట్లకు అత్యవసర సేవలు అందడం లేదు. మైదుకూరు ఏరియా ఆస్పత్రిలో ఐదుగురు వైద్యులకు గాను ఒకరు మాత్రమే సోమవారం విధుల్లో ఉన్నారు. రోజూ 550 మంది రోగులు హాజరవుతున్న రాయచోటిలో ఇద్దరు డాక్టర్లు మాత్రమే దర్శనమిచ్చారు. బద్వేల్ సీమాంక్ ఆస్పత్రిలో తాగు నీరు సైతం అందుబాటులో లేదు. రోగులే ఇంటి నుంచి బాటిల్లో నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంబులెన్స్ మరమ్మతులకు నోచుకోలేదు. మార్చురీ అందుబాటులో లేకపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టుమ్ కోసం జిల్లా కేంద్రానికి తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో వసతుల లేమి రోగులను ఇక్కట్లకు గురిచేస్తోంది. చాలా ఆస్పత్రుల్లో ల్యాబ్ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ల్యాబ్‌లకు పరుగు తీస్తున్నారు. ఇక మందుల పరిస్థితీ ఆంతంతే. ముఖ్యమైన మందులు బయట తెచ్చుకోక తప్పడం లేదు.