breaking news
sunkireddy narayana reddy
-
ఆ మూడూ కలిస్తేనే కవిత్వం
సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వ సంకలనం ‘తావు’ వచ్చిన నేపథ్యంలో ఈ ఐదు ప్రశ్నలు... 1. ‘రాచకన్యల చనుదోయి మధ్య/ ముత్యాల జాలు వోల్గె...’ అని మొదలవుతుంది మీ ‘వాగు’ కవిత. ప్రబంధ లక్షణంగా కనబడే దీనికి కారణం మీరు పరిశోధించిన ప్రాచీన సాహిత్య ప్రభావమా? ఆ ప్రభావం కాదు. ఆ వాగు దృశ్యాన్నీ, ఆ వాగు సౌందర్యాన్నీ కళ్లకు కట్టించడం కోసం అలాంటి వర్ణనే సరిపోతుంది. తిలక్ ఎంచుకునే పదాలను బట్టి రా.రా. కూడా ఆయన్ని ప్రబంధ కవి అన్నారు. అది సరైన అంచనా కాదు. 2. 1994లో వచ్చిన మీ ‘తోవ ఎక్కడ’ తర్వాత, ‘దాలి’ దీర్ఘకవిత, ఇతరులతో కలిసి ‘నల్లవలస’, ‘విపశ్యన కవిత్వం’ మినహా మరే విడి కవితా సంకలనం మీరు తేలేదు. ఇంత సుదీర్ఘ విరామం ఎందుకొచ్చింది? ఒక కారణం: నేను స్లో రైటర్‌ను. సంవత్సరానికి ఒకటో రెండో కవితలు రాశానంతే. అయితే, ఇవేమీ నేను ఆపి మొదలు పెట్టినవి కాదు. మధ్యమధ్యలో రాస్తూనేవున్నా. రెండో కారణం: ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా ‘ముంగిలి’, ‘మత్తడి’ సంకలనాలు తేవడం కోసం వాటికి సమయం కేటాయించాల్సి వచ్చింది. లేకపోతే మరింత రాసివుండేవాణ్నేమో! 3. మొదటి సంకలనం నుంచి ‘తావు’ వరకు మీ కవిత్వంలో నిర్మాణపరంగా వచ్చిన మార్పేమిటి? అసలు కవిత్వం ఏమిటి మీకు? ‘తోవ ఎక్కడ’ చివర్లోనే నా కవిత్వ నిర్మాణంలో షిప్ట్ కనబడుతుంది. స్టేట్మెంట్స్, కాంట్రాస్ట్ ఎక్కువగా ఉండేవప్పుడు. ఆ తర్వాత కవిత్వాన్ని దృశ్యమానం చేయడానికి ఇమేజరీస్ శక్తిమంతమైన సాధనంగా భావించినా. ఆ మార్పు ‘తావు’లోని అన్ని కవితల్లో కనబడుతుంది. చుట్టూవున్న పరిసరాలు, సమాజం ప్రభావం వల్ల మనం ఆందోళన చెందుతాం, అలజడికి గురవుతాం, కలత పడుతాం. దుఃఖం, కోపం, ఘర్షణ... వీటన్నింటి అభివ్యక్తే కవిత్వంగా భావిస్తాను. అయితే, అభివ్యక్తే సరిపోతుందా? దానితో పాఠకుడు తాదాత్మ్యం చెందినప్పుడే అది యూనివర్సల్ అవుతుంది. మరి పాఠకుడి మనసు మొద్దుబారినప్పుడు దాన్ని కదిలించాలంటే అప్పటికి ఉన్నదానికి భిన్న రూపంలో చెప్పాలి. అంటే, మన ఉద్వేగం, అది యూనివర్సల్ కావడం, దాన్ని కొత్త పద్ధతిలో రాయడం... ఈ మూడూ కలిస్తే కవిత్వం అవుతాయి. 4. మీలోని కవిని పరిశోధకుడు మింగేస్తున్నాడా? ఆ రెండు పాత్రల్లో ఏది ఇష్టం. వాటి మధ్య ఎలా సమన్వయం కుదురుతోంది? నాకు కవిగా ఉండటమే ఇష్టం. అయితే, నాలోవున్న సామాజికుడికి తెలంగాణ ఉద్యమ అవసరాలకోసం నెరవేర్చాల్సిన బాధ్యతలు ఉండినై. (ప్ర: అంటే కవి సామాజికుడు కాదన్న ధ్వని వస్తోంది...) నా ఉద్దేశం మనలో ఒక వ్యక్తీ, ఒక సామాజికుడూ ఇద్దరూ ఉంటారు. ఇద్దరూ పరస్పర పూరకంగా, పరస్పర విరుద్ధంగా కూడా ఉండొచ్చు. వైరుధ్యంలో అనిశ్చితి వస్తుంది. ఆ అనిశ్చితి కూడా కవిత్వంలో రాగలుగుతుంది. నేననేదేమిటంటే, సామాజికుడిగా చేసే పని వేరు; కవిగా చేసే పనివేరు. సామాజికుడు చేసే పని భిన్న రూపాల్లో ఉంటుంది; అందులో కవిత్వం ఒక రూపం! 5. ‘అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవిత చిత్రణ’(1982), ‘తెలుగు కవిత్వం– తాత్త్విక నేపథ్యం’(1991)... ఈ రెండు గ్రంథాలూ మీవి ఇప్పటిదాకా అముద్రితంగా ఎందుకు ఉండిపోయినై? ఎడిట్ చేసుకొని ప్రింట్ చేయాలనేది కొంతా, ఆర్థిక భారం వల్ల కొంతా అలా ఉండిపోయినై. తర్వాత, తెలంగాణ ఉద్యమ వాతావరణంలో వాటిని యథాతథంగా అచ్చువేయడం ఇష్టం అనిపించలేదు. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించిన అంశాలతో ‘తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర నిర్మాణం’ రాస్తున్నా. కాబట్టి, ఆ పుస్తకాల్లోని తెలంగాణ అంశాలను ఇందులో వాడుకుంటాను. తావు(కవిత్వం); కవి: సుంకిరెడ్డి నారాయణరెడ్డి; పేజీలు: 112; వెల: 40; ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలు. కవి ఫోన్: 9885682572 -
గ్రూప్స్ సిలబస్‌పై ఆందోళన వద్దు
అభ్యర్థులకు సుంకిరెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: ‘సీమాంధ్రుల పాలనలో తెలంగాణ చరిత్ర పూర్తిగా మరుగున పడిపోయింది. తెలంగాణ చరిత్రను వక్రీకరించి సీమాంధ్రుల పాలనను చరిత్రలో అక్రమంగా చొప్పించారు. దాన్ని పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి ఇంతకాలం విద్యార్థులతో బలవంతంగా చదివించారు. ఇప్పుడిక ఆ అవసరం లేదు. సీమాంధ్రులు రాసిన ఆంధ్రుల చరిత్రతో తెలంగాణ అభ్యర్థులకు ఇక పన్లేదు. మన చరిత్రను మనమే మన పాఠ్యాంశాల్లో పొందుపర్చుకుని చదువుకునే సమయం వచ్చింది’ అని ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఆయన ఆదివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. ‘‘తెలంగాణ చరిత్రపై ఇప్పటికే అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఏది పడితే అది చదివి మోసపోవద్దు. ఒకరు చేసిన తప్పలను మిగతా వారు అనుసరించడం వల్ల వాటిలో అనేక తప్పులు దొర్లాయి. దీనిపై మేం పలువురు తెలంగాణ నిపుణులతో చర్చించాం. శాసనాలు, గ్రంథాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాం. వాస్తవాలను ప్రామాణికంగా తీసుకుని ‘తెలంగాణ చరిత్ర-క్రీస్తుపూర్వం నుంచి 1948 వరకు’ పుస్తకాన్ని ముద్రించాం. ఇది గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ చుట్టూ విస్తరించి ఉన్న సామ్రాజ్యాలు, సామంత రాజులు తదితరాలను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణ చరిత్రనే తెలంగాణ అభ్యర్థులు ప్రమాణికంగా తీసుకోవాలి. ప్రశ్నలు జవాబుల కోణంలో కాకుండా తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. చరిత్ర పట్ల ఆసక్తి, మమకారముంటేనే ఇది సాధ్యం. పేపర్లను దిద్దేదీ తెలంగాణ నిపుణులే. కాబట్టి తెలంగాణ చారిత్రక నేపథ్యంపై పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు నిర్భయంగా జవాబు రాయవచ్చు’’ అని వివరించారు.