breaking news
Subrataray
-
సహారా చీఫ్ కు నాలుగు వారాల పెరోల్
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనే వెసులుబాటు న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్ తల్లి ఛహాబీ రాయ్ (95) శుక్రవారం ఉదయం లక్నోలో మృతిచెందారు. తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ... సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆయనకు నాలుగువారాల పెరోల్ మంజూరు చేసింది. మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా గ్రూప్ సంస్థలు రెండు రూ.25,000 కోట్లు వసూలు చేయడం... వడ్డీతో సహా ఈ మొత్తం రూ.35,000 కోట్లు దాటిన వైనం, తిరిగి చెల్లించడంలో వైఫల్యం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన 2014 మార్చి 4 నుంచీ తీహార్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్‌కు రూ.10,000 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల అమల్లో సహారా విఫలమవుతోంది. ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమకూర్చుకోవడంలో వైఫల్యం అవుతుండడంతో ఇటీవలే ఈ బాధ్యతలనూ సుప్రీంకోర్టు సెబీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో తల్లి తుదిశ్వాస విడవడంతో, ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీలుకల్పిస్తూ... రాయ్‌కి పెరోల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాయ్ న్యాయవాది కపిల్ సిబల్ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఆర్ దావే, జస్టిస్ ఏకే శిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను ఆమోదించింది. రాయ్‌తోపాటు జైలులో ఉన్న సహారా డెరైక్టర్ అశోక్ రాయ్ చౌదరికి కూడా సుప్రీం పెరోల్ మంజూరు చేసింది. కాగా ఈ నాలుగువారాలూ రాయ్ పోలీస్ ప్రొటెక్టివ్ కస్డడీలో ఉంటారని పెరోల్ మంజూరు సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. అంతక్రితం పారిపోవడానికి తన క్లెయింట్ ప్రయత్నం చేయడంటూ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. -
సుబ్రతా నిర్బంధం సబబే..
* సుప్రీంకోర్టు స్పష్టీకరణ * అన్యాయమంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత * బెయిల్ కోసం రూ. 10,000 కోట్ల * చెల్లింపునకు కొత్త ప్రతిపాదనతో రావాలని సూచన న్యూఢిల్లీ: మదుపుదారులకు రూ.24,000 కోట్ల పునఃచెల్లింపుల కేసులో సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్‌కి నిరాశే మిగిలింది. ఈ విషయంలో ఆయన జ్యుడీషియల్ కస్టడీ సరైనదేనని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. రాయ్, మరో రెండు గ్రూప్ కంపెనీల డెరైక్టర్ల కస్టడీ అన్యాయమని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని, ఈ విషయంలో సహజన్యాయ సూత్రాలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కేఎస్ రాధాకృష్ణన్, జేఎస్ కేహార్‌లతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్టం ప్రకారమే ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపడం జరిగిందని 207 పేజీల ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. మార్చి 4వ తేదీ నుంచీ తీహార్ జైలులో ఉన్న రాయ్, ఇరువురు డెరైక్టర్ల బెయిల్‌కు తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని కూడా సహారా గ్రూప్‌కు సుప్రీంకోర్టు సూచించింది. తద్వారా బెయిల్ విషయంలో ఏప్రిల్ 21న గ్రూప్ దాఖలు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. రాయ్‌ని విడుదల చేసిన మూడు పనిదినాల్లో రూ.3,000 కోట్లను చెల్లిస్తామని, మరో రూ.2,000 కోట్లను మే 30లోపు చెల్లించడం జరుగుతుందని గ్రూప్ అప్పట్లో ప్రతిపాదన దాఖలు చేసింది. ఇక బ్యాంక్ గ్యారెంటీగా రూ.5,000 కోట్లను చెల్లించడానికి సంస్థ జూన్ 30 వరకూ సమయం కోరింది. ఘాటైన పదజాలం... మదుపుదారుల నుంచి రెండు గ్రూప్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా డబ్బు వసూలు చేయడం, వాటిని తిరిగి చెల్లించమని జారీ అయిన ఆదేశాల విషయంలో శాట్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు అన్నింటినీ సహారా గ్రూప్, రాయ్‌లు పట్టించుకోలేదని పేర్కొంది. గ్రూప్ అనుసరించిన వైఖరిని ధర్మాసనం సహించబోదని ఉద్ఘాటించింది. తనను అరెస్ట్ చేయడం అన్యాయమంటూ దాఖలైన పిటిషన్లో ఎటువంటి ‘మెరిట్’ లేదని స్పష్టం చేసింది. మదుపరుల నిధుల పునః చెల్లింపునకు సంబంధించి జారీ చేసిన ఆదేశాల అమలుకు న్యాయస్థానానికి తగిన అన్ని అవకాశాలూ ఉంటాయని సైతం స్పష్టం చేసింది. మదుపరులకు మెజారిటీ భాగం పునఃచెల్లింపులు జరిగిపోయాయని చెబుతున్న సహారా గ్రూప్, ఈ విషయంలో సరైన సాక్ష్యాలను మాత్రం చూపడంలేదని తెలిపింది. కోర్టులను ప్రభావితం చేసే రీతిలో సహారా గ్రూప్ ‘మైండ్ గేమ్’ ఆడుతోందని, ఇలాంటి వాటిని కోర్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోవని పేర్కొంటూ ఏప్రిల్ 21న రిజర్వ్ చేసుకున్న తన ఉత్తర్వుల్లో బెంచ్ పేర్కొంది. సహారా తరహా కేసుల విషయంలో ఎటువంటి ఒత్తిడులకు లొంగని రీతిలో కోర్టులు పనిచేయాలని సూచించింది.