breaking news
Srikanth movie
-
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
‘‘పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్ బొల్లా తన లోపాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారు? అనేది ‘శ్రీకాంత్’ సినిమా కథ. కళ్లు లేకుండా జీవితాన్ని గెలవడమన్నది చాలా పెద్ద విషయం. అందుకే శ్రీకాంత్‌లాంటి గొప్ప వ్యక్తి కథతో రూపొందిన ‘శ్రీకాంత్’ మూవీలో నటించడం గౌరవంగా ఉంది’’ అని నటి జ్యోతిక అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన శ్రీకాంత్ బొల్లా (అంధ పారిశ్రామికవేత్త) బయోపిక్‌గా రూపొందిన హిందీ చిత్రం ‘శ్రీకాంత్’. శ్రీకాంత్ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటించారు.తుషార్ హీరానందని దర్శకత్వం వహించారు. టీ సిరీస్, ఛాక్ అండ్ ఛీస్ ఫిల్మ్ప్రోడక్షన్స్పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, నిధి పర్మార్ హీరానందని నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన జ్యోతిక హైదరాబాద్‌లో మాట్లాడుతూ– ‘‘తుషార్గారు ‘శ్రీకాంత్’ కథ చెప్పినప్పుడు షాక్‌కి గురయ్యాను. శ్రీకాంత్ బొల్లాలాంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా? అనిపించింది. పూర్తి కథ వినగానే కచ్చితంగా ఈ మూవీలో భాగమవ్వాలని వెంటనే ఒప్పుకున్నాను. శ్రీకాంత్‌గారి పాత్రలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతం. ఈ మూవీలో టీచర్ పాత్ర చేశాను. నేను ఉపాధ్యాయురాలిగా నటించిన మూడో చిత్రం ఇది (నవ్వుతూ). శ్రీకాంత్‌ని ప్రభావితం చేసే గొప్ప పాత్ర చేశాను. నా భర్త (హీరో సూర్య) తన సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నేను తెలుగులో నటించి చాలా రోజులైంది. మంచి పాత్ర కుదిరితే నటిస్తాను’’ అన్నారు. -
రోల్.. కెమెరా.. యాక్షన్
ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ జీపు వచ్చి ఆగింది.. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. విషయం ఏంటంటే సీఐ మారిపోయారు. ఉడతా బంగార్రాజుకు బదులు సినీ హీరో శ్రీకాంత్ చురకత్తులవంటి చూపులతో జీపులో నుంచి దిగి స్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. స్టేషన్‌లోనికి వెళుతూ సైడ్ లుక్కేసి వినాయకుడి విగ్రహం వద్ద ఆగారు. గుంజీళ్లు తీసి గణపతికి సెల్యూట్ చేసి లోనికి వెళ్లారు. ఇదేంటి సినిమా స్రిప్ట్లాగా ఉంది అనుకుంటున్నారా. అవునండీ హీరో శ్రీకాంత్ సినిమా షూటింగ్ శనివారం ఏలూరులో ప్రారంభమైంది. హీరో శ్రీకాంత్ సీఐ వేషధారణలో స్టేషన్లోకి ప్రవేశించే సన్నివేశాలను చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ అభిమానులు ఆయన్ను చూసేందుకు స్టేషన్ వద్ద గుమిగూడారు. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కనున్న నూతన చిత్రం షూటింగ్ శనివారం స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో జరిగింది. పేరు ఖరారుకాని ఈ సినిమాకు రైటర్ కమ్ డెరైక్టర్‌గా కె.శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ కథానాయిక కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. చిత్ర విజయానికి హీరో పెర్ఫార్మెన్, దర్శకత్వమే ప్రధాన కారణాలు అవుతున్నాయని అన్నారు. ఈ దిశగా తమ యూనిట్ శ్రమిస్తోందన్నారు. నాలుగు రోజులపాటు ఏలూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. కొన్ని సన్నివేశాలను విజయవాడలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా.. చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాని హీరో శ్రీకాంత్ అన్నారు. రచయితగా పనిచేసిన శ్రీనివాస్ దర్శకత్వంలో ఆండాళ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సినిమా తెరకెక్కుతోందని చెప్పారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ప్రేక్షకులను అలరించనుందన్నారు. ఏలూరు విజయవాడ పరిసర ప్రాంతాలలో మరో 15 రోజులపాటు షూటింగ్ జరుగుతుందని చెప్పారు. ఎక్కువుగా పోలీస్ పాత్రల్లోనే కనిపిస్తున్నారేంటని విలేకరులు అడగ్గా శ్రీకాంత్ నవ్వుతూ పవర్‌ఫుల్‌గా ఉంటాయనే ఇటువంటి పాత్రలను ఎంచుకుంటున్నానన్నారు. సీఐ బంగార్రాజు నా ఆప్తమిత్రుడు ఏలూరు టూటౌన్ సీఐ బంగార్రాజు తన ఆప్తమిత్రుడని శ్రీకాంత్ అన్నారు. 15 ఏళ్లుగా బంగార్రాజుతో సాన్నిహిత్యం ఉందన్నారు. షూటింగ్ కోసం అనుమతి కోరగా ఎటువంటి ఆంక్షలు లేకుండా డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు సహకరించారని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నట్టు శ్రీకాంత్ తెలిపారు. షూటింగ్ జరుగుతున్నంత సేపు తమకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డీఎస్పీ కేజీవీ సరిత పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది సహకరించారని చెప్పారు. సీఐ బంగార్రాజు ఈ చిత్రంలో ఓ పాత్ర చేయనున్నారని సీఐ చెప్పారు. ఢీ అంటే ఢీ, నాటుకోడి, అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో మరో సినిమా లో నటిస్తున్నట్టు శ్రీకాంత్ చెప్పారు.