breaking news
sports management
-
క్రీడా రంగంలో అద్భుతమైన కెరీర్.. ముఖ్యమైన సమాచారం మీకోసం
ప్రపంచ క్రీడా వేదిక టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపుతున్నారు. అంతర్జాతీయంగా పలు అంశాల్లో ముందు వరుసలో నిలుస్తున్నారు. అయినప్పటికీ నేటికీ చాలామంది తల్లిదండ్రులు ఆటలతో కెరీర్ కష్టమనుకుంటారు. అందుకే పిల్లలను ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి కోర్సుల వైపు పోత్సహించినట్టుగా.. క్రీడల వైపు ప్రోత్సహించడం లేదు. వాస్తవానికి ప్రతిభ ఉంటే.. స్పోర్ట్స్ రంగంలోనూ అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకునే అవకాశం ఉంది. దేశంలో స్పోర్ట్స్ కోర్సులను అందించేందుకు ప్రత్యేకంగా ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(ఇంపాల్)’ని∙ఏర్పాటు చేశారు. దీంతోపాటు మరెన్నో పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్, స్పోర్ట్స్ కాలేజీలు పలు కోర్సులు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో స్పోర్ట్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం... మన యువత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ.. క్రీడలను కూడా కెరీర్‌గా మలచుకోవచ్చని నిరూపిస్తోంది. పలువురు స్పోర్ట్స్‌తో పేరు ప్రఖ్యాతులతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు సైతం సొంతం చేసుకుంటున్నారు. దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. క్రికెట్ ఒక్కటే కాదు.. హాకీ, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, జిమ్నాస్టిక్స్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, సైక్లింగ్, చెస్, అథ్లెటిక్స్, కబడ్డీ వంటి క్రీడలపైనా ఆసక్తి ఎక్కువే. ఆయా క్రీడాకారులకు అంతర్జాతీయంగా అద్భుతమైన గుర్తింపు లభిస్తోంది. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, కోహ్లీ, సానియా మీర్జా, పీవీ సింధు, అభినవ్ బింద్రా, సుశీల్ కుమార్, విశ్వనాథ్ ఆనంద్, మేరీకోమ్ వంటి వారే అందుకు నిదర్శనం. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు క్రీడాకారుడిగా రాణించాలంటే.. ఎంచుకున్న క్రీడలో ప్రతిభతోపాటు బలమైన సంకల్పం, పట్టుదల చాలా అవసరం. ⇔ ఒక వయసు దాటాక స్పోర్ట్స్ కెరీర్ ముగిసినట్టే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. క్రీడాకారుడిగా కెరీర్ ముగిసిన తర్వాత కూడా అద్భుతమై రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోచింగ్, అథ్లెటిక్ అడ్మినిస్ట్రేషన్, స్పోర్ట్స్ మెడిసిన్, స్పోర్ట్స్ ప్రమోషన్, స్పోర్ట్స్ సెకాలజీ, స్పోర్ట్స్ మార్కెటింగ్ వంటి అనుబంధ రంగాల్లో ప్రవేశించవచ్చు. ⇔ స్పోర్ట్స్ ప్లేయర్, స్పోర్ట్స్ టీచర్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్, స్పోర్ట్స్ జర్నలిస్ట్, స్పోర్ట్స్ కోచ్ అండ్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ఫొటోగ్రాఫర్, పర్సనల్ ట్రైనర్, ప్రొఫెషనల్ అథ్లెట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, హెల్త్ అడ్వైజ్ ఆఫీసర్ వంటి విభాగాల్లో రాణించవచ్చు. ⇔ స్కూల్ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపినవారికి ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలోని వివిధ స్పోర్ట్స్ సంస్థలు, అకాడమీలు శిక్షణనిస్తున్నాయి. చురుకైన యువతకు చక్కటి శిక్షణ ఇచ్చి.. ప్రతిభావంతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకూ క్రీడలకు సంబంధించి డిప్లొమా నుంచి పీహెచ్డీ వరకు పలు స్థాయిల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా » బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్ » బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్) » ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు) » ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు) » ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ, ఎంఎస్సీ/ఎంఫీల్/పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ తదితర కోర్సుల్లో చేరే అవకాశముంది. ప్రవేశం–అర్హతలు స్పోర్ట్స్ కోర్సుల్లో ప్రవేశానికి పలు అర్హతలు నిర్దేశించారు. ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, సంపూర్ణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సుల్లో చేరవచ్చు. యూజీ కోర్సులు పూర్తిచేసినవారు పీజీ కోర్సులకు వెళ్లవచ్చు. ఎంబీబీఎస్ తర్వాత స్పోర్ట్స్ మెడిసిన్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా చేయవచ్చు. అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ,టెస్టులు, క్రీడా ప్రతిభ ఆధారంగా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. పలు స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లు ⇔ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఇంపాల్); ⇔ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(పటియాలా); ⇔ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్స్ (న్యూఢిల్లీ); ⇔లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (గ్వాలియర్); ⇔లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (తిరువనంతపురం); ⇔టాటా ఫుట్‌బాల్ అకాడమీ (జంషెడ్పూర్); ⇔ నేషనల్ క్రికెట్ అకాడమీ (బెంగళూరు); ⇔ ఢిల్లీ యూనివర్సిటీ. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో ఏర్పాటు చేసిన ‘నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ’ పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రంలోని యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ/పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు కోరుతోంది. ► బీఎస్సీ–స్పోర్ట్స్ కోచింగ్: నాలుగేళ్ల కాలపరిమితి గల బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ కోర్సులో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, షూటింగ్, స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఇంటర్మీడియెట్/తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 50 శాతం, అభ్యర్థి క్రీడా ప్రతిభకు మరో 50 శాతం మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్(బీపీఈఎస్): బీపీఈఎస్ కోర్సు కాలపరిమితి మూడేళ్లు. ఇంటర్మీడియెట్(10+2)లేదా తత్సమాన ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌లో 70 శాతం, క్రీడల్లో చూపిన ప్రతిభకు 30 శాతం వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్(రెండేళ్లు): బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్/గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, బీపీఈఎస్ విత్ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్/ బీపీఈడీ లేదా తత్సమాన కోర్సుల్లో 50 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 100 మార్కులు, క్రీడా ప్రతిభకు 30 మార్కులు, వైవాకు 20 మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ► ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ(రెండేళ్లు): ఈ కోర్సులో ప్రవేశానికి అభ్యర్థి బీపీఈఎస్/ బీపీఈడీ/బీఏ(హానర్స్), బీఏ సైకాలజీ/స్పోర్ట్స్ సైకాలజీలో 50 మార్కులు తప్పనిసరి. ఇంటర్నెట్ బేస్డ్ ప్రోక్టర్డ్ టెస్ట్‌కు 100 మార్కులు, వైవాకు 30 మార్కులు, క్రీడా ప్రతిభకు 20 మార్కుల వెయిటేజీ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ముఖ్య సమాచారం ► ఎన్ఎస్యూ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17 ఆగస్టు 2021 ► ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్: 10 సెప్టెంబర్ 2021 ► ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ ప్రొఫిషియన్సీ టెస్ట్: సెప్టెంబర్ 22–24 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nsu.ac.in స్సోర్ట్స్ సైకాలజీకి క్రేజ్ క్రీడాకారుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు స్పోర్ట్స్ సైకాలజిస్టుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో సుశిక్షుతులైన స్పోర్ట్స్ సైకాలజిస్టులు కొరత నెలకొంది. దాంతో మన దేశ క్రీడా సంఘాలు అమెరికా,ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ సైకాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని యూనివర్సిటీలు ఎంఏ,ఎంఎస్సీ సైకాలజీ కోర్సులు అందిస్తున్నా.. స్పోర్ట్స్ సైకాలజీ కోర్సు మాత్రం చాలా తక్కువ యూనివర్సిటీల్లో ఉంది.వాటిలో చెప్పుకోదగ్గవి.. ►గురునానక్‌దేవ్ యూనివర్సిటీ(అమృత్సర్): ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ, ఎంపీటీ స్పోర్ట్స్ సైకోథెరఫీ. ►తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ(చెన్నై): ఎంఎస్సీ/ ఎంఫిల్/ పీహెచ్డీ స్పోర్ట్స్ సైకాలజీ. ► రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ: ఎంఏ/ఎంఎస్సీ స్పోర్ట్స్ సైకాలజీ. ►లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(గ్వాలియర్):ఎంఏ స్పోర్ట్స్ సైకాలజీ. -
‘పైకా’కు పైసల్లేవ్
- ప్రయాణ ఖర్చుల కోసం విద్యార్థుల పాట్లు - మండలానికి కేవలం రూ.1000 చొప్పున కేటాయింపు - ఆటలకు క్రీడాకారులు దూరం - నిర్వహణ భారం పీఈటీల పైనే కైకలూరు : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ‘పైకా’ (ప్రస్తుతం రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ (ఆర్జీకేఏ)గా పేరు మార్చారు) క్రీడల నిర్వహణకు పైసలు కరువయ్యాయి. అధికారులు, పాలకులకు ముందుచూపు కొరవడటంతో గ్రామ స్థాయిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు కనుమరుగవుతున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 2008 ఏప్రిల్ ఒకటిన దేశంలో యువ క్రీడా ఔర్ ఖేల్ అభియాన్ (పైకా)ను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 16 సంవత్సరాలోపు క్రీడాకారుల ప్రతిభను గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశం. కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. గ్రామ స్థాయిలో బ్లాక్, జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ స్థాయి వరకు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించుకునే అవకాశం ఇందులో ఉంది. గ్రామీణ స్థాయిలో విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వడానికి ‘క్రీడాశ్రీ’లను నియమించారు. కేంద్రంలో నూతన ప్రభుత్వం రావడంతో పథకం పేరు మార్చారు. ఈ ఏడాది గ్రామీణ స్థాయిలో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటిన్, అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్, డిస్క్‌త్రో, హైజంప్, లాంగ్‌జంప్, 4+100, 1500, 800, 400, 300, 100 మీటర్ల పరుగుపందేలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో జిల్లాలో ఈ నెల 5న గ్రామ స్థాయిలో, 6న మండల, 8న నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించారు. ఇక్కడ ఎన్నికైన వారికి జిల్లా స్థాయిలో ఈ నెల 9, 11, 12, 13, 15 తేదీల్లో విజయవాడలో ఏర్పాటు చేశారు. నిధుల కొరతతో క్రీడాకారులు, పీఈటీలు జిల్లా స్థాయి పోటీలకు రావడానికి అవస్థలు పడుతున్నారు. మండలానికి రూ.1000తో సరి... జిల్లాలోని ఆర్జీకేఏ క్రీడల నిర్వహణ నిమిత్తం ఒక్కో మండలానికి కేవలం రూ.1000 కేటాయించి క్రీడా అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఆయా మండలాల్లో ఎంపికైన క్రీడాకారులు నియోజకవర్గంలో జరిగే క్రీడలకు హాజరుకావాలి. అంటే జిల్లాలోని 16 నియోజకవర్గాల పరిధిలోని 34 మండలాల క్రీడాకారులు నియోజకవర్గ పోటీలకు కచ్చితంగా రావాలి. ఈవెంట్లను బట్టి ఒక్కో మండలం నుంచి సుమారు 80 నుంచి 90 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదాహరణకు కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం నుంచి కైకలూరు పోటీలకు రావాలంటే ఒక్కొక్కరు బస్సుకు రూ.12, ఆటోకు రూ.15 చెల్లించాలి. దీనికి తోడు భోజనం ఖర్చు ఉంటుంది. ఖర్చులు ఇలావుంటే మండలానికి కేటాయించిన రూ.1000 ఏవిధంగా సరిపోతాయని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఒక్కొక్కరు మూడు దరఖాస్తులు, మూడు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు అందజేయాలి. వీటికోసం కనీసం రూ.50 ఖర్చవుతుంది. ఇక జిల్లా స్థాయి పోటీలను విజయవాడలో ఏర్పాటు చేశారు. జిల్లా శివారు ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకోవాలంటే కనీసం రూ.100 చార్జీలు అవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో చేసేది లేక ఆయా పీఈటీలు అప్పులు చేసి మరీ విద్యార్థులను పోటీలకు తీసుకువె ళుతున్నారు. క్రీడాకారులు ఫుల్.. సౌకర్యాలు నిల్... జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండటం లేదు. గత ప్రభుత్వ హయాంలో పైకా పథకంలో ప్రతి గ్రామానికి రూ.లక్ష, బ్లాక్ పంచాయతీలకు రూ.5 లక్షలు, ఏడాదికి క్రీడా పరికరాల నిమిత్తం రూ.10 వేలు నుంచి రూ.20 వేలు, మెయింటెనెన్స్‌కు రూ.12 వేల నుంచి రూ.24 వేల వరకు అందిస్తామని అన్నారు. వాటి ని మొదటి ఫేజ్‌లో కొన్నింటికి అందించారు. గ్రామాల్లో క్రీడా స్థలాల సేకరణకు వచ్చిన నిధులు కొందరు ఎంపీడీవోలు శ్రద్ధ చూపని కారణంగా వెనక్కి మళ్లాయి. రెండేళ్లుగా క్రీడాశ్రీలకు నెలకు రూ.500, పీడీలకు రూ.1000 గౌరవవేతనం రాలేదు. హైజంప్ చేయడానికి పరికరాలు లేకపోవడంతో అనేక మంది పోటీలు నిర్వహించకుండానే పేర్లు రాసుకున్నారు. ఇప్పటికైనా నూతన ప్రభుత్వాలు గ్రామీణ స్థాయిలో క్రీడలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. -
క్రీడాంశాలను మేనిఫెస్టోలో పెట్టాలి
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : రాజకీయ పార్టీలు క్రీడాంశాలను తప్పనిసరిగా మేనిఫెస్టోలో పెట్టాలని జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కనపర్తి రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని ఏఎంసీ మైదానంలో అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. వీటికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడల నిర్వహణకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామన్నారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులు క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. క్రీడలను, క్రీడాకారులను నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల్లో ‘నోటా’ ఓట్లు వేసి నిరసన తెలుపుతామన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో దీర్ఘకాలం నుంచి పీఈటీల నియామకాలు జరగడం లేదన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ రెవెన్యూ డివిజన్లో తప్పనిసరిగా స్పోర్ట్స్ పాఠశాల ఏర్పాటు చేసి, క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. రెజ్లింగ్ పోటీలు ప్రారంభం అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాలబాలికల ఎంపిక పోటీలను శాంతిఖని గని మేనేజర్ బుచ్చయ్య ప్రారంభించారు. వివిధ ప్రాంతాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో అమేచర్ రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.