నిమజ్జనం కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లు
♦ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
♦ హుస్సేన్ సాగర్‌ను ఎందుకు శుద్ది చేయడం లేదు
♦ పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
సాక్షి, హైదరాబాద్: వినాయక విగ్రహాల నిమజ్జనం నిమిత్తం ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేయాల్సిందేనని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. విగ్రహాల ఎత్తు తగ్గింపు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకంపై నిషేధం విధించే విషయాలను పరిశీలించాలని పేర్కొంది.
ఈ మొత్తం వ్యవహారంలో తీసుకున్న చర్యలను తదుపరి విచారణ నాటికి వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌తోపాటు ఇతర చెరువులు, నీటి కుంటలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదని, దీనిని కోర్టు ధిక్కారంగా పరిగణించాలంటూ న్యాయవాది ఎం.వేణుమాధవ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది.