breaking news
Sobhanayudu
-
నాట్యకారిణి శోభా నాయుడు కన్నుమూత
-
శోభా నాయుడు కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభా నాయుడు 12 ఏళ్ల వయసులోనే కూచిపూడిలో అరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరిన ఆమె వెంపటి నృత్య రూపాలలో అన్ని పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించిన శోభా నాయుడు 2001లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం శోభా నాయుడు మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శోభా నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
నాడిది రెండో ఊటీ
ఆమె సిరిసిరి మువ్వల సరిసరి అడుగులు నెమలికి నడ కలు నేర్పిస్తాయి. గమకాల నాదవినోదానికి తన నాట్యవిలాసంతో గమనం జత చేసింది. కూచిపూడికి కాణాచిగా వెలుగొందుతున్న నర్తకి శోభానాయుడు. ఖండాంతరాల్లో వెల్లువెత్తిన ఆ నాట్య తరంగాలు.. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉత్తుంగ గంగా తరంగాల్లా ఉప్పొంగుతాయని చెబుతారామె. సిటీకి తరలి వచ్చాక ఆ అపూర్వ అభినయం నర్తనశాలగా మారి మరెందరినో కూచిపూడి కొమ్మలుగా తీర్చిదిద్దుతోంది. 33 ఏళ్ల కిందట భాగ్యనగరంలో అడుగిడిన ఆ అందెలు.. తాళం తప్పని అప్పటి పట్నం పోకడను ఇప్పటికీ గొప్పగా చెబుతుంటాయి. అద్వితీయ బంధంగా మారిన హైదరాబాద్ తనకు రెండో ఊటీగా తోచేదని చెబుతున్న శోభానాయుడు సిటీతో తనకున్న అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ..:: హనుమా ఆ రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మద్రాసు నుంచి హైదరాబాద్‌కు రైల్లో వచ్చేవాళ్లం. ఎప్పుడు వస్తుందా అని కిటికీ దగ్గర కూర్చుని ఎదురు చూస్తుండేవాళ్లం. నగరం సమీపిస్తుంటే... చల్లని గాలులు వీస్తూ... చినుకులు పడుతూ... పచ్చని చెట్లు కనిపిస్తుంటే... ఆహా... అసలా ఫీలింగే వేరు. మేం ‘సెకండ్ ఊటీ’ అనేవాళ్లం. అంతటి ఆహ్లాదం... చల్లదనం. ఇప్పుడు ఆ హాయి పోయి, వాహనాలు, అపార్ట్మెంట్లు పెరిగి, చెట్లు తగ్గిపోయి కాలుష్యం విరజిమ్ముతోంది. అంతకముందు చాలాసార్లే వచ్చివెళ్లినా... మద్రాసును వదిలి పూర్తిగా నగరానికి మారింది మాత్రం 1981లో. అప్పట్లో ఇక్కడ నాట్య అకాడమీ నెలకొల్పాలనేది నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆకాంక్ష. ఆయన కోరిక... మా గురువుగారి ప్రోద్బలంతో పాటు... ఆంధ్రుల ఆడపడుచును కనుక... మన ఇంట పుట్టిన కూచిపూడిని అందరికీ పంచాలని హైదరాబాద్ వచ్చా. అప్పుడప్పుడే మద్రాస్‌లో పేరు తెచ్చుకుంటున్నా. అంతవరకు ఒక బాధ్యతారహిత జీవితం గడిపా. ఇక్కడకు వచ్చాక బాధ్యత పెరిగింది. అకాడమీ స్థాపించి నడిపించడమంటే... ఎంత కష్టమో అర్థమైంది. బెత్తం పట్టుకుని పాఠాలు నేర్పడం... పాలనా వ్యవహారాలు చూసుకోవడం... అష్టావధానంలా అనిపించేది. తొలుత ఇన్స్టిట్యూట్ హిమాయత్‌నగర్ టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా అద్దె ఇంట్లో ఉండేది. అక్కడి నుంచి నారాయణగూడ వెంకటేష్ థియేటర్ ఎదురుకు మారాం. ప్రస్తుతం దోమల్‌గూడలో ఉన్నది పర్మినెంట్ బిల్డింగ్. కేంద్ర ప్రభుత్వ నిధులతో సమకూర్చుకున్నాం. అది దేవాలయం... హైదరాబాద్ వస్తున్నామంటే కళ్లలో మెదిలేది రవీంద్రభారతే. మాకది లండన్ క్వీన్సా నగరంలా. అందులో నాట్యమాడుతుంటే... సాక్షాత్తూ ఆ రవీంద్రుడి ముందు ఆడుతున్నట్టే అనుభూతి. నాకది దేవాలయం. అలాగే మా అకాడమీ, త్యాగరాయ గానసభ... నగరంలో బాగా ఇష్టమైన ప్రాంతాలివే. ఇక చిన్నప్పుడు ఇక్కడకు వచ్చినప్పుడల్లా సాలార్జంగ్ మ్యూజియంకు వెళ్లేవాళ్లం. పబ్లిక్ గార్డెన్లో షూటింగ్‌లు బాగా జరిగేవి. నాడు వాటర్ ట్యాంకర్లంటే తెలీదు. మారనిదల్లా... నాంపల్లి ఎగ్జిబిషన్. అప్పటిలానే కొనసాగుతోంది. క్లాసికల్ డ్యాన్స్, సంగీతం కోసమే సభలుండేవి. మాలాంటి వారికి అవే ప్రోత్సాహం. నేడవి కనిపించడం లేదు. ప్రభుత్వం తరపు నుంచి కళాకారులకు నామమాత్రపు ప్రోత్సాహం, సహకారం కూడా అందడం లేదు. ఎమ్మెల్యే పెసరట్టు... అప్పట్లో అసెంబ్లీ పక్కన ఓ హోటల్లో ఎమ్మెల్యే పెసరట్టు బాగా ఫేమస్. ఇప్పుడు దాని ప్లేస్‌లో చిరంజీవి దోశలొచ్చేశాయి (చమత్కారం). ఇక డబుల్ డక్కర్ బస్సు ఎక్కి కూర్చుని... ట్యాంక్‌బండ్ మీద నుంచి వెళుతూ... హుస్సేన్‌సాగర్ అందాలను చూస్తుంటే... అబ్బో... అద్భుతం. చార్మినార్ ఎక్కి చూడటమంటే మాలాంటి వారందరికీ పెద్ద కోరిక. కోఠి, అబిడ్స్, చార్మినార్... నాడు షాపింగ్ ప్లేసెస్ ఇవే. ఇప్పుడు ఏ ప్రాంతానికా ప్రాంతం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌తో బడా సెంటర్లుగా మారిపోయాయి. ఫ్లైఓవర్లంటే తెలీదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే. తగ్గుతున్న విలువలు ఐటీ, వెడల్పాటి రోడ్లు, ఫ్లైఓవర్లు, బడా భవంతులు... ఒక్కోసారి భాగ్యనగరమా లేదంటే అమెరికాలో ఉన్నామా అన్న ఫీలింగ్ కలుగుతోంది. మార్పు కొంత వరకు బానే ఉంది. కానీ బిజీ లైఫ్, వెస్ట్రన్ కల్చర్ మోజులో మమతలు, మమకారాలు పోయి, బాంధవ్యాలు తెగిపోతున్నాయి. చిన్న వయసులో చైల్డ్‌కేర్ సెంటర్లు, విద్యార్థి దశలో హాస్టళ్లు, ఉద్యోగ వేటలో విదేశాలు, వయసుకో చోట మకాం. ఫలితం, దూరాలు పెరిగి, విలువలు తగ్గి, కుటుంబ వ్యవస్థ పతనమైపోతోంది. ఏ వివాహ బంధానికైతే మన దేశం పేరో... ఆ బంధాలు నేడు కార్పొరేట్ కల్చర్‌లో మునిగితేలుతున్న సిటీలో మాయమవుతున్నాయి. మా బంధం అపురూపం... మాది రాజమండ్రి. సంప్రదాయ కుటుంబం. నాన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీరు. మా ఇంటా వంటా డ్యాన్స్ లేదు. నాకేమో అదంటే ప్రాణం. చెన్నైలో ఉండగా సినిమా ఆఫర్లు వచ్చినా... నాట్యం కోసమే వాటిని వదులుకున్నా. అక్కినేని నాగేశ్వరరావు చాలాసార్లు అనేవారు... ‘నేను ఓ మంచి హీరోయిన్ను మిస్సయ్యా’ అని. ఇక నాకు నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య బంధం విలువలతో పెనవేసుకున్నది. చంద్రిక (సెయింట్‌ఆన్స్‌లో కౌన్సెలర్), శారదా శ్రీనివాసన్ (మాజీ రేడియో అనౌన్సర్), జానకి, సత్యశ్రీ (గృహిణులు), మేము రెగ్యులర్‌గా మీటవుతుంటాం. కార్తీకమాసం వనభోజనాలు, కీసర, బాసర వంటి టెంపుల్ టూర్స్, లేదంటే మాలో ఒకరి ఇంట్లో మీటవుతాం. ఒక్కోరు ఒక్కో కూర తెచ్చి సరదాల విందుతో జ్ఞాపకాలు నెమరేసుకొంటాం. వేణువై వచ్చారు.. వెదురులోకి ఒదిగిన కుదురులేని గాలి.. హుస్సేన్‌సాగర్ అలల తరంగాలను తాకుతూ గానకేళిగా పల్లవించింది. వేణువై వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మలయమారుతాల్లా ప్రతిధ్వనించారు. ట్రిబ్యూట్ టు పండిట్ హరిప్రసాద్ చౌరాసియా పేరిట ట్యాంక్‌బండ్ మెయిన్ రోడ్‌లోని సెయిలింగ్ అనెక్స్‌లో ఆదివారం జరిగిన సుస్మిత, దేవప్రియ చటర్జీ సిస్టర్స్ వేణుగానం ఆహూతులను మంత్రముగ్ధులను చేసింది.