breaking news
Smart Work Geo-tagging
-
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, పుట్టపర్తి: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నారు. త్వరలో అధికారికంగా ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పాదర్శక సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాకు 2,863 స్మార్ట్ఫోన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గానూ 2,824 అంగన్వాడీ కేంద్రాలు (మినీ, మెయిన్) ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణకు గానూ 39 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. అంగన్వాడీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా వీరందరికీ 2,863 స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ రకాల సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. వీటి వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్థిదారుల హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్య పరచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ల విధానం ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శక సేవలు అందుతాయి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోంది. ఐసీడీఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ల మంజూరుతో అక్రమాలకు చెక్ పడటంతో పాటు పారదర్శక సేవలు అందుతాయి. – రెడ్డి రమణమ్మ, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ (చదవండి: సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ) -
క్లిక్ చేస్తే దృశ్యం ప్రత్యక్షం
జీహెచ్ఎంసీ ఆస్తులకు జియో ట్యాగింగ్ ప్రస్తుతం 24 సర్కిళ్ల హద్దుల నమోదు ఇక పాలనలో మరింత వేగం.. సిటీబ్యూరో: పాలనలో ఐటీ విధానాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికే ఎన్నో సంస్కరణలు చేపట్టిన జీహెచ్ఎంసీ.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహానగరానికి సంబంధించిన సమస్త ఆస్తుల వివరాలను ఒక్క మౌస్ క్లిక్ దూరంలోకి తెచ్చింది. ఇకపై పాలనలో ‘స్మార్ట్ వర్క్’ మరింత వేగవంతం కానుంది. ఇప్పటిదాకా ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయో.. ఆటస్థలాలు.. పార్కులు.. బహిరంగ ఖాళీ ప్రదేశాలున్నాయో సరైన లెక్కలూ లేవు.. రికార్డులూ లేవు. ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా జీహెచ్ఎంసీలోని మురికివాడల నుంచి మొదలు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంపిక చేసిన బస్తీల వరకు అన్ని వివరాలను ‘జియో ట్యాగింగ్’ చేశారు. వాటితోపాటు జీహెచ్ ఎంసీలో పార్కులెన్ని.. ఎక్కడున్నాయి.. ఏ మురికివాడ ఎక్కడుంది.. జనాభా.. వారి సామాజిక వర్గం వంటి సమస్త సమాచారంతో గూగుల్ మ్యాప్స్‌ను వినియోగించి జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి గ్రేటర్‌లోని 24 సర్కిళ్లకు సంబంధించిన సరిహద్దులు, మొత్తం జీహెచ్ఎంసీలోని స్లమ్స్, పార్కులు, బహిరంగ ప్రదేశాలు, ఆటస్థలాల వివరాలను నమోదు చేశారు. ఉదాహరణకు ఏదైనా స్లమ్ లేదా పార్కుకు సంబంధించిన సమాచారం కావాలనుకుంటే అధికారులు తమ కార్యాలయంలోనే కంప్యూటర్ ద్వారా సంబంధిత యూఆర్ఎల్ను టైపు చేస్తే చాలు. ఆ వివరాలన్నీ కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా.. ఏదేని ప్రాంతంలో పనులు చేయాలన్నా ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. భవిష్యత్తులో జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన వివరాలనూ జియో ట్యాగింగ్ చేస్తామని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (ఐటీ) కె. సురేంద్ర మోహన్ తెలిపారు. సదరు వివరాలు ప్రజలకు కూడా తెలిసేలా జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌కు కూడా అనుసంధానిస్తామని వివరించారు. ప్రస్తుతం జియో ట్యాగింగ్ పూర్తయిన వాటిలో 24 సర్కిళ్ల సరిహద్దులు, కంటోన్మెంట్ ప్రాంతం, ఉస్మానియా యూనివర్సిటీ, బండ్లగూడ, పీర్జాదిగూడ, కళావంచ గ్రామ పంచాయతీల సరిహద్దులున్నాయి. వీటితోపాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు గుర్తించిన 55 ప్రదేశాలు, జీహెచ్ఎంసీలోని 1354 స్లమ్స్ వివరాలు, 2000 బహిరంగ ప్రదేశాలు, 628 పార్కులు, 319 ప్లేగ్రౌండ్స్కు సంబంధించిన వివరాలు, వాటి సరిహద్దులు ఉన్నాయి. అవి జీహెచ్ఎంసీలోని ఏజోన్, సర్కిల్, డివిజన్లో ఉన్నాయో కూడా తెలిసేలా ట్యాగింగ్ చేశారు. ఉదాహరణకు గాంధీనగర్ ప్లేగ్రౌండ్‌కు సంబంధించిన వివరాలు కావాలంటే సంబంధిత యూఆర్ ఎల్లో లాగిన్ అయితే..గాంధీనగర్ ప్లేగ్రౌండ్, వార్డు నెంబరు 88, సర్కిల్ 9 ఏ, సెంట్రల్‌జోన్.. అనే వివరాలతో పాటు సరిహద్దులతో కూడిన చిత్రం కనిపిస్తుంది.అలాగే సర్కిల్ 10లోని దోభీఘాట్ స్లమ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. సంబంధిత యూఆర్ఎల్లోకి వెళితే సరిహద్దుల రేఖాచిత్రం, దానికి ఎడమవైపున వివరాలు వరుసగా కనిపిస్తాయి.ఇలా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటే.. పనులు స్మార్ట్‌గా చేయవచ్చునని, స్మార్ట్‌సిటీ అయ్యేందుకు ఇదీ ఒక అంశంగా ఉపకరిస్తుందని భావిస్తున్నారు.