breaking news
Sleep peralasis
-
అసలు నిజమేంటి?.. ఎందుకిలా జరుగుతుంది?
నిద్రలో కాళ్లు చేతుల ఆడవు.. మెడను నొక్కస్తున్నట్లు ఉంటుంది అది దెయ్యం పనేనా..??? అర్ధరాత్రి..! గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్లుండి ఎవరో మంచం పక్కన కూర్చున్నట్లు అనిపిస్తుంది..! క్రమంగా గుండెలపైకెక్కి కూర్చున్నట్లు.. గొంతు నులుముతున్నట్లు అనిపిస్తుంది..! మనం అసంకల్పిత ప్రతీకార చర్యలో భాగంగా ఒక్క తోపు తోసేయాలనుకుంటాం.కానీ, చేతులు కదలవు..! కాళ్లను కదపలేం..! ఇలాంటి అనుభవం దాదాపుగా ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ఉంటారు..! కొందరికి ఈ స్థితి ఒకరెండ్రుసార్లు ఎదురైతే.. మరికొందరికి నిద్రలో ఇదో నిత్యకృత్యం..! ఇందుకు కారణాలేంటి? కొందరైతే దెయ్యమే ఆ పని చేస్తోందంటారు. మరికొందరైతే.. గిట్టనివారు చేతబడి చేయడం వల్ల ఇలా జరిగిందంటారు..! అసలు నిజం ఏమిటో తెలుసుకోవాలని ఉందా..!ఏ సమయంలో ఇలా జరుగుతుంది??అర్ధరాత్రి సరిగ్గా 12.30 గంటలు దాటాకే చాలా మంది ఇలాంటి ఫీలింగ్‌ను ఎదుర్కొన్నట్లు పలు పరిశోధనలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 3.30 వరకు ఎప్పుడైనా ఈ పరిస్థితి రావొచ్చని పేర్కొంటున్నాయి. ఎవరో గుండెలమీద కూర్చుని, పీక నొక్కుతున్నట్లు.. గుండెలపై బరువు అంతకంతకూ పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. కాళ్లు, చేతులను కదిలించలేని స్థితిలో.. ఏమీ చేయలేని దుస్థితి ఎదురవుతుంది. అంతేకాదు.. గట్టిగా అరవాలనిపించినా.. అరవలేరు. కళ్లు కూడా తెరవలేరు. దాంతో.. గుండెలో దడ మొదలవుతుంది. మదినిండా ఆందోళనలతోకూడిన ఆలోచనలు వస్తుంటాయి. కళ్లు మూసుకుని ఉన్నా.. బెడ్రూంలో పరిసరాలు కనిపిస్తుంటాయి. ఒక్కోసారి ఎదురుగా వింతవింత ఆకారాలు ఉన్నట్లు అనిపిస్తుంది.అంతా ట్రాష్ అంటున్న సైంటిస్టులుఈ పరిస్థితి కలలాంటిదే అని చాలా మందికి తెలియదు. కాస్త మెలకువ వచ్చేముందు.. భయంతో దేవుడి నామస్మరణ చేసుకుంటారు. ఆ తర్వాత నిద్ర లేస్తారు. దాంతో.. దేవుడి పేరు చెప్పగానే దెయ్యం పారిపోయిందనుకుంటారు. కానీ.. ఇదంతా దెయ్యం పనో.. చేతబడుల ఫలితమో కాదని, అవన్నీ ట్రాష్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి పరిస్థితులకు శాస్త్రీయ కారణాలున్నాయని చెబుతున్నారు. నిద్రకు సంబంధించిన మానసిక రుగ్మతలైన స్లీప్ టెర్రర్, నైట్ మేర్ డిజార్డర్, స్లీప్ వాకింగ్ మాదిరిగానే.. స్లీప్ పెరాలసీస్ అనే రుగ్మత కారణంగా ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. అంటే.. ఈ పరిస్థితిని నిద్రలో పక్షవాతం అని అనవచ్చు. ఇలా అందరికీ జరుగుతందా? అంటే.. చెప్పలేం..! స్లీప్ పెరాలసిస్ అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది. ఆ కొద్ది క్షణాలు శరీరమంతా లాక్ అవుతుంది.స్లీప్ పెరాలసిస్ అంటే..అసలు స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణంగా పెరాలసిస్.. అదే పక్షవాతం వస్తే.. పూర్తిగానో.. పాక్షికంగానో కాలు, చేయి చచ్చుబడిపోయి.. నోరు ఓవైపునకు జారిపోతుంది. స్లీప్ పెరాలసిస్ మాత్రం కొన్ని క్షణాలే ఉంటుంది. అయితే.. పక్షవాతానికి మెదడుకు సంబంధం ఉన్నట్లుగానే.. స్లీప్ పెరాలసిస్‌కు కూడా మెదడు నుంచి విడుదలయ్యే కమాండ్స్ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే.. అంతకు ముందు విన్న విషయాలో.. హారర్ స్టోరీలో మెదడులో స్టోర్ అయిపోతాయి. నిద్రలో జాగ్రత్, స్వప్న, సుశుప్త దశలుంటాయి. వీటినే.. ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, స్లీప్, డీప్ స్లీప్ అంటారు.స్లీప్ క్వాలిటీ కోసం స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుని, నిద్రపోయేవారికి ఈ విషయాలు బాగా తెలుసు. మనం నిద్రిస్తున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు వెన్నెపూస మెదడులా పనిచేస్తుంది. అందుకే.. నిద్రలో దోమలు కుట్టినప్పుడు మనం అది కుట్టిన చోట తెలియకుండానే గట్టిగా చరుస్తాం. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటాం.ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో మెదడులో నిక్షిప్తమైన పాత జ్ఞాపకాలు స్లీప్ పెరాలసిస్‌కు కారణాలవుతాయని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ఎవరైనా నిద్రిస్తున్నప్పుడు.. ఎప్పుడైతే ఎవరో పక్కన కూర్చున్నారనే భావన వస్తుందో.. గుండె దడ పెరగడం వల్ల ఛాతీపై ఎవరో కూర్చున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. దానికి పాత జ్ఞాపకాలు కలిసి.. భయం పెరుగుతుంది. అంతే.. కొన్ని సెకన్లపాటు స్లీప్ పెరాలసిస్ వస్తుంది. ఇది కనీసం 30 సెకన్లు ఉంటుంది. గరిష్ఠంగా ఇంత సమయం అని చెప్పలేం.కంటినిండా నిద్ర లేకపోవడమే కారణం..స్లీప్ పెరాలసిస్ అంటే తెలుసుకున్నారు కదా? నిద్ర నుంచి మెలకువ రాగానే స్లీప్ పెరాలసిస్ దశ నుంచి బయట పడతారు. కాసేపు ఆందోళన చెందుతారు. అంతా భ్రాంతి అని అర్థం చేసుకుని, మళ్లీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా స్లీప్ పెరాలసిస్ రావడానికి దెయ్యాలో, చేతబడులో కారణం కాదు. కంటి నిండా నిద్ర లేకపోవడం, సరైన సమయంలో నిద్రకు ఉపక్రమించకపోవడం, నిద్ర షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వడం ప్రధాన కారణాలు. ఒత్తిడి, నిరాశ, అతిగా ఆలోచించడం, ప్రతికూల ఆలోచనలు, కలత వంటివి ఇతర కారణాలు అని క్లినికల్ సైకాలజిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నవారు ఎక్కువగా స్లీప్ పెరాలసిస్‌కు గురవుతుంటారు. రోజులో ఎనిమిది గంటల నిద్ర మాత్రమే స్లీప్ పెరాలసిస్‌కు చెక్ పెట్టగలదని పేర్కొంటున్నారు.-హెచ్. కమలాపతిరావు(చదవండి: ఎముకలు కొరికే చలిలో..టీ,కాఫీ తాగుతున్నారా?) -
స్లీప్ కౌన్సెలింగ్
స్లీప్ పెరాలసిస్ అంటే..? నా వయసు 50. నా సమస్య ఏమిటంటే... నేను నిద్రలేచాక చాలాసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు ఇవేవీ కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి ఉంచగలను. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు కొనసాగుతోంది. దీంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - కె. రామస్వామి, మిర్యాలగూడ మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీరు స్లీప్ పెరాలసిస్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలో లేదా నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువ స్థితికి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది. ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం స్పందించాలనుకున్నా ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఈ స్లీప్ పెరాలసిస్ అన్నది రెండు సమయాల్లో కలుగుతుంది. మొదటిది... నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; రెండోది నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు. స్లీప్ పెరాలసిస్ అన్నది చాలా అరుదైన రుగ్మత కాదు. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో (అడాలసెన్స్లో) ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. స్లీప్ పెరాలసిస్ అన్నది సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇది వచ్చేందుకు దోహదపడే మరికొన్ని అంశాలివి... నిద్రలేమి మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక వ్యాధులు ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి) తీవ్ర అవమానానికి గురికావడం చికిత్స: స్లీప్ పెరాలసిస్ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 - 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం ద్వారా కూడా దీనికి చికిత్స చేయవచ్చు. డాక్టర్ వి.వి. రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ - కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్


