చట్టం రావాలి!
నేను, మా కొలీగ్ గడచిన ఐదేళ్లుగా లివింగ్ ఇన్ రిలేషన్షిప్తో జీవిస్తున్నాం. మాకు మూడేళ్ల పాప ఉంది. పాపను స్కూల్లో చేర్చడానికి, భవిష్యత్తులో ఏదైనా అవసరం వచ్చినా భార్యగా నాకు ఏ హక్కులూ సంక్రమించవని మా స్నేహితురాలు చెప్తోంది. ఇది నిజమేనా?
- ఎస్. కావ్య, హైదరాబాద్
లివింగ్ ఇన్ రిలేషన్షిప్ విషయంలో మనదేశంలో ఇంకా నిర్దిష్టమైన చట్టాలు రూపొందలేదు. ఇటీవల ఇలాంటి సమస్యలు చాలామందికి ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ‘ఇలాంటి మహిళలకు భద్రత కల్పించే చట్టం రూపొందాల్సిన ఆవశ్యకత ఉందని’ స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో చట్టాలు చేయడానికి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి. ఇప్పటికైతే కేసులు ఫైల్ చేయడానికి కచ్చితమైన నంబరు కూడా లేదు. చాలా సందర్భాలలో ఈ సమస్యకు దగ్గర సంబంధం ఉన్న చట్టం నంబరుతో కేసు ఫైల్ అయినప్పటికీ విచారణకు స్వీకరించే దశలో తిరస్కరణకు గురవుతున్నాయి.
ఐరోపాదేశాలలో ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. అక్కడ లివింగ్ ఇన్ రిలేషన్షిప్కి స్పష్టమైన చట్టాలున్నాయి. మనదేశం విషయానికి వస్తే ఇలాంటి సమస్యల విషయంలో అనేక రుజువులను కోర్టుకు సమర్పించాలి. పిల్లల మెయింటెనెన్స్ బాధ్యత వహించాల్సిందిగా తండ్రికి తీర్పు వచ్చిన సందర్భాలున్నాయి. కానీ సహజీవనం చేసిన మహిళ పోషణ బాధ్యత విషయంలో స్పష్టత రాలేదు. ఈ బిల్లు విషయంలో న్యాయశాస్త్రంలో నిపుణులు, మేధావులు ఇంకా సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది.