breaking news
Siva Ramakrishnan
-
గుంటూరే బెస్ట్!
సాక్షి, గుంటూరు:కొత్త రాజధానికి కావాల్సిన అన్ని వనరులు గుంటూరు-విజయవాడ మధ్య పుష్కలంగా ఉన్నాయని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మేధావులు నిపుణుల కమిటీకి సూచించారు. అలాగే పల్నాడు ప్రాంతాన్ని కూడా పరిశీలించాలని కోరారు. కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర హోం శాఖ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి కె.శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఏర్పాటైన నిపుణుల కమిటీ సోమవారం జిల్లాలో పర్యటించింది. కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ అనారోగ్య కారణాలతో హాజరు కాకపోవడంతో సభ్యులు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ విభాగం డెరైక్టర్ డాక్టర్ రతన్‌రాయ్ అధ్యక్షతన నిపుణుల కమిటీ సమీక్ష చేసింది. జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అమరావతి ప్రాంతాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. అనంతరం గుంటూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. పలువురు ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల నుంచి నివేదికలు స్వీకరించారు. రాజధాని ఎంపిక కోసం ఇక్కడ అనువుగా ఉండే అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసింగ్, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో నదీజలాల పరిస్థితి, అటవీ ప్రాంతం, మైదాన ప్రాంతం రవాణా సౌకర్యాలపై అధికారులను అడి గి తెలుసుకున్నారు. కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ జిల్లా సమగ్ర స్థితిని వివరించారు. రాజధాని ఏర్పాటుకు వనరులు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. సీమాంధ్ర జిల్లాలకు కేంద్ర స్థానం.. ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విజయవాడ- గుంటూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని 13 జిల్లాలకు కేంద్ర స్థానంగా ఉంటుందన్నారు. తాగునీటి వనరులు పుష్కల ంగా ఉన్నాయన్నారు. రోడ్డు, రైలు, వాయు మార్గాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు ద్వారా 45 టీఎంసీల నీటిని నిల్వ చేసే వీలున్నందున అదనంగా తాగునీరు లభ్యమవుతుందని పేర్కొన్నారు. విజయవాడలో గన్నవరం ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా తీర్చిదిద్దవచ్చన్నారు. అమరావతిలో బౌద్ధం విస్తరించి ఉందన్నారు. యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు గుంటూరు-విజయవాడలలో ఉన్నాయని కమిటీ దృష్టికి తెచ్చారు. విజయవాడ-గుంటూరులను కలిపి రాజధానిగా ఏర్పాటు చేయాలని వణుకూరి కోరారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య సంఘాల నేతలు కమిటీ సభ్యులకు వినతిప్రతాలు సమర్పించారు. విజయవాడ- గుంటూరు మధ్య రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ కమిటీ సభ్యులను కోరారు. గుంటూరునే రాజధానిగా చేయాలని చుండూరు గ్రామానికి చెందిన రైతు రాఘవరెడ్డి కమిటీ సభ్యులను కోరారు. ప్రకాశం జిల్లా- గుంటూరు మధ్య రాజధాని చేయాలని పలు ప్రజాసంఘాల నేతలు కమిటీ సభ్యులను కోరారు. పల్నాడు ప్రాంతం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటుందని, ఇక్కడ రాజధానికి అనువుగా ఉంటుందని నిపుణుల కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్, అర్బన్, రూరల్ ఎస్పీలు జెట్టి గోపీనాథ్, జె.సత్యనారాయణ పాల్గొన్నారు. ఆగస్టు 31లోగా కేంద్ర హోం శాఖకు నివేదిక సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. పరిశీలనకు మాత్రమే వచ్చాం.. రాజధాని ఎంపిక ప్రక్రియలో భాగంగా జిల్లాలో సమగ్ర పరిస్థితిపై సమాచారం సేకరించేందుకే తాము వచ్చామని శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు న్యూఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్ కె.టి.రవీంద్రన్, అరోమర్ రవి, జగన్ షాలు ప్రకటించారు. రాజధాని ఎంపిక ప్రక్రియలో జోన్ నిబంధలను పాటిస్తూ రాజభవన్, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాల నిర్మాణం, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ శాఖలు, ప్రధాన కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌లు, అధికారులకు, సిబ్బందికి క్వార్టర్స్, స్టేడియంలు, హోటళ్లు, ఆస్పత్రులు, కళాశాలలు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, థియేటర్లు ఇలా అన్ని వసతులకు అనువుగా అవసరమైన మేరకు జిల్లాలో భూములు ఎక్కడ ఉన్నాయనే విషయాలపైనా సమగ్రంగా చర్చించారు. నదీ తీర ప్రాంత మ్యాప్‌ల పరిశీలన.. అమరావతి: రాజధాని ఎంపిక కమిటీ క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా సోమవారం అమరావతిని సందర్శించి అధ్యయనం చేసింది. ధ్యానబుద్ధ ప్రాజెక్టు వద్ద కృష్ణానదీ తీరాన్ని పరిశీలించింది. నది వెడ ల్పు, లంక భూముల వివరాలు, తీరప్రాంత పొడవు, ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకున్నారు. అచ్చంపేట మండలంలోని అటవీ భూములు, అక్కడ రాతి నిల్వల వివరాలు సేకరించింది. నదీ తీరప్రాంతంలో పండే పంటలు, నది ఆవల గ్రామాలపై ఆరా తీసింది. తీర ప్రాంతానికి చెందిన పలు మ్యాప్‌లను పరిశీలించింది. అనంతరం స్నానఘట్టం, మ్యూజియం లను పరిశీలించిన కేంద్ర కమిటీ బృందం గుంటూరు పయనమైంది. ఈ బృందం వెంట వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర రాజధానిగా తిరుపతి?
మూడు రోజుల్లో పరిశీలనకు రానున్న ఎంపిక కమిటీ రాజధానిగా అనుకూలతలపై ప్రత్యేక అధ్యయనం భూమి లభ్యత, రవాణా సదుపాయాలపై దృష్టి సాక్షి, తిరుపతి : సీమాంధ్రకు కొత్తరాజధాని రేసులో తిరుపతి ఆధ్యాత్మిక నగరం సైతం ఉంది. రాష్ట్రం జూన్ 2 నుంచి 13 జిల్లాలతో ఏర్పడనుండటంతో సీమాంధ్ర రాజధానిగా ఏ నగరాన్ని ఎంపిక చేయాలనే అంశంపై కేంద్ర హోంశాఖ నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ కమిటీ తిరుపతికి సైతం రానుంది. తిరుపతికి రాజధానిగా ఉన్న అనుకూలతలను లోతుగా అధ్యయనం చేయనుంది. మే 9వ తేదీ విశాఖపట్టణం వస్తున్న శివరామకృష్ణన్ కమిటీ అక్కడ అధ్యయనం పూర్తి చేసుకుని విజయవాడ, గుంటూరు నగరాలను పరిశీలించనుంది. రెండవ దశలో కర్నూలు, తిరుపతి నగరాలకు రానుంది. తిరుపతిని రాజధానిగా చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. చిత్తూరు జిల్లాలోని పలువురు రాజకీయ నాయకులతో పాటు, కొన్ని సంస్థల ప్రతినిధులు కూడా తిరుపతి రాష్ట్ర రాజధానిగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని ఎంపిక కమిటీకి, కేంద్ర హోంశాఖకు తమ అభిప్రాయాలను ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేశారు. దీంతో ఆరుగురు నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీ తిరుపతిలో కూడా పర్యటించి జనం అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. రాజధానిగా తిరుపతి అనుకూలతలు తమిళనాడు రాజధాని చెన్నైకి 140 కిలోమీటర్లు, కర్ణాటక రాజధాని బెంగళూరుకు 240 కిలోమీటర్ల దూరంలో తిరుపతి నగరం ఉంది. భౌళిగోకంగా ఇది పెద్ద అనుకూలత. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వేంకటేశ్వరుని పుణ్యక్షేత్రం తిరుమల కొండపై ఉంది. ఇక్కడికి దేశ, విదేశాల నుంచి ప్రముఖులు వస్తుంటారు. పర్యాటకంగా ఇప్పటికే తిరుపతి అంతర్జాతీయ ప్రసిద్ధిగాంచింది. 2008లోనే రేణిగుంట సమీపంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభమయ్యాయి. మరో రెండేళ్లలో ఈ పనులు పూర్తి కానున్నాయి. తిరుపతి నుంచే గల్ఫ్‌దేశాలతో పాటు, యూరోపియన్ దేశాలకు, ఇతర దేశాలకు నేరుగా విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీ, ఇతర నగరాలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రెగ్యులర్ విమానాలు నడుస్తున్నాయి. తిరుపతి నుంచి ఢిల్లీ, ముంబై, కశ్మీర్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు, ఇటు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి వంటి దక్షిణాది రాష్ట్రాలకు, మధ్యభారతదేశానికి రైలు సదుపాయం ఉంది. పలు సూపర్‌ఫాస్టు, ఎక్స్‌ప్రెస్‌రైళ్లు తిరుపతి మీదుగా నడుస్తున్నాయి. రేణిగుంటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ(సీఆర్ఎస్) ఉంది. సచివాలయం, అసెంబ్లీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర కీలకమైన పరిశోధన, వైద్యవిజ్ఞాన సంస్థల నిర్మాణానికి ఏర్పేడు-వెంకటగిరి మధ్య ఐదువేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి స్విమ్స్ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు, బర్డ్, రుయా వంటి ప్రాంతీయ, రాష్ట్రస్థాయి ఆస్పత్రులు ఉన్నాయి. తిరుపతిలోనే రాష్ట్రస్థాయి యూనివర్సిటీలు ఆరు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ డీమ్డ్ యూనివర్సిటీ, రీజినల్ సైన్స్ సెంటర్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ హోటల్ మేనేజ్మెంట్, టూరిజం విద్యాసంస్థలు ఉన్నాయి. భద్రత కోసం ఇప్పటికే అర్బన్ పోలీస్ జిల్లా ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో దీన్నే పోలీస్ కమిషనరేట్‌గా మార్చుకోవచ్చు. ఇలా తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేసేందుకు అనేక అనుకూలాంశాలు ఉన్నాయి. కమిటీ రానున్న సందర్భంగా జిల్లాకు చెందిన మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు ఇలా పలు రంగాలకు చెందిన వారు తన అభిప్రాయాలను నిపుణుల దృష్టికి తీసుకొస్తే తిరుపతి కూడా ఇతర నగరాలతో సమానంగా రాజధాని ఎంపికకు పోటీ పడే అవకాశం ఉంది.