breaking news
Shashank B
-
గోదావరి ఒడిలో పుట్టడం నా అదృష్టం!
- రచయిత భాస్కరభట్ల ‘‘తల్లి గోదావరిని చూడటానికి రాజమండ్రి వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఎక్కి అందులో ప్రయాణిస్తూ మా ఊరు చేరుతుంటే నన్నెవరో అనాథ శరణాలయం నుంచి అమ్మ పొత్తిళ్లలోకి చేరవేస్తున్నట్లనిపించింది. డబ్బా పాలను విసిరేసి అమ్మ స్తన్యాన్ని గ్రోలడానికి ఆవురావురుమని వచ్చే పసిపిల్లాణ్ణి అయిపోతా’’ ఈ ‘తల్లి గోదావరి’ కవిత మొదట తనికెళ్ల భరణి గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనంలో చెప్పాను. సంగీత దర్శకుడు చక్రి కన్నీళ్లతో నన్ను కౌగిలించుకున్నారు. అప్పటి నుంచి నా జీవితం మలుపు తిరిగింది. ఆ గోదావరితో నాకున్న అనుభవాలు, అనుభూతులు అనేకం. నేను గోదావరి తీరంలో పుట్టి ఉండకపోతే, నేనసలు ఇంత పెద్ద రచయితని అయ్యేవాడిని కాదేమో. ఈ కవిత చెప్పాక చక్రి నన్ను పూరి జగన్నాథ్‌కు పరిచయం చేశారు. ఇక అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. ఇక వరుసగా ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి... ఇలా నా కెరీర్లో వరుస హిట్లు. ఆ పాట అప్పుడే రాశాను. ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆ గోదావరే కారణం. ఆ గోదారమ్మ ఒడిలో పుట్టడం నా అదృష్టం. ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా సిట్టింగ్స్ గోదావరి మీద లాంచీలో జరిగాయి. అప్పటికప్పుడు ‘గోరువంక గోదారి వంక ఈత కెళదాం వస్తావా’ అనే పాట రాశాను. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఒక్కడినైనా సరే అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ చక్కగా ఏదో ఒకటి కొనుక్కుని, హాయిగా పుష్కరాల రేవులో కాలక్షేపం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది. నాకు ఊహ తెలిశాక మొదటి పుష్కర సమయంలో పాకెట్ మనీ కోసం కంట్రిబ్యూటర్‌గా జాయిన్ అయ్యాను. రెండో పుష్కరాల టైమ్‌కి నేను సినీ పరిశ్రమలో రైటర్ని అయ్యాను. ఈ మూడో పుష్కరానికి సెలబ్రిటీ హోదాలో ఉన్నాను. అలా ఆ గోదావరి ఒడ్డున నడచుకుంటూ వెళుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ గోదావరి తీరంలోనే నేను అక్షరాభ్యాసం చేశాను. అక్కడ గౌత మీ లైబ్రరీలో చదువుకున్న పుస్తకాలు నేను రచయిత కావడానికి పునాదులయ్యాయి. - శశాంక్ బి. -
అసలేం జరిగింది! ఏం జరగబోతోంది?
కామెడీ సీన్ రమణ, గిరి... ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన పార్ధూని కలుసుకుంటారు. పలకరింపులయ్యాక కొద్దిసేపు బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటారు. తెలిసీ తెలియని వయసులో జరిగిన ఒక పొరపాటుకు చింతిస్తారు. పార్థుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గిరి, రమణ ఇద్దరే అంతా మాట్లాడేస్తారు. ఆ సందర్భంగా ఒక సరదా సంఘటన ఇది. గిరి: అలా బయటకు వెళ్లి, కాఫీ తాగి దమ్ము కొడదాం రారా!(పార్ధూతో) పార్ధు: ఒక్క నిమిషం అత్తయ్యకు చెప్పి వస్తా! రమణ: ఇప్పుడు సిగరెట్లు గురించి ఆవిడకెందుకు? అనవసరం కదా! పార్ధు: కాఫీ వరకూ చెప్పొస్తా రమణ: అయితే ఓకే కట్ చేస్తే...! (చిన్న హోటల్ ) (ఈ సీన్లోకి ఎమ్మెస్ నారాయణ కూడా ఎంటరవుతారు. ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరు లేదు. అందుకే ఈ సందర్భంగా ఆ పాత్రకు ఎంకట్రావ్ అని పేరు పెట్టాం) అక్కడ ఎంకట్రావ్ అప్పుడే మినపట్టు తెప్పించుకుంటాడు. మినపట్టు ముక్కను సాంబారులో నంచుకుని తింటూంటాడు ఎంకట్రావ్: (అమాయకంగా) సాంబారు చప్పగా ఉంది! సర్వర్: ఒరేయ్ గ్లాస్ మార్చండి. సాంబార్ అనుకొని మంచి నీళ్లలో ముంచుకు తినేస్తున్నాడు. (ఇంతలో అదే హోటల్లోకి పార్ధూ, గిరి, రమణ వస్తారు...) గిరి: చాన్నాళ్లయిందిరా ఇక్కడకు వచ్చి రమణ: ఏ అప్పున్నావా..? (వాళ్లు ముగ్గురూ వచ్చి ఎమ్మెస్ వెనుక టేబుల్ దగ్గర కూర్చుంటారు) రమణ: (పార్ధూతో) బావా! నీకెప్పుడూ మన శేఖర్గాడి విషయంలో బాధనిపించలేదా? నాకు మాత్రం చాలా సార్లు తప్పు చేశాం అనిపించింది. గిరి: ఇప్పుడవన్నీ ఎందుకురా! (ఎంకట్రావ్ తినడం ఆపేసి మరీ వీళ్ల మాటలు వింటూ ఉంటాడు) రమణ: ఎందుకంటావ్ ఏంట్రా! వీడు చేసింది తప్పు కదా! (దోశె నోట్లో పెట్టుకోబోతూ టెన్షన్లో తినడం మర్చిపోతాడు) గిరి: మరప్పుడు చెప్పచ్చు కదా! రమణ: అప్పుడు నా వయసు పదేళ్లు గిరి: అప్పుడు ఆడి వయసూ పదేళ్లే! రమణ: ఎన్నయినా చెప్పరా... నువ్ అలా చేయడం మాత్రం తప్పే! ఎంకట్రావ్: (మధ్యలో తగులుకుంటూ) ఎలా చేయడం? (రమణ, గిరి వింతగా ఒకళ్ల మొహాలు, ఒకళ్లు చూసుకుంటారు) జీవితంతో పందెం కాయడం, అదీ పదేళ్ల వయసులో... కరెక్ట్ అంటారా? ఎంకట్రావ్: ఎవరి జీవితం? ఎవరు పందెం కాశారు. ఎవరి వయసు పదేళ్లు? రమణ: నేను ఇన్ఫర్మేషన్ గురించి చెప్పట్లేదు. ఫీలింగ్ గురించి చెబుతున్నా ఎంకట్రావ్: ఎందుకు ఫీల్ అవుతున్నావ్? రమణ: ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి! ఎంకట్రావ్: ఏంటా సంఘటన? గిరి: ఎందుకు సార్! పాత గాయాన్ని మళ్లీ రేపుతారు? ఎంకట్రావ్: ఎవరు రేపిందీ?. ఏంటా గాయం? రమణ: ఎప్పుడో పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది! ఎంకట్రావ్: అదే ఏంటా విషయం? రమణ: చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది! ఎంకట్రావ్: (కోపంతో ఊగిపోతూ) ఒరేయ్ అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టార్రా?? నా మానాన నేను మాడిపోయిన మసాల దోశె తింటూంటే... జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించీ వినిపించ కుండా, కనిపించీ కనిపించకుండా, చూపించీ చూపించకుండా మాట్లాడింది ఎవరు?... అసలు ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది తెలియాలి... తెలియాలి... తెలియాలి... తెలిసి తీరాలి! (త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్‌కు బాగా విజిల్స్ పడటం ఈ ‘అతడు’ సినిమా నుంచే మొదలైంది. పార్ధుగా మహేశ్‌బాబు, గిరి, రమణ పాత్రల్లో గిరి, సునీల్ నటించారు. ఇక ఎమ్మెస్ కనిపించింది ఒక్క సీన్ అయినా ఆయన చెప్పిన ఈ డైలాగ్ అందరి నోళ్లల్లో ఇప్పటికీ నానుతోంది) - శశాంక్ బి