breaking news
shahin beghum
-
సౌదీ వెళ్లేందుకు మనవరాలి కిడ్నాప్
బహదూర్‌పురా: సౌదీ వెళ్లేందుకు మనవరాలిని కిడ్నాప్ చేసి రైల్వే స్టేషన్లో విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పురానీహవేలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. కిషన్‌బాగ్ నజంనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ డానిష్, షాహిన్ బేగం దంపతులు. వీరికి కుమార్తె సాదియా. ఈ నెల 26న చాక్లెట్ తెచ్చుకునేందుకు సాదియా సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అదే అదనుగా ఆమెకు వరుసకు తాతయ్య వసీం ఖాన్ సాదియాను తీసుకుని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. సౌదీకి వెళ్లేందుకు తనకు రూ.50 వేలు అవసరం ఉండటంతో చిన్నారి సాదియాను రైల్వే స్టేషన్లో అమ్మకానికి పెట్టాడు. అయితే ఎవరూ చిన్నారిని కొనేందుకు ముందుకు రాకపోవడంతో ఆమెను చిత్తూరుకు వెళుతున్న ట్రైన్లో వదిలేసి వచ్చేశాడు. సాదియా కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఫిర్యాదు సమయంలో వసీం ఖాన్ కూడా వారితో పాటే ఉండటం గమనార్హం. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా వసీం ఖాన్ చిన్నారని ఎత్తుకెళుతున్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. దీంతో తెల్లవారుజామున 5 గంటలకు చిత్తూరులో ట్రైన్ బోగిలో పరిశీలించగా చిన్నారి లేకపోవడంతో రైల్వే పోలీసులను ఆరా తీశారు. ఉదయమే బాలికను రైల్వే పోలీసులు సికింద్రాబాద్‌లోని శిశువు విహార్‌కు తరలించినట్లు తెలిపారు. వారు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడు వసీం ఖాన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
యాకుత్‌పురా: విదేశాల్లో అధిక మొత్తంలో సంపాదించే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఓ మధ్యవర్తిని రెయిన్‌బజార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ జి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా గంగానగర్ నాలా ప్రాంతానికి చెందిన దిల్దార్ ఖాన్, షాహీన్ బేగం (40)లు దంపతులు. షాహీన్ బేగంకు దుబాయ్‌లో ఎక్కువ మొత్తంలో చెల్లించే కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమన్‌నగర్‌కు చెందిన మధ్యవర్తి ఆబేద్ హుస్సేన్ (45) నమ్మించి వారి వద్ద డబ్బులు తీసుకున్నాడు. అనంతరం ముంబాయిలో ఉండే ఓ కన్సల్టెన్సీ సాయంతో గత డిసెంబర్లో షాహీన్ బేగంను దుబాయ్‌కి పంపించాడు. దుబాయ్‌లో పని ఎక్కువ చేయించుకుంటూ తక్కువ మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారని షాహీన్ బేగం భర్త దిల్దార్ ఖాన్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీనిపై దిల్దార్ ఖాన్ మధ్యవర్తి ఆబేద్ హుస్సేన్‌ను ఆరా తీయగా సమాధానం దాట వేశాడు. దీంతో జరిగిన మోసంపై బాధితులు దిల్దార్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆబేద్ హుస్సేన్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆబేద్‌కు సహకరించిన మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.