breaking news
Senior Wrestling World Championship
-
World Wrestling Championships 2022: భళా బజరంగ్...
బెల్గ్రేడ్ (సెర్బియా): అందివచ్చిన పతకావకాశాన్ని సద్వినియోగం చేసుకున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా అద్భుత ప్రదర్శనతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆదివారం ముగిసిన ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో బజరంగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. కాంస్య పతకం సాధించాలంటే తప్పనిసరిగా రెండు వరుస బౌట్లలో గెలవాల్సిన బజరంగ్ తన సత్తా చాటుకున్నాడు. బజరంగ్‌ను క్వార్టర్ ఫైనల్లో ఓడించిన అమెరికా రెజ్లర్ జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో బజరంగ్‌కు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ఆదివారం జరిగిన ‘రెపిచాజ్’ తొలి బౌట్లో 28 ఏళ్ల బజరంగ్ 7–6తో వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా)పై నెగ్గి కాంస్య పతక పోరుకు అర్హత సాధించా డు. వాజ్జెన్తో జరిగిన మ్యాచ్‌లో ఒకదశలో బజరంగ్ 1–4తో వెనుకబడి పుంజుకోవడం విశేషం. అనంతరం జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో బజరంగ్ 11–9తో సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)పై విజయం సాధించాడు. రివెరాతో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలోనే బజరంగ్ 0–6తో వెనుకబడ్డాడు. అయితే వెంటనే తేరుకున్న ఈ హరియాణా రెజ్లర్ ఆరు పాయింట్లు గెలిచి తొలి భాగం ముగిసేసరికి 6–6తో సమంగా నిలిచాడు. రెండో భాగం ఆరంభంలో బజరంగ్ మళ్లీ మూడు పాయింట్లు కోల్పోయి 6–9తో మళ్లీ వెనుకబడ్డాడు. అయినా ఆందోళన చెందని బజరంగ్ ఉడుంపట్టుతో మెరిసి 2, 2 పాయింట్లు సాధించి 10–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. చివరి సెకన్లలో ప్యూర్టోరికో రెజ్లర్ రివ్యూకు వెళ్లడం, దానిని అతను కోల్పోవడంతో భారత రెజ్లర్‌కు అదనంగా మరో పాయింట్ లభించింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో క్యూబా రెజ్లర్ అలెజాంద్రో వాల్డెస్తో పోటీపడుతున్న సమయంలో బజరంగ్ తలకు గాయమైంది. అయినా కట్టు కట్టుకొని ఆడిన బజరంగ్ తొలి రౌండ్లో 5–4తో వాల్డెస్ను ఓడించాడు. ఆ తర్వాత తలకు గాయంతోనే ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లలో పోటీపడి చివరకు కాంస్య పతకం సాధించాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడ్డ బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో నాలుగు పతకాలు సాధించి అత్యంత విజయవంతమైన భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. -
సందీప్ యాదవ్‌కు నిరాశ
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ తాష్కెంట్: గతేడాది మూడు పతకాలు నెగ్గి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత్ ఈసారి రిక్తహస్తాలతో తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. నిరుడు గ్రీకో రోమన్ విభాగంలో కాంస్యం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన సందీప్ తులసీ యాదవ్ ఈసారి మాత్రం అదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. 66 కేజీల విభాగంలో పోటీపడిన ఈ మహారాష్ట్ర రెజ్లర్ ఈసారి రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో సందీప్ 5-2తో మతౌస్ మొర్బిట్జెర్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించగా... రెండో రౌండ్లో 5-6తో హసన్ అలియెవ్ (అజర్బైజాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. అలియెవ్ ఫైనల్‌కు చేరుకోకపోవడంతో సందీప్క కనీసం కాంస్యం కోసం నిర్వహించే ‘రెప్‌చేజ్’ బౌట్లలో పోటీపడే అవకాశం రాలేదు. 80 కేజీల విభాగంలో హర్‌ప్రీత్ సింగ్ ‘రెప్‌చేజ్’ రెండో రౌండ్ బౌట్లో 0-5తో బోజో స్టార్సెవిచ్ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 130 కేజీల విభాగంలో ధర్మేందర్ దలాల్ తొలి రౌండ్లో 0-6తో తినలియేవ్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోయాడు.