Scientists in Canada
-
లవణాలతో కరోనా వైరస్ నుంచి రక్షణ?
కరోనా వైరస్... పేరు చెప్పగానే ప్రపంచం ఉలిక్కిపడే పరిస్థితి. చికిత్స లేని ఈ వ్యాధికి నివారణే మేలైన మందు. కానీ ఎలా? ఈ చిక్కు ప్రశ్నకు సమాధానం ఇదిగో అంటున్నారు కెనెడా శాస్త్రవేత్తలు. వైరస్లు సోకకుండా ఉండేందుకు కట్టుకునే సాధారణ మాస్కులతో మేలు కంటే కీడే ఎక్కువని వీరు స్పష్టం చేస్తున్నారు. ఈ మాస్క్‌లు గాల్లో వైరస్‌లతో కూడిన నీటిచుక్కలను ఒడిసిపట్టగలిగినా.. చంపలేవని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హ్యో జిక్ ఛోయ్ అంటున్నారు. అయితే కరోనా వైరస్ ఇంతకంటే సూక్ష్మమైన వాటి గుండా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మాస్క్‌లకు సక్రమంగా నాశనం చేయకపోతే వాటిల్లో చిక్కుకుని ఉన్న వైరస్లు ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. మరి తరుణోపాయం? ఇళ్లల్లో వాడే సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్‌లతో తయారైన ద్రావణాన్ని వాడటం ద్వారా వైరస్‌లను నిలువరించవచ్చునని ఛోయ్ తెలిపారు. లవణాలతో కూడిన ద్రావణం మాస్క్ల్లోపల స్ఫటికాల మాదిరిగా మారుతుందని, వీటికున్న పదునైన కొసలు వైరస్‌లను చంపేస్తాయని వివరించారు. ఇన్ఫ్లుయెంజా వైరస్లు మూడింటితో తాము ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించామని చెప్పారు. కేవలం ఐదు నిమిషాల్లో వైరస్ నిస్తేజమైపోగా.. అరగంటలో మరణించిందని వివరించారు. ఇదే సాంకేతికత కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు ఉపయోగపడవచ్చునని తెలిపారు. ఈ ద్రావణాన్ని వాణిజ్య స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ లోపుగా మాస్కులు ఉపయోగిస్తున్న వారు చేతివేళ్లతో మాస్కుల్లోని ఫిల్ట్రేషన్ పదార్థాన్ని ముట్టకపోవడం మేలని సూచిస్తున్నారు. -
పిడికిట్లో ఆరోగ్యం..
మీ పిడికిలి పట్టు గట్టిగానే ఉంటోందా..? అయితే, మరేం ఫర్వాలేదు. ఎలాంటి గుండెజబ్బులు లేకుండా మీరు భేషుగ్గా బతికేస్తారు. పిడికిలి పట్టుకు, గుండె ఆరోగ్యానికి నేరుగా సంబంధం ఉన్నట్లు కెనడా శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేలింది. పదిహేడు దేశాలకు చెందిన 1.40 లక్షల మందిపై పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న వారిలో 35 నుంచి 70 ఏళ్ల వరకు వివిధ వయస్సుల వారు ఉన్నారు. పిడికిలి పట్టు బలాన్ని పరీక్షించేందుకు హ్యాండ్‌గ్రిప్ డైనమోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. పిడికిలి పట్టు గట్టిగా కాకుండా, సడలినట్లు ఉంటే భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.