breaking news
Satram lands
-
దాతృత్వాన్ని దోచేశారు..
వందల మైళ్ల దూరమైనా కాలి నడకనే వెళ్లాల్సిన రోజులవి.. బాటసారులు దారి దోపిడీలు, క్రూరమృగాలతో భయాందోళన చెందుతూ ముందుకు సాగాల్సిన పరిస్థితి.. అలాంటి రోజుల్లో బాటసారుల సౌకర్యార్థం ఓ మాతృమూర్తి కొంత స్థలం ఇచ్చి సత్రం ఏర్పాటు చేయగా కొంతమంది దానిపై కన్నేశారు.. ప్రజాహితం కోసం ఇచ్చిన స్థలాన్ని నిర్లజ్జగా కబ్జా చేశారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇళ్లు నిర్మించుకున్నారు. అదేమని అడిగేవారు లేకపోవడంతో అక్కడ మద్యం దుకాణాన్ని సైతం నిర్వహిస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణలకు గురైనా సంబంధింత దేవదాయ, రెవెన్యూశాఖల అధికారులు పట్టించుకుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్ వేసేస్తున్నారు. సాక్షి, కావలి (నెల్లూరు): వందేళ్ల క్రితం వాహనాలు లేని రోజుల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రాకపోకలు సాగించే బాటసారులు అలిసిపోతే సేద తీరేందుకు, అవసరరమైతే వంట చేసుకొని భోజనాలు చేయడానికి, రాత్రులు దొంగలు, క్రూర జంతువుల నుంచి రక్షణ నిమిత్తం దాతలు సత్రాలను నిర్మించేవారు. ఈ నేపథ్యంలో కావలి పట్టణంలోని ముసునూరు మీదుగా ఉండే కాలిబాటలో సత్రం నిర్మించి, దానిని నిర్వహించేందుకు బ్రాహ్మణులకు దేవరపల్లి అన్నపూర్ణమ్మ అనే దాత 200 అంకణాలు స్థలాన్ని ముసునూరులో ఇచ్చారు. ఆ స్థలంలో సత్రానికి అవసరమైన భవనాన్ని ఆ రోజుల్లోనే పూర్తిగా బొంతరాయితో నిర్మించారు. అలాగే సత్రాన్ని నిర్వహించడానికి 3.15 ఎకరాల భూమిని కూడా ఇచ్చారు. ఈ భూమిని కౌలుకు ఇవ్వడం ద్వారా వచ్చే రాబడితో సత్రాన్ని నిర్వహించాలనేది దాత లక్ష్యం. కాలక్రమంలో రవాణా సౌకర్యాలు మెరుగై కాలినడకన రాకపోకలు సాగించే బాటసారులు తగ్గిపోయి అక్కడ వసతి పొందేవారు లేక సత్రం శిథిలమైపోయింది. దీంతో ఈ సత్రంపై ఆక్రమణదారుల కన్నుపడింది. ముసునూరులో సర్వే నంబర్ 146/2లో ఉన్న 200 అంకణాల స్థలానికి కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 100 అంకణాల స్థలాన్ని కబ్జా చేశారు. ఇక్కడ అంకణం ధర రూ.లక్షకు పైగా ఉంది. అంటే రూ.కోటికి పైగా విలువ చేసే ఈ స్థలాన్ని కబ్జా చేసి దర్జాగా ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే సత్రం స్థలంలో కొంత, రోడ్డు భాగంలో కొంత స్థలాన్ని కబ్జా చేసి మద్యం షాపును నిర్వహిస్తున్నారు. మిగిలిన 100 అంకణాల స్థలాన్ని కబ్జా చేయడానికి ముసునూరులో ఉన్న ఒక వ్యక్తి తాను సత్రానికి ట్రస్టీగా ఉన్నానంటూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి శరవేగంగా ఏర్పాట్లు చేసుకొంటున్నాడు. ఇక ఈ సత్రానికి సంబంధించి సర్వే నంబర్ 753–756లలో 3.15 ఎకరాల భూమి ఉంది. మాగాణి భూమి అయిన ఈ పొలానికి కౌలు రూపంలో ఏడాదికి కనీసం రూ.50,000 వస్తుంది. 40 ఏళ్లుగా ఈ భూమిని ముసునూరుకు చెందిన చిన్నబ్బాయ్ అనే టీడీపీ నాయకుడు ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నాడు. ఎకరా కనీసం రూ.50 లక్షలు ధర ఉంటుంది. సత్రానికి సంబంధించిన విలువైన స్థలాన్ని, భూమిని కాపాడాల్సిన దేవదాయశాఖ, రెవెన్యూశాఖలు అసలు దాని గురించి పట్టించుకోకపోవడంతో కబ్జాదారులు అడ్డూఅదుపూ లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కావలికి వచ్చిన సమయంలో సత్రం స్థలాన్ని కబ్జా చేసిన విషయం, పొలాన్ని టీడీపీ నాయకుడి ఆక్రమణలో ఉన్న అంశాన్ని కావలి బ్రాహ్మణ సంఘం నాయకులు తీసుకెళ్లారు. సత్రం స్థలాన్ని, పొలాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. సత్రం స్థలంలో బ్రాహ్మణ కల్యాణ మండపం నిర్మించేందుకు రూ.50 లక్షలు నిధులు మంజూరు చేయిస్తానని డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు. ప్రభుత్వ స్థలంలో వెంచర్.. ముసునూరులోనే పమిడి స్కూలును ఆనుకొని సర్వే నంబర్ 179లో 1.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ అంకణం కనీసం రూ.లక్ష ధర పలుకుతోంది. అంటే సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాదారులు ధైర్యంగా ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వెంచర్‌ను వేస్తున్నారు. ఈ విషయం రెవెన్యూ శాఖకు తెలిసినప్పటికీ కిందిస్థాయి ఉద్యోగులు కబ్జాదారుల వద్ద మామూళ్లు తీసుకొని వారి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలను, భూములను తమ తాతలు ముత్తాల ఆస్తులుగా కబ్జాదారులు చెర పెడుతుండడం కావలిలో నిత్యకృత్యమైపోయింది. అలాగే పట్టణంలో ఉన్న మందాటి చెరువుకు కట్ట కింద నెల్లూరు వైపు వెళ్లే ప్రధాన రోడ్డు వైపు కబ్జాలు ప్రారంభమయ్యాయి. సుమారు 20 అంకణాల స్థలాన్ని ఆక్రమించుకోవడానికి రాళ్లు పాతారు. ఇక్కడ కూడా అంకణం రూ.లక్షకు పైనే పలుకుతోంది. అంటే రూ.20 లక్షల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేయడానికి భూకబ్జాసురులు ఏర్పాట్లు చేసుకొంటున్నారు. -
సత్రం భూములు స్వాహా
సాక్షి, ఆకివీడు (పశ్చిమ గోదావరి): సత్రం భూములంటే చులకన ఎందుకో. పూర్వం సత్రాలను ఏర్పాటు చేసి, దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, సందర్శకులు విశ్రాంతి తీసుకునేందుకు సత్రాలను ఏర్పాటు చేశారు. సత్రానికి వచ్చే జనంకు ఉచితంగా భోజన వసతి కల్పించేవారు. ఆ ప్రకారంగా నూజివీడు జమిందారులు తమ ఆధీనంలో ఉన్న భూముల్ని సత్రాలకు, దేవాలయాలకు, అర్చకులకు దారాధత్తం చేశారు. తీపర్రు గ్రామంలోని ఈడ్పుగంటి రత్తమ్మ సత్రంకు నూజివీడు జమిందారులు 19 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. సేవా తత్పరతతో ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని అనాథలకు, దూర ప్రయాణికులకు వసతులు కల్పించేందుకు ఈ సొమ్మును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. తీపర్రులోని ఈడ్పుగంటి రత్తమ్మ సత్రంకు చెందిన భూమి ఆకివీడు మండలంలోని పెదకాపవరం గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో 19 ఎకరాల మాగాణి భూమి ఉంది. దీని ద్వారా సత్రంకు ఏటా రూ.3.35 లక్షలు ఆదాయం వస్తుంది. రెండు పంటలు పుష్కలంగా పండే పంట భూమి ఏడాదికి ఎకరాకు రూ.20 వేలు లీజు చెల్లిస్తున్నారు. సత్రం భూమి అన్యాక్రాంతం సత్రం భూమి అన్యాక్రాంతం అయ్యింది. సరిహద్దుల్లో ఉన్న రైతుల ఆక్రమణల్లో కుంచించుకుపోతోంది. సత్రం భూమిలో సరిహద్దు రైతు బోరు వేసి తన రొయ్యల చెరువుకు ఉప్పునీటిని తోడుకుంటున్నారు. మరో రైతు కూడా సత్రం భూమిలో అనధికారికంగా బోరు వేశారు. నేనేమీ తక్కువ కాదన్నట్లు మరో సరిహద్దు రైతు ఇంకో రెండు మెట్లు ఎక్కి తన రొయ్యల చెరువుకు ఏకంగా రోడ్డు మార్గాన్నే నిర్మించేశారు. తన చెరువుకు అనువుగా రోడ్డు కూడా నిర్మించారు. మరో సరిహద్దు రైతు తన రొయ్యలచెరువుకు సత్రం భూమిలో విద్యుత్ స్తంభాలు పాతుకుంటూ వెళ్లిపోయి, విద్యుత్ సరఫరా పొందారు. సత్రం భూమిని ఇలా నాలుగు వైపులా ఉన్న సరిహద్దు దారుల ఆక్రమణల చెరలోకి వెళ్లిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సత్రం భూములు సన్నగిల్లి, కుంచించుకుపోతాయని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సత్రం భూముల ఆక్రమణలపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నోటీసులిస్తాం తీపర్రులోని ఈడుపుగంటి రత్తమ్మ సత్రం భూములు పెదకాపవరంలో 19 ఎకరాలున్నాయి. దీనిలో 3 ఎకరాలు చెరువుల సాగుతో నిరుపయోగంగా ఉంది. మరో 16 ఎకరాల భూమిలో వరి సాగుకు లీసుకు ఇచ్చాం. ఎకరాకు రూ.20 వేలు చొప్పున ఏడాదికి రూ.3.64 లక్షలు ఆదాయం వస్తుంది. అన్యాక్రాంతమైన సత్రం భూముల ఆక్రమణదారులకు నోటీసులు అందజేస్తాం. తమ భూముల్ని పరిరక్షించాలని, తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్, ట్రాన్స్‌కో ఏఈడీకి ఫిర్యాదు చేస్తాం. త్వరలోనే సర్వే చేసి సత్రం భూముల్ని రక్షించుకుంటాం. – ఎం.వెంకట్రావు, కార్యనిర్వాహణాధికారి, కానూరు -
‘సదావర్తి స్కాం విలువ రూ.2 వేల కోట్లు’
విజయవాడ (భవానీపురం): అమరావతి సదావర్తి సత్రం భూముల వేలంలో రూ.2వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. విజయవాడలోని ఆ పార్టీ నగర కార్యాలయంలో నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు దాదాపు రూ.2వేల కోట్ల స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఈఓ శ్రీనివాసరెడ్డి హస్తం ఉందన్నారు. ఈ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.