breaking news
Sarah sales
-
సారాపై సమరం
- గ్రామాభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పిసున్న ఎక్సైజ్ - నిషేధం అమలుకు పకడ్బందీ చర్యలు - 48 మంది సారా విక్రేతల బైండోవర్ మోర్తాడ్ : సారాపై ఎక్సైజ్ శాఖ సమర భేరి మోగించింది. సారా అమ్మకాలపై ఇప్పటివరకు చూసీ చూడనట్టుగా వ్యవహరించారన్న విమర్శలను మూటగట్టుకున్న ఎక్సైజ్ అధికారులు.. తమపై పడిన మచ్చను తుడుచుకునేందుకు చర్యలు చేపట్టారు. గ్రామాలలో తిరుగుతూ, సారా అమ్మితే ఏర్పడే ఇబ్బందులు.. తాగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నారు. సారా నిషేధం అమలు దిశగా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. సారా విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, ఇందుకోసం సర్వాధికారాలను ఉపయోగించుకోవాలని, ఈ విషయంలో విఫలమైతే ఊరుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎక్సైజ్ అధికారుల్లో మునుపెన్నడూ లేనంత కదలిక వచ్చింది. ఒకవైపు దాడులు కొనసాగిస్తూ, మరోవైపు ప్రజలను చైతన్యవంతం చేస్తూ ద్విముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కేసులు, బైండోవర్లు మోర్తాడ్, భీమ్‌గల్, ఆర్మూర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలో ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని గ్రామాలలో సారా తయారీ, విక్రయదారులపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించారు. వీరిని అరెస్టు చేస్తున్నారు. గతంలో కేసులలో ఉన్న వారిని సంబంధిత తహశీల్దారుల ముందు బైండోవర్ చేస్తున్నారు. ఇకపై సారా విక్రయించబోమంటూ వారి నుంచి లక్ష రూపాయలకు పూచీకత్తు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 48 మంది సారా విక్రేతలను బైండోవర్ చేశారు. వీరిలో ఒక్క మోర్తాడ్ సర్కిల్ పరిధిలోనే 22 మంది ఉన్నారు. నల్ల బెల్లం వ్యాపారులను కూడా తహశీల్దారుల ఎదుట బైండోవర్ చేసి, కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలతో సమావేశాలు జిల్లాలోగల పది ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో రోజుకు కొన్ని గ్రామాల చొప్పున సారా నిషేధంపై ప్రజలతో సమావేశాలను అధికారులు నిర్వహిస్తున్నారు. సారా విక్రయాలకు అంతర్గతంగా సహకరిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలకు అవగాహన కల్పిస్తున్నారు. తమ గ్రామం నుంచి సారాను పారదోలుతామంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. సారా తయారీ, విక్రయాలు సాగకుండా చూస్తామంటూ మోర్తాడ్ సర్కిల్ పరిధిలోని గుమ్మిర్యాల్, తిమ్మాపూర్, రామన్నపేట్, దోన్పాల్, సుంకెట్ తాండ, చౌట్పల్లి, గట్ల కోనాపూర్; భీమ్‌గల్ సర్కిల్ పరిధిలోని సంతోష్‌నగర్; కామారెడ్డి సర్కిల్ పరిధిలోని క్యాసంపల్లి, శాబ్దిపూర్; దోమకొండ సర్కిల్ పరిధిలోని యాడారం, సంగమేశ్వర్ గ్రామాల ప్రజల నుంచి ఎక్సైజ్ అధికారులు హామీ తీసుకున్నారు. మిగతా గ్రామాల ప్రజల నుంచి కూడా ఇలాగే మాట తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జరిమానాకు తీర్మానం గుమ్మిర్యాల్‌లో సారా విక్రయాలకు అక్కడి గ్రామాభివృద్ధి కమిటీ గతంలో వేలం నిర్వహించింది. దీనిని, ఆ కమిటీ తాజాగా రద్దు చేసింది. సారా విక్రయిస్తే రూ.10వేల జరిమానా విధించాలని తిమ్మాపూర్, చౌట్పల్లి, రామన్నపేట్, దోన్పాల్, గట్ల కోనాపూర్‌లోని గ్రామాభివృద్ధి కమిటీలు తీర్మానించాయి. సారా విక్రయాలను నిలిపివేస్తే తాగేవారు మానుకుంటారని ఈ కమిటీలు భావిస్తున్నాయి. పూర్తిగా అడ్డుకుంటాం సారా విక్రయాలను పూర్తిగా అడ్డుకుంటాం. సారాతో కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తున్నాం. సారాతో ఆరోగ్యం దెబ్బతింటుందని, ఆర్థిక ఇబ్బం దులతో కుటుంబాలు వీధిన పడతాయని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలి. - అరుణ్ రావు, డిప్యూటి కమిషనర్, ఎక్సైజ్ శాఖ లొల్లి పోయింది సారా టెండర్లను రద్దు చేస్తున్నట్టుగా గ్రా మాభివృద్ధి కమిటీలు ప్రకటించడంతో సారా లొల్లి పోయింది. గ్రామాభివృద్ధి కమిటీ టెండర్లు నిర్వహించడంతో ఇన్నాళ్లూ మేము అడ్డు చెప్పలేకపోయాం. - తస్లీమ్, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, గుమ్మిర్యాల్ కమిటీలు గుర్తించాయి సారాతో కలిగే నష్టాలను గ్రామాభివృద్ధి కమిటీలు గుర్తించాయి. సారా నిషేధానికి అవి నడుం బిగించడంతో సత్ఫలితాలు వస్తాయి. సారా వ్యాపారులు, తాగేవారిలోనూ కూడా మార్పు వస్తుంది. - ఉగ్గెర భూమేశ్వర్, సర్పంచ్, తిమ్మాపూర్ -
వడ్రపాలెం టు సింగ్‌పూర్..
- నాడు సారా అమ్మకాలకు నిలయం - నేడు విద్యావంతులు, ఉద్యోగుల మయం - మద్యం అమ్మకాలు నిషేధం - ఉపాధి కోసం విదేశాలకు... - ఆదర్శంగా నిలిచిన వడ్రపాలెం గ్రామస్తులు దేవరాపల్లి: మండలంలోని ఎన్జీనగరం పంచాయతీ శివారు వడ్రపాలెం గ్రామంలో సుమారు పదేళ్ల క్రితం వరకు సారా అమ్మకాలకు నిలయంగా ఉండేది. నిత్యం గ్రామంలో సారా ఏరులై పారేది. నిత్యం మద్యం బాబుల ఆగడాలతో తగాదాలు, అల్లర్లు చోటు చేసుకొనేవి. మహిళలు నరక యాతన పడేవారు. అయితే 2006 అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున జాతిపిత సాక్షిగా మద్యం, సారా అమ్మకాలను గ్రామంలో నియంత్రించాలని మహిళలు పూనుకున్నారు. వీరికి గ్రామ పెద్దలు అండగా నిలవడంతో అంతా కలిసి మద్యం మహమ్మారిని గ్రామం నుండి పారదోలాలని నిర్ణయించుకున్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మహిళలకు క్రమేపి మగవారంతా మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం వడ్రపాలెంతో పాటు ఎన్జీ నగరం కూడా మద్య రహిత గ్రామంగా మండలంలో గుర్తింపు సంపాదించుకుంది. వడ్రపాలెంలో సుమారు 60 ఇళ్లు ఉన్నాయి. 250 మందికి పైగా జనాభా ఉన్నారు. 30 మందికి పైగా సింగ్‌పూర్‌లో.. గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలలో వెల్డర్, ఫిట్టర్, షిప్ మరమ్మతులు తదితర పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వీరు సింగ్‌పూర్, అబుదబీ, దుబాయ్, సౌత్ఆఫ్రికా, మాల్ దీవులు, బెహరాన్ తదితర దేశాలలో ఉపాధి కోసం వెళ్లారు. రెండేళ్లకోసారి వస్తుంటారు. బోని శ్రీను, బోని సత్యరావు, కుంది సత్యారావు, పైడి రాజు, గాడి అప్పల సత్యారావు,బోని సతీస్, ఖండేపల్లి రాజు, తదితరులు సింగ్‌పూర్‌లో ప్రస్తుతం ఉపాధి పొందుతున్నారు. మరి కొందరు బెహరాన్, అబుదబీలో ఉంటూ ఉపాధి పొందుతున్నారు. ఉన్నత విద్యావంతులుగా.. ఒకప్పుడు సారాకు అమ్మకాలకు ప్రసిద్ధి చెందిన ఈ గ్రామంలో ప్రస్తుతం పలువురు విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కుంది హారిక ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోయినా మేనత్త సహకారంతో పీహెచ్డీ పూర్తి చేశారు. బురిడి శంకరరావు పీహెచ్డీ పూర్తి చేసి నన్నయ్య యూనివర్సిటిలో ప్రొపెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. సబ్బవపు శ్రీను పీహెచ్డీ, కుంది లోకేష్, కుంది శేఖర్లు పీజీలు చేస్తున్నారు. కార్లె త్రినాధ్ ఎమ్మెస్సీ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నారు. ఇక్కడ ఉపాధి లేక.. గ్రామంలో ఉపాధి లేక పోవడంతో ఎనిమిదే ళ్లుగా విదేశాలకు వెళ్తున్నాను. 10వ తరగతి చదివిన తాను వెల్డింగ్‌లో శిక్షణ పొందాను. ఇప్పటి వరకు సింగ్‌పూర్, అబుదబీ, సౌత్ అరేబియా వెళ్లాను. అక్కడ నెలకు రూ. 20 వేల నుంచి 30 వేల ఆదాయం వస్తుంది. -ఖండేపల్లి జగన్నాధరావు, వడ్రపాలెం సింగ్‌పూర్‌లో వెల్డర్‌గా.. పదేళ్లుగా సింగ్‌పూర్‌లో వెల్డర్‌గా పని చేస్తున్నాను. రెండేళ్ల కోసారి గ్రామానికి వస్తుంటాను. గ్రామంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తోంది. తమ పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటున్నారు. -గాడి అప్పల సత్యారావు, వడ్రపాలెం