breaking news
Sanghparivar
-
రాజ్యాంగ హక్కులపై ‘సంఘ్’ దాడి
♦ మహాధర్నాలో వామపక్ష, సామాజిక, ప్రజాసంఘాల నేతలు ♦ కన్హయ్యను విడిచిపెట్టాలి.. ♦ దత్తాత్రేయ, స్మృతిఇరానీలను తొలగించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగపరమైన హక్కులను సంఘ్‌పరివార్ మతోన్మాదశక్తులు హరిస్తున్నాయని పలువురు వక్తలు ఆరోపించారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఎత్తేసి ఆయనను బేషరతుగా విడుదల చేయాలని, హెచ్‌సీయూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారుకులైన కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలని, వీసీ అప్పారావును ఆ పదవి నుంచి తొలగించాలని వామపక్షాలు, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీహెచ్ సీతారాములు(సీపీఎం), చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా(సీపీఐ), జానకిరాములు (రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ), మురహరి(ఎస్‌యూసీఐ-సీ), ఇంద్రకరణ్ (ఏఐఎఫ్బీ), భూతం వీరన్న (సీపీఐ-ఎంఎల్), శ్రీనివాస్ బహదూర్ (బీఎస్పీ), నలమాస కృష్ణ(టీపీఎఫ్), విమలక్క(అరుణోదయ), జిలుకర శ్రీనివాస్ మాట్లాడారు. పార్లమెంటులో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రసంగాన్ని అందరూ పొగుడుతున్నారని, అసలు అందులో ఏమైనా సరుకుందా అని ప్రశ్నించారు. దేశంలో వరుసగా జరుగుతున్న దాడులు, ఘటనలు చూస్తుంటే అత్యున్నత విద్యాసంస్థలను తమకు అనుకూలంగా మలుచుకుని, మేధావులతో గులాంగిరి చేయించుకోవాలనే సంఘ్‌పరివార్ కుట్ర కనిపిస్తోందన్నారు. తెలంగాణలో కూడా ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరారు. సంఘ్పరివార్శక్తులను అడ్డుకునేందుకు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కన్హయ్య బెయిల్‌పై విడుదలైనా రక్షణలేని పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్యతో దోషిగా బోనులో నిలబడిన కేంద్రం కన్హయ్యపై దేశద్రోహం కేసుతో తప్పించుకోవాలని చూస్తోందన్నారు. రోహిత్ కేసులో ఎఫ్ఐఆర్లో పేర్లున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ(రాయల) నేత వేములపల్లి వెంకట్రామయ్య, న్యూడెమోక్రసీ(చంద్రన్న) నేత సాదినేని వెంకటేశ్వరరావు, ఎంసీపీఐ-యూ నేత ఎండీ గౌస్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, కె.గోవర్థన్, డీజీ నర్సింహారావు, డాక్టర్ సుధాకర్, తేజ, గోవింద్, తాండ్ర కుమార్, గోపీ, ఝాన్సీ పాల్గొన్నారు. -
నన్ను అంతమొందించే కుట్ర
హైదరాబాద్: ‘నన్ను అంతమొం దించే కుట్ర జరుగుతోంది..ఎప్పటివరకు బతుకుతానో తెలియదు..భద్రతా సిబ్బంది ఉన్నా.. ప్రాణాలకు భరోసా లేదు..ఏక్షణమైనా ఎవరైనా మట్టుబెట్టొచ్చు’ అని మజ్లిస్‌పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్య లు చేశారు. మహ్మద్‌ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్-నబీ సందర్భంగా మజ్లిస్‌పార్టీ ఆధ్యర్యంలో దారుస్సలాం మైదానంలో మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన బహిరంగసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. సంఘ్‌పరివార్,హిందుత్వశక్తులు తనను అంతమొందించడం జరిగితే..పాతబస్తీలో ప్రతిఇంట్లో ఒక అక్బరుద్దీన్ గా మారి ముస్లింల పక్షాన గళం విప్పాలని, పార్టీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న అఘాత్యాలపై మౌనం వహించడం వల్లే ముజఫర్‌నగర్ లాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. ‘ముస్లింల పక్షాన గళం విప్పేవారిని జైళ్లలో పెడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. మజిస్ల్ పా ర్టీని అంతమొందించే కుట్రలు చేశారు. తనను జైలులో ఉంచారు. కనీసం మంచినీళ్లు, దుప్పటి కూడా ఇవ్వలేదు. వాంతులు చేసుకున్నా కనీసం ఆస్పత్రికి తీసుకెళ్లకుండా ఇబ్బందులకు గురిచేశారని’ ఆయన వెల్లడించారు. చట్టంపై తనకు నమ్మకం ఉందంటూ..దేశవ్యాప్తంగా ముస్లింల పక్షాన గళం విప్పి తీరుతామని అక్బర్ ప్రకటించారు. కార్యక్రమంలో మజ్లిస్‌పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు మతగురువులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.