breaking news
Sanam Saeed
-
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్‌లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్‌లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్‌లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్‌టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్‌ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్‌ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్‌తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
భారత్ లో వెండితెర.. పాకిస్తాన్ లో బుల్లితెర!
న్యూఢిల్లీ: ఆధునిక సమాజంలో చోటు చేసుకునే వాస్తవ పరిస్థితులను సినిమాల రూపంలో తెరకెక్కించడంలో పాకిస్తాన్ కంటే భారత్ చాలా ముందు వరుసలో ఉందని పాక్ ఫ్యాషన్ ఐకాన్ సనామ్ సయీద్ అభిప్రాయపడింది. కానీ, పాకిస్తాన్ లో మాత్రం ఏమి చెప్పాలన్నా టెలివిజన్లనే ఎక్కువ నమ్ముకుంటారని స్సష్టం చేసింది. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఫోన్లో ఇచ్చిన ఇంటర్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. 'జిందగీ గుల్జార్ హై' షోతో భారత్ ప్రేక్షకులకు పరిచయమైన సనామ్.. అత్యధిక సినిమాలను నిర్మించే సత్తా భారత్ లో ఉందని పేర్కొంది. పాకిస్తాన్ లో మాత్రం చాలా తక్కువగా సినీ నిర్మాణం జరుగుతుందని తెలిపింది. భారత్ లో సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చినంతగా ఇక్కడ(పాకిస్తాన్)లో ఇవ్వరు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలను నిర్మించే చిత్ర పరిశ్రమల్లో ఒకటైన బాలీవుడ్ లో రాజకీయాలు, ప్రేమ, కుటుంబ తరహా కథల్ని సినిమా రూపంలో తెరకెక్కిస్తుంటారని సనామ్ తెలిపింది. అది యువ నటులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు దోహదం చేస్తుందని ఆమె పేర్కొంది. 'పాకిస్తాన్ లో ఎక్కువ చిత్రాలు నిర్మించరు. మాకు థియేటర్ లు కూడా తక్కువే. మేము ఏదైనా చెప్పడానికి బుల్లితెరనే నమ్ముకుంటాం'అని సనామ్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ లో అత్యధిక శాతం మంది ఇంట్లో కూర్చునే వినోదాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడతారని.. వారికి కావాల్సినది టీవీల రూపంలో దొరుకుతుండటమే ఇందుకు ప్రధాన కారణం కావచ్చని తెలిపింది.