రూ. 300 కోట్ల క్లబ్లో బాహుబలి
చెన్నై: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మొన్నటి దాకా వంద కోట్ల రూపాయల బిజినెస్ చేయగల సినిమా కోసం ఎదురు చూశారు. అలాంటిది ఏకంగా 100, 200 కోట్లు దాటి 300 కోట్ల రూపాయలు వసూలు చేయడమంటే సంచలనమే. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఈ ఘనత సాధించింది. దక్షిణాదిలో 300 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించింది. ఈ సినిమా 9 రోజుల్లో ఈ కలెక్షన్లు రాబట్టింది. ఇంతకుముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో' (బహుబాషా చిత్రం) 290 కోట్లు రూపాయలు వసూళ్లు సాధించింది. తాజాగా బాహుబలి ఈ రికార్డును బద్దలు కొట్టింది.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు నటించిన బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. భారత్లో అతితక్కువ కాలంలో 100 కోట్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి నిలిచింది. హిందీ వర్సెన్లో 50 కోట్లు వసూలు చేసింది. ఓ డబ్బింగ్ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం గొప్ప విషయమని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడ్డారు.